ఇప్పుడంటే మృణాల్ ఠాకూర్ పేరుకి పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్, బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ స్టేటస్ తన సొంతం. కానీ తెలుగులో తను మొట్టమొదటిసారి అడుగుపెడుతున్నప్పుడు.. ఒకరకంగా సౌత్‌లో తన సినీ కెరీర్‌కి లైఫ్ ఇచ్చి స్టార్ స్టేటస్ కట్టబెట్టిన పాత్ర ‘సీతారామం’లోని సీతామహాలక్ష్మి. ఒక సినిమా, ఒక పాత్ర నటి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందనడానికి మృణాల్ పోషించిన సీత పాత్రే మంచి ఉదాహరణ. ఆ సినిమాతో టాలీవుడ్లో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయిన మృణాల్, ఓ ఇంటర్వ్యూలో ఆ పాత్ర వెనుక ఉన్న ఒక ఆసక్తికరమైన సీక్రెట్‌ను బయటపెట్టిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి డైరెక్టర్ హను రాఘవపూడి ముందుగా మృణాల్‌ను అనుకున్నది ‘సీత’ పాత్ర కోసం కాదట.
ఓ ఇంటర్వ్యూలో మృణాల్ మాట్లాడుతూ.. “నిజానికి ‘సీతారామం’ ప్రాజెక్ట్‌లోకి నేను ముందుగా సీత పాత్ర కోసం రాలేదు. ఈ సినిమాలో రష్మిక మందన్న నటించిన ఆఫ్రీన్ పాత్ర కోసమే డైరెక్టర్ హను రాఘవపూడి నన్ను సంప్రదించారు. ఆ క్యారెక్టర్ గురించి మాట్లాడటానికి హను సార్ నన్ను మొదట ఒక కేఫ్‌లో కలిశారు. అందుకే ‘మనం ఆఫీసుకు వెళ్లి మాట్లాడుకుందామా?’ అని నేనే అడిగాను.
ఆ రోజు ఆదివారం అయినప్పటికీ, హను సార్ ప్రత్యేకంగా ఆఫీసు తెరిపించారు. అక్కడ సుమారు నాలుగున్నర నుంచి ఐదు గంటల పాటు ఆయన నాకు కథ వినిపించారు. ఆ సుదీర్ఘ కథా చర్చల మధ్యలో ఆయన ఆలోచన ఒక్కసారిగా మారిపోయింది. ఆఫ్రీన్ పాత్ర కోసం వచ్చిన నన్ను గమనించిన తర్వాత.. ‘లేదు, నువ్వే నా సీత’ అని హను సార్ అక్కడికక్కడే నిర్ణయించుకున్నారు. ఒక పాత్ర కోసం వెళ్తే, నా కెరీర్‌నే మలుపు తిప్పే సీత లాంటి అద్భుతమైన పాత్ర నా తలుపు తట్టడం నిజంగా నా అదృష్టం.
ఆ రోజు కేఫ్ నుంచి ఆఫీసుకు అన్న చిన్న ఆలోచన, ఐదు గంటల పాటు సాగిన ఆ మీటింగ్ నాకు టాలీవుడ్లో ఇంతటి గుర్తింపును తెచ్చిపెట్టాయి. సీతగా నేను, ఆఫ్రీన్గా రష్మిక ఇద్దరం మా పాత్రలకు న్యాయం చేయడంతో పాటు దుల్కర్ యాక్టింగ్‌తో ‘సీతారామం’ ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ఈ సినిమా తర్వాతే తెలుగులో నాకు వరుస అవకాశాలు రావడం మొదలైంది” అంటూ మొత్తానికి హను రాఘవపూడి తీసుకున్న ఆ నిర్ణయం టాలీవుడ్‌కు ఒక అద్భుతమైన నటిని అందించడమే కాకుండా, మృణాల్ కెరీర్‌నే కొత్త మలుపు తిప్పిందని తన ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
