107 నుంచి 112వ వార్డుల వరకు హోరాహోరీ పోరు.. కూటమి వర్సెస్ వైఎస్సార్‌సీపీ!
అనకాపల్లి, ఆంధ్రా వేవ్స్: అనకాపల్లి జోన్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం రసవత్తరంగా మారింది. 107 నుంచి 112వ వార్డు వరకు ఆరు వార్డుల్లో కూటమి, వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. ఓటర్ల మద్దతు కూడగట్టేందుకు అభ్యర్థులు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తుండగా, ఇరు పక్షాల నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.
బరిలో ఆరు వార్డుల అభ్యర్థులు
కూటమి తరఫున 107వ వార్డులో మాదంశెట్టి చినతల్లి, 108వ వార్డులో కొణతాల సింధుజ టీడీపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. 109వ వార్డులో బుద్ధ జ్యోతి, 110వ వార్డులో తాడి శాంతికుమారి, 112వ వార్డులో ఆళ్ల శ్రీ వైష్ణవి జనసేన తరఫున, 111వ వార్డులో పలక యశోద బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. వైఎస్సార్‌సీపీ తరఫున 107వ వార్డులో పన్నేరు వెంకట్ లక్ష్మి, 108వ వార్డులో బొడ్డేటి సరోజిని, 109వ వార్డులో కర్రి లలిత, 110వ వార్డులో ఉగ్గిన జోష్న పద్మజ, 111వ వార్డులో దళాయి నదియా, 112వ వార్డులో జాజుల ప్రసన్న పోటీ చేస్తున్నారు.
మారుతున్న రాజకీయ పరిణామాలు
ఎన్నికల వేళ అనకాపల్లి రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. వైఎస్సార్‌సీపీకి చెందిన పలువురు కీలక నాయకులు కూటమి వైపు వెళ్లినట్లు ప్రచారం సాగుతుండటంతో ఆ పార్టీ అభ్యర్థులపై ఎలాంటి ప్రభావం పడుతుందన్న ఆసక్తి నెలకొంది. కొందరు ముఖ్య నాయకులు ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉండటం కూడా స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. మరోవైపు సీనియర్ నాయకుడు కొణతాల రామకృష్ణ వ్యూహాలు, కూటమి పార్టీల మధ్య సమన్వయం ప్రచారంలో ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
స్థానిక సమస్యలే ప్రచారాస్త్రాలు
తాగునీటి సరఫరా, డ్రైనేజీ, పారిశుధ్యం, రహదారులు, వీధి దీపాల సమస్యలను అభ్యర్థులు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ప్రజలను నేరుగా కలుస్తూ సమస్యలను తెలుసుకోవడంతో పాటు పరిష్కారానికి హామీలు ఇస్తున్నారు. పార్టీ బలంతో పాటు అభ్యర్థుల వ్యక్తిగత పరిచయాలు, స్థానికంగా ప్రజలతో ఉన్న సంబంధాలు, గతంలో చేసిన సేవలు కూడా ఓటర్ల నిర్ణయాన్ని ప్రభావితం చేసే అవకాశముంది.
ఫలితాలపై ఉత్కంఠ
కూటమి ప్రచార వేగం, వైఎస్సార్‌సీపీ వ్యూహాలు, అభ్యర్థుల స్థానిక బలం ఆరు వార్డుల్లో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అంశాలుగా కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో ప్రచారం మరింత ఉధృతమయ్యే అవకాశముండటంతో రాజకీయ పోరు ఏ మలుపు తిరుగుతుందన్న ఉత్కంఠ నెలకొంది. ఓటరు తీర్పు ఎవరికి అనుకూలంగా ఉంటుందన్నది ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.

