Home Uncategorized ఎన్నికల విధుల్లో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకం

ఎన్నికల విధుల్లో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకం

by andhra andhrawave
0 comments



పోలింగ్ ప్రక్రియను నిశితంగా పరిశీలించాలి.. అక్రమాలపై తక్షణమే నివేదించాలి

అనకాపల్లి, అక్టోబర్ 24: ఎన్నికల నిర్వహణలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి విజయ్ కృష్ణన్ స్పష్టం చేశారు. పోలింగ్ ప్రక్రియను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు మైక్రో అబ్జర్వర్లు తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు. ఎన్నికల విధులు, బాధ్యతలు, పాటించాల్సిన నిబంధనలపై శనివారం సాయంత్రం అనకాపల్లి జిల్లా సమావేశ మందిరంలో మైక్రో అబ్జర్వర్లకు మార్గదర్శక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఒకే పోలింగ్ కేంద్రంలో మూడు, నాలుగు పోలింగ్ స్టేషన్లు ఉన్నప్పటికీ, ఆ కేంద్రం మొత్తానికి ఒకే మైక్రో అబ్జర్వర్ బాధ్యత వహిస్తారని తెలిపారు. మైక్రో అబ్జర్వర్లు పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించడం మినహా ఇతర విధుల్లో జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేశారు. పోలింగ్ సిబ్బందికి సూచనలు, సలహాలు ఇవ్వడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని ఆదేశించారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలు, అక్రమాలు గుర్తించినప్పుడు వాటిని నమోదు చేసి వెంటనే సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.

పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభం కానున్న నేపథ్యంలో మైక్రో అబ్జర్వర్లు ఉదయం 6.30 గంటలకే తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని తెలిపారు. పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులను తెరిచి, అవి ఖాళీగా ఉన్నాయని నిర్ధారించిన అనంతరం సీల్ చేసే ప్రక్రియను నిశితంగా పరిశీలించాలన్నారు. సీలింగ్‌కు సంబంధించిన ఫారాల్లో పోలింగ్ ఏజెంట్లు, ప్రిసైడింగ్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లు తప్పనిసరిగా సంతకాలు చేయాలని పేర్కొన్నారు.

అక్రమాలపై తక్షణ సమాచారం

పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవకతవకలు జరిగినా వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించేందుకు ప్రత్యేక వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. ఫొటోలు, వీడియోలు, సందేశాల ద్వారా పరిస్థితిని అధికారులకు తెలియజేయవచ్చన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఒక ప్లస్ మూడు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతోపాటు, పది కిలోమీటర్ల పరిధిలో స్ట్రైక్ ఫోర్స్‌ను అందుబాటులో ఉంచనున్నట్లు వివరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సీసీటీవీ కెమెరాల ద్వారా కూడా పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించనున్నట్లు తెలిపారు.

పోలింగ్ ముగిసిన అనంతరం ప్రిసైడింగ్ అధికారి డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత మైక్రో అబ్జర్వర్లు ఒక పేజీ నివేదికను పూర్తి చేసి స్వీకరణ కేంద్రంలో సమర్పించాలని ఆదేశించారు. పోలింగ్ సమయంలో జరిగిన పరిణామాలు, నిబంధనల అమలు, గుర్తించిన ఉల్లంఘనలను నివేదికలో స్పష్టంగా పొందుపరచాలని సూచించారు. అవసరమైతే రీపోలింగ్ నిర్వహించాలా లేదా అనే నిర్ణయం తీసుకోవడంలో మైక్రో అబ్జర్వర్ల నివేదిక కీలకంగా ఉంటుందని పేర్కొన్నారు.

ఎన్నికల అబ్జర్వర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ.. మైక్రో అబ్జర్వర్లు పోలింగ్ రోజున ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విధులు నిర్వహించాల్సి ఉంటుందని తెలిపారు. విధులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని, వీలైతే పోలింగ్‌కు ముందు రోజే తమకు కేటాయించిన కేంద్రానికి చేరుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

పబ్లిక్ సెక్టార్ సంస్థలు, బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగులను మైక్రో అబ్జర్వర్లుగా ఎంపిక చేసినట్లు వెల్లడించారు. వీరు ఎన్నికల ప్రక్రియలో నేరుగా జోక్యం చేసుకోకుండా, ప్రతి దశను నిశితంగా పరిశీలించి నివేదిక అందించాల్సి ఉంటుందని వివరించారు. ఈ ఎన్నికలు బ్యాలెట్ బాక్సుల ద్వారా నిర్వహిస్తున్నందున, ప్రక్రియకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత అధికారులను వివరణ కోరవచ్చని తెలిపారు.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సౌర్య మాన్ పటేల్, జిల్లా రెవెన్యూ అధికారి వై. సత్యనారాయణ రావు, డ్వామా పీడీ నిర్మలాదేవి, ఇతర అధికారులు, మైక్రో అబ్జర్వర్లు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird