టాలీవుడ్లో అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన వరుస అవకాశాలు అందుకుంటూ, టాప్ హీరోయిన్ రేసులో దూసుకొచ్చిన యంగ్ బ్యూటీ శ్రీలీల. ఒక దశలో నిండా సినిమాలతో ఫుల్ ఉన్న ఈ అమ్మడికి, ఆ స్థాయిలో బాక్సాఫీస్ విజయాలు మాత్రం దక్కలేదు. తెలుగులో ఆశించిన సక్సెస్ లేకపోవడంతో కోలీవుడ్‌లోనైనా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని తమిళ చిత్రసీమ బాట పట్టింది. కానీ అక్కడ కూడా వరుస ఎదురుదెబ్బలే తగలడంతో, ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలతో పాటు అభిమానుల్లో ఒక్కటే చర్చ నడుస్తోంది.. అసలు శ్రీలీల దశ మార్చే సినిమా ఏది?
కోలీవుడ్‌లో గ్రాండ్ ఇచ్చి, అక్కడ పాతుకుపోవాలన్న ఆశతో శివకార్తికేయన్ హీరోగా, స్టార్ డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన ‘పరాశక్తి’ సినిమాలో శ్రీలీల నటించింది. ఈ సినిమాతో తన దశ తిరిగిపోతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ భామకు, బాక్సాఫీస్ వద్ద చేదు అనుభవమే ఎదురైంది. ఆ తర్వాత ధనుష్ హీరోగా తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ‘ఓం’తో అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇస్తున్నానని, ఇటీవల జరిగిన రిలీజ్ ఈవెంట్లో శ్రీలీల ఎంతో ధీమా వ్యక్తం చేశారు.
నిజానికి ‘ఓం’ కోసం శ్రీలీల చాలా పెద్ద రిస్క్ తీసుకుంది. సాధారణంగా టాప్ హీరోయిన్ రేసులో ఉన్న ఏ యంగ్ బ్యూటీ కూడా కెరీర్ పీక్ స్టేజ్‌లో తల్లి పాత్రలు చేయడానికి అంత త్వరగా ఒప్పుకోడు. కానీ కథపై నమ్మకంతో శ్రీలీల తల్లి పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయినప్పటికీ, సినిమా విడుదలయ్యాక చూస్తే అందులో ఆమె పాత్రకు పెద్దగా, స్క్రీన్ స్పేస్ దక్కలేదనే కామెంట్స్ సినీ ప్రియులతో పాటు అభిమానుల నుంచే వినిపిస్తున్నాయి.
ఇటు టాలీవుడ్లో, అటు కోలీవుడ్‌లో సరైన సక్సెస్ లేక కాస్త వెనుకబడిన శ్రీలీల.. మళ్లీ టాప్ రేసులోకి రావాలంటే ఇప్పుడు ఒక సాలిడ్ బ్లాక్ బస్టర్ అత్యవసరం. ప్రస్తుతం ఈ బ్యూటీ ఆశలన్నీ కోలీవుడ్ అగ్ర హీరోల సినిమాల పైనే ఉన్నాయి. ఒకటి సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ‘ధర్మన్’ కాగా, మరొకటి తలా అజిత్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న ‘డేర్ డెవిల్’. ఈ రెండు భారీ బడ్జెట్ చిత్రాలపైనే శ్రీలీల తన కెరీర్ ఆశలన్నీ పెట్టుకుంది. అయితే ఈ సినిమాల్లో ఆమె పాత్రలకు ఎంతవరకు ప్రాధాన్యత ఉంటుంది? సూపర్ స్టార్ ‘ధర్మన్’ లేదా అజిత్ ‘డేర్ డెవిల్’ చిత్రాల్లో ఏది శ్రీలీల దశ మార్చి, మళ్లీ ఆమెను స్టార్ హీరోయిన్ రేసులో నిలబెడుతుందో చూడాలి.
