వ్యాపార లావాదేవీల ద్వారా పరిచయమైన వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి, వ్యక్తిగతంగా దాడికి పాల్పడటంతోపాటు, వ్యక్తిగత ఫొటోలను బయటపెట్టానని బెదిరించినట్లు వచ్చిన ఫిర్యాదుపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ముంబయికి చెందిన 42 ఏళ్ల మహిళ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల వివరాల ప్రకారం.. బాధితురాలు ముంబయిలో డ్రై ఫ్రూట్స్, సుగంధ ద్రవ్యాల వ్యాపారం జరుగుతోంది. ఈ 2024 జులైలో వ్యాపార లావాదేవీల ద్వారా నిందితులతో పరిచయం ఏర్పడింది. కొంతకాలానికి వ్యాపారానికి సంబంధించిన పెద్ద మొత్తంలో బకాయిల విషయంలో వివాదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో నిందితుల్లో ఒకరు ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించినట్లు బాధితురాలు ఆరోపించింది.
ఆ నమ్మకంతో హైదరాబాద్‌కు వచ్చిన సమయంలో తనపై దాడికి పాల్పడినట్లు హైదరాబాద్‌లో ఫిర్యాదు చేసింది. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఈ ఘటనలు జరిగాయి. ఇతర వ్యాపార బకాయిలు చెల్లించాలని అడిగిన ప్రతిసారీ తన వ్యక్తిగత ఫొటోలను బయటపెడతానని బెదిరించినట్లు ఆరోపించింది. దీంతో బాధితురాలు ముంబయిలోని మహిమ్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. అక్కడ పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, హైదరాబాద్‌లో జరిగిన ఘటనలో పంజాగుట్ట పోలీసులకు బదిలీ చేశారు.
కేసు దర్యాప్తులో భాగంగా బ్యాంకు లావాదేవీలు, వ్యాపార ఇన్‌వాయిస్‌లు, ఫోన్ సంభాషణలు, డిజిటల్ చాటింగ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు. బాధితురాలి ఆరోపణల్లో వాస్తవాలను నిర్ధారించడానికి ఆధారాలు సేకరిస్తున్నారు. మరోవైపు బాధితులకు హైదరాబాద్ భరోసా కేంద్రం ద్వారా అవసరమైన సహాయం అందించారు. సాక్ష్యాధారాల ఆధారంగా నిందితుల పాత్రను నిర్ధారించి తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

