డిసెంబర్ వచ్చిందంటే చాలు.. బాక్సాఫీస్ దగ్గర పండగ వాతావరణం కనిపిస్తుంది. కానీ ఈసారి డిసెంబర్ బాక్సాఫీస్ ఫైట్ మామూలుగా ఉండేలా లేదు. బాక్సాఫీస్ బరిలో అక్కినేని హీరోలను బాలీవుడ్ ఖాన్‌లు నేరుగా ఢీకొట్టడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. అటు తండ్రి నాగార్జునకు బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ రూపంలో, ఇటు కొడుకు నాగచైతన్యకు భాయిజాన్ సల్మాన్ ఖాన్ రూపంలో గట్టి పోటీ ఎదురవుతోంది. ఒకే నెలలో అటు నాగార్జున, ఇటు చైతూ.. ఇద్దరూ బాలీవుడ్ టాప్ హీరోలతో బాక్సాఫీస్ ఫైట్‌కు దిగుతుండటం ఫిల్మ్ నగర్‌లో సరికొత్త ఆసక్తిని రేకెత్తిస్తోంది.
చైతూ ‘వృషకర్మ’కు సల్మాన్ ‘మాతృభూమి’తో పోటీ..
ముందుగా డిసెంబర్ 4న బాక్సాఫీస్ దగ్గర మొదటి రౌండ్ మొదలవుతోంది. ‘విరూపాక్ష’ లాంటి సూపర్ హిట్‌తో మెప్పించిన కార్తీక్ దండు దర్శకత్వంలో నాగచైతన్య నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘వృషకర్మ’. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఒకేసారి భారీ స్థాయిలో రిలీజ్ అవుతోంది ఈ సినిమా. అయితే సరిగ్గా అదే రోజు (డిసెంబర్ 4న) బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన ‘మాతృభూమి’ కూడా వరల్డ్ వైడ్‌గా థియేటర్లలోకి వస్తోంది. అపూర్వ లఖియా డైరెక్ట్ చేసిన ఈ మూవీ ట్రైలర్ తాజాగా విడుదల అయ్యి మంచి బజ్ క్రియేట్ చేసింది. తెలుగు వెర్షన్ రిలీజ్‌పై ఇంకా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాకపోయినా.. హిందీ మార్కెట్‌లో, మల్టీప్లెక్స్‌లలో చైతూ సినిమాకు సల్మాన్ రూపంలో పెద్ద కాంపిటీషన్ తప్పేలా లేదు.
కింగ్ వర్సెస్ కింగ్.. అసలైన క్లాష్ క్రిస్మస్‌కే
అసలైన కిక్ మాత్రం డిసెంబర్ 24 క్రిస్మస్ వీకెండ్‌లో ఉండబోతోంది. అక్కినేని నాగార్జున కెరీర్‌లోనే మైల్ స్టోన్ లాంటి 100వ చిత్రం ‘కింగ్ 100’ ఆ రోజే థియేటర్లలోకి దిగుతోంది. తమిళ దర్శకుడు రా.కార్తీక్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ ఫ్యామిలీ డ్రామాలో దాదాపు 28 ఏళ్ల తర్వాత నాగార్జున – టబు కాంబో రిపీట్ అవుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణం ఈ ప్రతిష్టాత్మక ప్రదర్శన దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. నాగ్ వందో చిత్రం కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ట్విస్ట్ ఏంటంటే.. సరిగ్గా అదే డిసెంబర్ 24న బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ ‘కింగ్’ టైటిల్‌తోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్‌లో సుహానా ఖాన్, దీపికా పదుకోన్, అభిషేక్ బచ్చన్ లాంటి భారీ తారాగణంతో వస్తున్న ఈ సినిమాపై నార్త్‌లోనే కాదు, సౌత్‌లోనూ మంచి క్రేజ్ ఉంది. తెలుగు రిలీజ్‌పై అఫీషియల్ కన్ఫర్మేషన్ రాకపోయినా, గతంలో వచ్చిన ‘పఠాన్’, ‘జవాన్’ల మాదిరిగానే తెలుగులో భారీ స్థాయిలో విడుదలయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే రోజున నటసింహం బాలయ్య కూడా బరిలో ఉండటంతో, డిసెంబర్ 24న బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా ఉండదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. మొత్తానికి ఒకే నెలలో తండ్రీకొడుకులిద్దరికీ బాలీవుడ్ టాప్ స్టార్ల నుంచి ఇలాంటి గట్టి పోటీ ఎదురుకావడం నిజంగా రేర్ సీన్ అని చెప్పాలి. మరి ఈ బాక్సాఫీస్ వార్‌లో ఖాన్‌ల జోరును తట్టుకుని అక్కినేని హీరోలు ఏ రేంజ్ కలెక్షన్లతో దుమ్మురేపుతారో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
