Parivarthana Rajaneethi Party : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త ప్రయోగానికి తెరలేచింది. ఇప్పటివరకు ప్రధానంగా రెండు రాజకీయ శిబిరాల మధ్యే సాగుతున్న రాష్ట్ర రాజకీయాల్లో మూడో ప్రత్యామ్నాయాన్ని నిర్మించేందుకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రంగంలోకి దిగారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో అనుబంధాన్ని తెంచుకున్న ఆయన.. ఇప్పుడు సొంత రాజకీయ వేదికను ఏర్పాటు చేసుకున్నారు. ‘పరివర్తన రాజనీతి పార్టీ’ (PRP) పేరుతో కొత్త పార్టీని ప్రకటించారు. అయితే ఈ పార్టీ పేరులోనే ఆసక్తికరమైన రాజకీయ చర్చ మొదలైంది. గతంలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని గుర్తుచేసేలా పీఆర్పీ అనే సంక్షిప్త నామాన్ని ప్రదర్శించామా? లేక రాజకీయంగా ప్రజల్లోకి వెళ్లేందుకు చేసిన వ్యూహమా? అన్న చర్చ మొదలైంది.
రెండు రాజకీయ శిబిరాల మధ్య మూడో ప్రయోగం!
ఏపీ రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తే గత కొన్నేళ్లుగా వైసీపీ, టీడీపీ మధ్యే అధికారం కోసం పోటీ చేస్తోంది. జనసేన కూడా రాజకీయ శక్తిగా ఎదిగి ప్రస్తుతం టీడీపీ, బీజేపీలతో కలిసి కూటమి భాగంగా కొనసాగుతోంది. మరోవైపు కాంగ్రెస్ రాష్ట్రంలో తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో మరో చర్చకు కారణమైంది.
కొత్త పార్టీ పెట్టడం రాజకీయాల్లో ఎత్తయితే.. ఇప్పటికే బలంగా పాతుకుపోయిన పార్టీల మధ్య తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకోవడం మరో ఎత్తు. ముఖ్యంగా ఏపీలో పార్టీలు కేవలం సిద్ధాంతాల ఆధారంగానే కాకుండా నాయకత్వం, సామాజిక సమీకరణలు, ప్రాంతీయ ప్రభావం, సంక్షేమ పథకాలు, వ్యక్తిగత రాజకీయాల ఆధారంగా కూడా బలపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ఎంతవరకు ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరం.
11-11-11 ముహూర్తం.. రాజకీయంగా ప్రత్యేక సందేశం!
కొత్త పార్టీ ప్రకటనకు విజయసాయిరెడ్డి ఎంపిక ముహూర్తం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నవంబర్ 11వ తేదీ ఉదయం 11 గంటల 11 నిమిషాలకు విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్ వేదికగా పార్టీని ప్రకటించారు. 11-11-11 అనే ప్రత్యేక సంఖ్యను ముహూర్తంగా నిర్వహించడం ద్వారా కొత్త రాజకీయ ప్రయాణానికి ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.
అయితే ముహూర్తం ఎంత ప్రత్యేకంగా ఉన్నా.. ప్రజల్లో పార్టీకి ఆదరణ లభించాలంటే అంతకంటే బలమైన రాజకీయ కార్యాచరణ అవసరం. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నిర్మాణం, నియోజకవర్గ స్థాయిలో నాయకత్వం, యువతకు ప్రాధాన్యత, ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం వంటి అంశాలే భవిష్యత్తును నిర్ణయిస్తున్నాయి.
జగన్తో ముగిసిన అనుబంధం.. ఆత్మగౌరవమే కారణమా?
విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ప్రకటనలో ఆయన గత రాజకీయ ప్రయాణం కూడా కీలకంగా మారింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో తాను కీలక పాత్ర పోషించానని, పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని ఆయన గుర్తుచేశారు. అయితే చివరకు తనకు తగిన గుర్తింపు లభించలేదనే ఆవేదనను వ్యక్తం చేశారు.
జగన్తో తన రాజకీయ అనుబంధం ముగిసిందని ఆయన ప్రకటించారు.. విధేయతకు, బానిసత్వానికి మధ్య తేడా ఉందనే వ్యాఖ్యలతో తన నిర్ణయానికి కారణాన్ని వివరించే ప్రయత్నం చేశారు. వ్యక్తిగత ఆత్మగౌరవం రాజకీయాల్లో కూడా ముఖ్యమని ఆయన చెప్పకనే చెప్పారు.
ఇక్కడే కొత్త పార్టీకి ఒక కీలకమైన ప్రశ్న ఎదురవుతోంది. వైసీపీ నుంచి బయటకు వచ్చిన అసంతృప్త నాయకులకు వేదికగా మాత్రమే ఈ పార్టీ మిగిలిపోతుందా? లేక నిజంగానే కొత్త రాజకీయ సిద్ధాంతంతో ప్రజల్లోకి వెళ్తుందా? అనేది చూడాలి.
కుల సమీకరణలకు దూరంగా.. అభివృద్ధి రాజకీయాలే లక్ష్యమా?
ఏపీ సామాజిక సమీకరణలు ఎప్పుడూ కీలక పాత్ర పోషిస్తాయి. ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా వివిధ సామాజిక వర్గాల మద్దతు అవసరం. అయితే విజయసాయిరెడ్డి మాత్రం కుల, మత రాజకీయాలను తిరస్కరిస్తూ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే తమ పార్టీ ప్రధాన అజెండా అని ప్రకటించారు.
రాయలసీమ ఆత్మగౌరవం, ప్రాంతీయ అభివృద్ధి, యువతకు అవకాశాలు వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. ముఖ్యంగా యువతను రేపటి నాయకులుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఇది వినడానికి ఆకర్షణీయమైన రాజకీయ నినాదమే అయినప్పటికీ.. ఆచరణలో ఎంతవరకు సాధ్యమవుతుందన్నదే అసలు పరీక్ష.
హామీలకు కొదవలేదు.. అమలు ఎలా?
కొత్త పార్టీ ప్రకటించిన లక్ష్యాల్లో వ్యవసాయం, విద్యుత్, సాగునీరు, వంటి అంశాలకు ప్రాధాన్యత ఏర్పడింది. రాష్ట్రంలో కరెంట్ కోతలు లేకుండా చూడటం, ప్రతి ఎకరాకు రెండు పంటలకు సరిపడా సాగునీరు అందించడం, రైతులకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించడం వంటి హామీలను విజయసాయిరెడ్డి ప్రకటించారు.
అలాగే జెన్ జీ యువతకు 100 శాతం ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెబుతున్నారు. చదువుల భారాన్ని తగ్గించడం, బలహీన వర్గాలకు అండగా నిలవడం, దశాబ్దాలుగా పరిష్కారం కానీ ప్రజా సమస్యలకు పరిష్కారం చూపడం తమ లక్ష్యమని.
అయితే ఈ హామీలకు అవసరమైన ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి సమకూరుస్తారు? ఉద్యోగాల కల్పనకు ఎలాంటి పారిశ్రామిక నేపథ్యం ఉంది? రైతులకు సాగునీరు ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేస్తారు? వంటి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది.
ప్రజారాజ్యం జ్ఞాపకాలు.. అదే పీఆర్పీ పేరుతో మరో ప్రయాణం!
ఈ కొత్త పార్టీ పేరులో మరో ఆసక్తికరమైన అంశం ఉంది. గతంలో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని కూడా పీఆర్పీ అనే సంక్షిప్త పేరుతో పిలిచేవారు. అప్పట్లో సామాజిక మార్పు, యువతకు రాజకీయ అవకాశాలు, ప్రత్యామ్నాయ నాయకత్వం వంటి నినాదాలతో ప్రజారాజ్యం రాజకీయాల్లోకి వచ్చింది. భారీ ప్రజాదరణ కూడా సంపాదించింది. కానీ చివరకు ఆశించిన రాజకీయ ఫలితాలను సాధించలేకపోయింది.
ఇప్పుడు విజయసాయిరెడ్డి కూడా అదే సంక్షిప్త అక్షరాలతో కొత్త పార్టీని ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పేరులో పోలిక ఉన్నంత మాత్రాన రాజకీయ ప్రయాణం కూడా అలాగే ఉంటుందని చెప్పలేం. కానీ ప్రజారాజ్యం అనుభవం నుంచి కొత్త పార్టీ ఏం నేర్చుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
అసలు సవాలు ఇప్పుడే మొదలైంది!
విజయసాయిరెడ్డికి రాజకీయ అనుభవం ఉంది. వైసీపీ నిర్మాణంలో కీలకంగా పనిచేశారు. పార్లమెంటరీ రాజకీయాల్లోనూ ఆయనకు అనుభవం ఉంది. రాజకీయాలపై అవగాహన కూడా ఉంది. కానీ ఒక పార్టీని నిర్మించడం, దానిని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించడం, ప్రజల్లో విశ్వసనీయత సంపాదించడం పూర్తిగా భిన్నమైన విషయాలు.
ముఖ్యంగా ప్రస్తుతం ఏపీలో టీడీపీ, వైసీపీ, జనసేనలకు ఇప్పటికే బలమైన రాజకీయ నెట్వర్క్ ఉంది. అలాంటి పరిస్థితుల్లో కొత్త పార్టీ కార్యకర్తలను సమీకరించడం, ప్రజా సమస్యలపై పోరాడే నాయకత్వాన్ని తయారు చేయడం, ఎన్నికల్లో ప్రభావం చూపే స్థాయికి ఎదగడం అంత సులభం కాదు.
మరోవైపు యువతను ఆకర్షించగలిగితే, సంప్రదాయ రాజకీయాలకు భిన్నమైన విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే కొత్త పార్టీకి కొంత రాజకీయ స్థలం దక్కే అవకాశం ఉంది.
మొత్తానికి.. విజయసాయిరెడ్డి ప్రకటించిన పరివర్తన రాజనీతికి అసలు పరీక్ష ప్రకటనతో ముగియలేదు.. ఇప్పుడే మొదలైంది. 11-11-11 ముహూర్తం పార్టీకి ప్రత్యేక గుర్తింపును ఇచ్చిందేమో కానీ, ప్రజల మనసుల్లో స్థానం సంపాదించాలంటే కార్యాచరణలోనూ పరివర్తన చూపించాలి. ఏపీ రాజకీయాల్లో మరో బలమైన శక్తిగా ఎదుగుతుందా? లేక గతంలో వచ్చిన ప్రత్యామ్నాయ పార్టీల జాబితాలో మరో పేరుగా మిగిలిపోతుందా? అన్నది రాబోయే రోజుల్లో తేలుతుంది.
