బాలీవుడ్లో మరోసారి బెదిరింపుల కలకలం చోటు చేసుకుంది. తాజాగా సైఫ్ అలీఖాన్‌కు హత్య బెదిరింపు వచ్చినట్టు వార్తలు బయటకు రావడంతో ఇండస్ట్రీలో ఉత్కంఠ. బాబా సిద్ధిఖీ హత్య కేసులో వాంటెడ్ నిందితుడిగా ఉన్న జీషన్ అక్తర్ పేరుతో ఈ బెదిరింపు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే, నిజంగానే గ్యాంగ్స్టర్ల నుంచే ఈ వార్నింగ్ వచ్చిందా, లేదా ఎవరైనా అతని పేరు వాడుకుని నకిలీ బెదిరింపులతో భయపెడుతున్నారా అనే కోణంలో ముంబై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఇటీవల బాలీవుడ్ స్టార్లను టార్గెట్ చేస్తూ వస్తున్న బెదిరింపుల తీరుపై పోలీసులలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకుముందు తుషార్ కపూర్, ఆయుష్మాన్ ఖురానాలకు కూడా ఇలాంటి బెదిరింపులు రాగా, ఆ కేసులో బెంగళూరుకు చెందిన 30 ఏళ్ల ఐఐటీ గ్రాడ్యుయేట్ వైభవ్ మిశ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. అతనికి ఏ గ్యాంగ్‌తోనూ సంబంధం లేదని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతోనే బెదిరింపులకు దిగినట్టు విచారణలో తేలడం ఈ వ్యవహారాన్ని కొత్త మలుపు తిప్పింది.
ఈ నెల స్టార్టింగ్‌లో ఆయుష్మాన్ ఖురానాకు లారెన్స్ గ్యాంగ్ సభ్యుడిగా చెప్పుకుంటూ ఒకరు బెదిరింపు ఆడియో పంపి కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. అలాగే తుషార్ కపూర్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన హ్యారీ బాక్సర్ పేరుతో రూ. 5 కోట్ల డిమాండ్ కాల్ వచ్చింది. ఆ ఆడియో రికార్డింగ్‌ను యాంటీ ఎక్స్టార్షన్ సెల్, క్రైమ్ బ్రాంచ్ అధికారులు పరిశీలించారు, డేటాబేస్‌లోని బాక్సర్ అఫిషియల్ వాయిస్ శాంపిల్స్‌తో పోల్చి చూస్తే అవి మ్యాచ్ కాలేదని తేలింది. కేవలం గందరగోళం, భయాందోళనలు రేపేందుకే క్రిమినల్ గ్యాంగ్‌ల పేరు వాడుకున్నారన్న అనుమానంతో పోలీసులు ఆడియో పంపిన వ్యక్తి కోసం వేట ప్రారంభించారు.
అంతకుముందు అక్టోబర్‌లో ముంబైలోని జుహు వద్ద యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ కారుపై బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు కాల్పులు జరిపిన ఘటన కలకలం రేపింది. ఆ కాల్పుల్లో టైగర్ క్షేమంగా బయటపడగా, డ్రైవర్‌తో పాటు మరోకరికి గాయాలయ్యాయి. ఆ దాడికి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించినట్లు వార్తలు వచ్చాయి. ఇలా వరుస ఘటనలు, బెదిరింపుల నేపథ్యంలో సైఫ్ అలీఖాన్‌కు వచ్చిన బెదిరింపు వెనుక నిజమైన నేరస్తులు ఉన్నారా, లేక ఫేక్ కాల్, టెక్నాలజీ మాయాజాలమా అనేది ముంబై పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.
