Home Uncategorized అనకాపల్లి అభివృద్ధికి రూ.100 కోట్ల నిధులు

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యం: ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ

109వ వార్డు కూటమి అభ్యర్థి బుద్ధ జ్యోతి శ్రీనివాస్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించండి

అనకాపల్లి అభివృద్ధికి రూ.100 కోట్ల నిధులు

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యం: ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ

109వ వార్డు కూటమి అభ్యర్థి బుద్ధ జ్యోతి శ్రీనివాస్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించండి

by andhra andhrawave
0 comments

అనకాపల్లి: అనకాపల్లి పట్టణ అభివృద్ధికి సుమారు రూ.100 కోట్ల నిధులు మంజూరయ్యాయని, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ తెలిపారు. జీవీఎంసీ స్థానిక సంస్థల ఎన్నికల్లో 109వ వార్డు కూటమి కార్పొరేటర్ అభ్యర్థి బుద్ధ జ్యోతి శ్రీనివాస్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా 109వ వార్డు కుటుంబ సభ్యులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో కొణతాల రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనకాపల్లి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో కూటమికి మద్దతుగా నిలిచిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

అనకాపల్లి పట్టణంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి సుమారు రూ.50 కోట్లు, తాగునీటి సదుపాయాల కల్పనకు రూ.49 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. తాగునీటి సమస్య పరిష్కారంతో పాటు రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, వీధి దీపాల సదుపాయాలను మెరుగుపరిచేందుకు చర్యలు చేపడుతున్నామని వివరించారు.

నూకాంబిక అమ్మవారి ఆలయ ఆర్చ్ సమీపంలో తరచూ నీరు నిలిచిపోవడం, ప్రమాదాలు చోటుచేసుకోవడం వంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సుమారు రూ.50 కోట్లతో ఫ్లైఓవర్ నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని తెలిపారు. డీపీఆర్‌తో పాటు అవసరమైన ప్రక్రియలను పూర్తి చేసి నిర్మాణ పనులు ప్రారంభించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.

అంతర్గత రహదారుల అభివృద్ధికి కూడా నిధులు కేటాయించామని, ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించే వార్డులో ప్రజలు సూచించిన అభివృద్ధి పనుల కోసం అదనంగా రూ.2 కోట్లతో ప్రత్యేకంగా పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.

కాలనీల నుంచి జాతీయ రహదారికి అనుసంధానంగా రహదారులు, సర్వీస్ రోడ్లు నిర్మించేందుకు రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకు వస్తే అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రహదారుల అభివృద్ధి వల్ల రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు భూముల విలువ కూడా పెరుగుతుందని పేర్కొన్నారు.

వ్యవసాయ రంగానికి కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, సాగునీటి కాలువలు, గ్రోయిన్ల మరమ్మతులకు నిధులు కేటాయించి ప్రతి నీటి చుక్క రైతులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అనకాపల్లి జిల్లాకు పరిశ్రమల పెట్టుబడులు తీసుకురావడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

మహిళలకు రాజకీయాల్లో సముచిత ప్రాధాన్యత కల్పించాలనే ఉద్దేశంతో అనకాపల్లిలోని ఆరు వార్డుల్లోనూ మహిళలకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. ప్రజల సహకారంతో అనకాపల్లిని అభివృద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.

అనకాపల్లి అభివృద్ధి కొనసాగాలంటే జీవీఎంసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని, ముఖ్యంగా 109వ వార్డు అభ్యర్థి బుద్ధ జ్యోతి శ్రీనివాస్‌కు ప్రజలు తమ మద్దతు తెలిపి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కొణతాల రామకృష్ణ కోరారు.

ఈ కార్యక్రమంలో మాజీ శాసనమండలి సభ్యులు బుద్ధ నాగ జగదీష్, గవర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర, కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird