ఎల్నినో ఎఫెక్ట్ నేపథ్యంలో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. వాతావరణం అంచనాలతో ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టింది. కరువు పరిస్థితులు తలెత్తిన తర్వాత సహాయక చర్యలు చేపట్టడం కంటే, ప్రమాదాన్ని ముందే పసిగట్టి నష్టాన్ని నివారించడంపై దృష్టి సారించింది. దేశంలో ఖరీఫ్ సాగును, అన్నదాతల ఆదాయాన్ని కాపాడేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. ఇందులో భాగంగా వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొనే ప్రమాదం ఉన్న 262 జిల్లాలను గుర్తించి ప్రత్యేక పర్యవేక్షణలోకి తీసుకువెళ్లారు.
కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతోంది. సంబంధిత అధికారులు ఆయా ప్రాంతాలకు వర్షపాత అంచనాలు, నీటిపారుదల సౌకర్యాలు, సాగు విస్తీర్ణం వంటి సైంటిఫిక్ డేటాను పరిశీలించి అధిక ముప్పు ఉన్న 262 జిల్లాలను ఎంపిక చేశారు. ఆయా ప్రాంతాల్లోని క్షేత్రస్థాయి పరిస్థితులను, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో జిల్లా సమీక్షిస్తున్నారు. వర్షాలు ఆలస్యమైనా లేదా సాధారణం కంటే తక్కువగా కురిసిన రైతులు ఆందోళన చెందకుండా అదనపు ఖరీఫ్ విత్తనాలను ముందుగానే సిద్ధం చేయాలని కేంద్రం నిర్ణయించింది.
జిల్లా స్థాయిలో రూపొందించిన వ్యవసాయ అత్యవసర ప్రణాళికలపై రైతులకు ముందుగానే అవగాహన కల్పించనుంది. వర్ష పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపికలలో మార్పులు చేయడం, విత్తనాలు వేసే సమయాన్ని మార్చుకోవడంపై నిపుణులకు తగిన సూచనలు అందించబడతాయి.
నీటి ఎద్దడిని సామర్థ్యాన్ని పెంచేందుకు మైక్రో ఇరిగేషన్ సాంకేతిక వినియోగాన్ని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. డ్రిప్, స్ప్రింక్లర్ పరికరాలపై రాయితీలను మరింత పెంచడంతోపాటు, అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వాడుకునేలా రైతులకు ప్రత్యేక శిక్షణ, అవగాహన కార్యక్రమాలను కేంద్రం నిర్వహిస్తుంది.
వాతావరణ ప్రతికూలతల వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోకుండా ఉండేందుకు పంటల బీమా, వ్యవసాయ రుణాల పరిధిని ఆయా జిల్లాల్లో విస్తరించనుంది. వాతావరణ హెచ్చరికలకు అనుగుణంగా విత్తనాలు, ఎరువుల సరఫరా, నీటి నిర్వహణను అనుసంధానించడం ద్వారా ఖరీఫ్ సాగుకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకుంటోంది. ఈ ముందస్తు ప్రణాళిక సక్రమంగా అమలైతే లక్షలాది మంది రైతులకు ప్రయోజనం కలగడంతో పాటు దేశ ఆహార భద్రతకు కూడా భరోసా లభించనుంది.
