అనకాపల్లి: జీవీఎంసీ 107వ వార్డును ఆదర్శవంతమైన మోడల్ వార్డుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని అనకాపల్లి ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ తెలిపారు. వార్డులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సమావేశంలో ఆయన పాల్గొని కూటమి అభ్యర్థి మాదంశెట్టి చిన్నతల్లికి మద్దతుగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, APUFIDC చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కొణతాల మాట్లాడుతూ గతంలో ఈ ప్రాంతంలో అభివృద్ధి పనులు ఆశించిన స్థాయిలో జరగలేదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనకాపల్లి అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో సుమారు రూ.50 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేపట్టామని, తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.15 కోట్లతో పనులు ప్రారంభించామని వెల్లడించారు. ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ అందించడంతో పాటు రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
రైల్వే ట్రాక్ అవతల ఉన్న శ్మశానవాటిక సమస్య పరిష్కారానికి ఎంపీ సీఎం రమేష్‌తో చర్చించామని, ఫుట్ ఓవర్ బ్రిడ్జి లేదా అండర్ బ్రిడ్జి ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. రాజుపాలెం రైల్వే బ్రిడ్జి నిర్మాణం, అనకాపల్లి నుంచి వళ్లూరు వరకు రహదారి, సిరిసోపల్లి పాఠశాల ఉన్నతీకరణ వంటి పనులపై దృష్టి సారించినట్లు వివరించారు.
గతంలో ఇళ్ల కోసం డబ్బులు చెల్లించిన అర్హులైన లబ్ధిదారుల్లో మొదటి విడతగా 350 మందికి ఇళ్లు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని, మిగిలిన అర్హులకు కూడా ఇళ్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అర్హులైన వారికి పెన్షన్లు, ఇళ్ల మంజూరుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.
107వ వార్డులో కూటమి అభ్యర్థి మాదంశెట్టి చిన్నతల్లి విజయం సాధిస్తే వార్డు అభివృద్ధికి అదనంగా రూ.2 కోట్ల నిధులు కేటాయించి మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టి 107వ వార్డును మోడల్ వార్డుగా తీర్చిదిద్దుతామని తెలిపారు.




