Tiger Attack TikTok Video సోషల్ మీడియాలో వైరల్ కావాలనే ఆశ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. టిక్‌టాక్ వీడియో కోసం పెద్ద పులితో స్టంట్ చేయాలనుకున్న కంటెంట్ క్రియేటర్ చర్య చివరకు విషాదానికి దారితీసింది. పులిని బోనులో నుంచి బయటకు తీసుకురాగా, అక్కడ పనిచేస్తున్న 19 ఏళ్ల యువకుడిపై దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన పాకిస్థాన్‌లో కలకలం రేపుతోంది.
పులితో స్టంట్ కోసం టిక్ టాక్ వీడియో
సోషల్ మీడియా ప్రభావం రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో కొందరు కంటెంట్ క్రియేటర్లు లైకులు, వ్యూస్, ఫాలోవర్ల కోసం ప్రమాదకరమైన స్టంట్లకు సైతం వెనుకాడటం లేదు. ముఖ్యంగా జంతువులతో చేసే విన్యాసాలు కొన్నిసార్లు ప్రాణాంతకంగా మారుతున్నాయి. తాజాగా పాకిస్థాన్‌లో చోటుచేసుకున్న ఘటన ఇందుకు నిదర్శనంగా నిలిచింది.
వివరాల్లోకి వెళ్తే.. పాకిస్థాన్‌లోని లాహోర్ నగర పరిధిలో ఉన్న కహ్నా ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఫామ్‌లో ఈ దారుణ ఘటన జరిగింది. నౌమాన్ హసన్ అనే కంటెంట్ క్రియేటర్ టిక్ టాక్ వీడియో కోసం అక్కడికి వెళ్లాడు. పెద్ద పులితో ఓ వీడియో రూపొందించాలని భావించిన అతడు, తన కోరిక మేరకు పులిని బోనులో నుంచి బయటకు తీసుకురావాలని ఫ్యామ్ నిర్వాహకులను కోరాడు.
ఒక్కసారిగా దాడి చేసిన పెద్ద పులి
కంటెంట్ క్రియేటర్ అడిగినట్లుగానే ఫామ్ నిర్వాహకులు పులిని బోనులో నుండి బయటకు తీసుకువచ్చారు. అయితే, ఆ సమయంలో అనూహ్య పరిణామం సంభవించింది. అక్కడే పనిచేస్తున్న తల్హా (19) అనే యువకుడిపై పులి ఒక్కసారిగా దాడి చేసింది. పులి దాడిలో తల్హాకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో వారంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
వెంటనే స్పందించిన ఫామ్ సిబ్బంది గాయపడిన తల్హాను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వచ్చారు. అయితే అతని పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తీవ్ర గాయాల కారణంగా తల్హా ప్రాణాలు కోల్పోయాడు. దీనితో టిక్‌టాక్ వీడియో కోసం చేసిన ప్రయత్నం ఓ యువకుడి కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.
కంటెంట్ క్రియేటర్, ఫామ్ యజమాని అరెస్ట్
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. టిక్‌టాక్ వీడియో కోసం పులిని బోనులో నుంచి బయటకు తీసుకురావాలని కోరిన నౌమాన్ హసన్‌తో పాటు ఫామ్ యజమాని ఫయ్యాజ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పులిని తీసుకురావడానికి అనుమతించిన పరిస్థితులు, భద్రతా ఏర్పాట్లలో నిర్లక్ష్యం జరిగిందా అనే విచారణ చేపట్టినట్లు సమాచారం.
సోషల్ మీడియా వ్యూస్ కోసం ప్రాణాలతో చెలగాటం వద్దు!
ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో కొందరు యువత ప్రమాదకరమైన ప్రయోగాలు చేస్తున్నారు. వన్యప్రాణులతో ఫొటోలు, వీడియోలు తీసుకోవడం, వాటితో సాహసాలు చేయడం వంటి చర్యలు తీవ్ర పరిణామాలకు దారితీస్తున్నాయి. అడవి జంతువులు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో అంచనా వేయడం సాధ్యం కాదు. వాటి సహజ స్వభావాన్ని విస్మరించి వినోదం కోసం దగ్గరకు వెళ్లడం ప్రాణాలకే ప్రమాదకరం.
లైకులు, షేర్లు, వ్యూస్ కొన్ని గంటల్లోనే మరిచిపోవచ్చు. కానీ ఇలాంటి నిర్లక్ష్యపు చర్యల వల్ల కోల్పోయిన ప్రాణాలు తిరిగి రావు. పాకిస్థాన్‌లో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియా కంటెంట్ పేరుతో ప్రమాదకరమైన స్టంట్లు చేసే వారికి ఓ గట్టి హెచ్చరికగా నిలుస్తోంది.
లాహోర్‌లోని ఒక వ్యవసాయ క్షేత్రంలో టిక్‌టాక్ వీడియో చిత్రీకరణ సమయంలో పాకిస్థానీ యువకుడు పులి చేత చంపబడ్డాడు.
కంటెంట్ సృష్టికర్త మరియు ఫామ్‌హౌస్ యజమానిని అరెస్టు చేశారు https://t.co/Noupc350cZ
— RTBreaking (@RT_Breaking_) నవంబర్ 13, 2026
