అనకాపల్లి, అక్టోబర్ 31: పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం నిస్వార్థంగా సేవలందించి పదవీ విరమణ పొందిన ఎస్ఐ, ఏఎస్ఐల సేవలు అభినందనీయమని జిల్లా అదనపు ఎస్పీ ఎల్. మోహనరావు అన్నారు.
జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ ఆదేశాల మేరకు అనకాపల్లి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో శనివారం పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ (పీసీఆర్)లో విధులు నిర్వహిస్తూ 41 సంవత్సరాల పాటు సేవలందించిన ఎస్ఐ ఎం. సురేంద్ర కుమార్, ఎలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తూ 36 సంవత్సరాల సర్వీసును పూర్తి చేసుకున్న ఏఎస్ఐ కె. వీర్ రెడ్డిని అదనపు ఎస్పీ ఎల్. మోహనరావు శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ విధుల్లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ప్రజల రక్షణకు తమ జీవితాలను అంకితం చేసిన అధికారుల సేవలు ఆదర్శనీయమని కొనియాడారు. ఉద్యోగ విరమణ అనంతరం వారు కుటుంబ సభ్యులతో కలిసి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, మానసిక ప్రశాంతతతో శేష జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా పదవీ విరమణ పొందిన అధికారులు మాట్లాడుతూ.. తమ సుదీర్ఘ ఉద్యోగ ప్రస్థానంలో సహకరించిన ఉన్నతాధికారులకు, సహచర సిబ్బందికి, కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్‌బీ డీఎస్పీ వి. బాబ్జీరావు, ఏవో సీహెచ్. తిలక్ బాబు, సీఐలు బాలసూర్యరావు, శ్రీనివాసరావు, రమణయ్య, రామకృష్ణారావు, ఎస్ఐలు ప్రసాద్, అంజిబాబు, శ్రీనివాసరావుతో పాటు పలువురు పోలీస్ అధికారులు, కార్యాలయ సిబ్బంది, పదవీ విరమణ పొందిన అధికారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.




