సోషల్ మీడియాలో కించపరిచే కామెంట్స్ గురించి చాలాకాలంగా చర్చ జరిగింది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు సోషల్ మీడియా హెట్ రేట్‌కు గురైనవారు ఉన్నారు. కారణం ఏదైనా కావొచ్చు.. అభిమానం, ద్వేషం, ప్రేమ, కోపం. రంగం ఏదైనా అవ్వొచ్చు.. రాజకీయం, సినిమా, క్రికెట్. కళాకారులు, క్రికెటర్లు, రాజకీయ నాయకులు, ఉద్యమకారులు.. చిన్నా పెద్ద అని లేదు, ఆడమగా అని ఎవరైనా ఉండొచ్చు. పిచ్చి కామెంట్లు, అసభ్య పదాలు.. సోషల్ మీడియాలో నిండిపోయి కంపు కొడుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ వ్యవహారంపై మాజీ మంత్రి స్పందించారు. తెలంగాణ ఉద్యమంలో తమ పాటలతో, మాటలతో ప్రజలను చైతన్యపరిచిన సింగర్ మధుప్రియపై ఓ ఎన్నారై చేసిన అనుచిత వ్యాఖ్యలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తీవ్రంగా స్పందించారు. మహిళలను కించపరిచేలా మాట్లాడటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించకూడదని స్పష్టం చేశారు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ వేదికగా స్పందించిన సబితా ఇంద్రారెడ్డి.. మధుప్రియ, శివజ్యోతిలపై ఓ ఎన్నారై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ఉద్యమంలో పాత్ర పోషించిన మహిళా కళాకారులు ఈ విధంగా అవమానించడం బాధాకరమని పేర్కొన్నారు.
ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా తెలంగాణ మహిళా కమిషన్ ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుని, సుమోటోగా కేసు నమోదు చేసింది. అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాదు రాష్ట్రంలో మహిళా జర్నలిస్టులు, మహిళా ప్రొఫెసర్లు, ఇతర రంగాలకు చెందిన మహిళలపై జరుగుతున్న వేధింపుల పరిశీలన కూడా సబితా ఇంద్రారెడ్డి ప్రస్తావించారు. మహిళల విషయంలో ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబించకూడదని, బాధితులు ఎవరైనా సరే వారికి న్యాయం జరిగేలా చూడాలని సూచించారు. మహిళల గౌరవం, భద్రత విషయంలో రాజకీయాలకు తావుండకూడదని ఆమె వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు సోషల్ మీడియాలో మహిళలను లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత దూషణలు, అనుచిత వ్యాఖ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరి మధుప్రియ, శివజ్యోతిలపై జరిగిన ఈ వ్యాఖ్యల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం, మహిళా కమీషన్ ఎలా స్పందిస్తున్నాయి? బాధ్యులపై చర్యలు తీసుకుంటాయా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మహిళలపై సోషల్ మీడియాలో ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసేవారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
The post మధుప్రియపై కామెంట్స్.. ఎమ్మెల్యే ఫైర్ appeared first on iDreamPost.
