భారత క్రికెట్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ వారసుడు అంటే ఎలా ఆడాలో అలానే బ్యాటింగ్ చేస్తూ అదరగొడుతున్నాడు కొడుకు ఆర్యవీర్ సెహ్వాగ్. అండర్-19 ఆసియా కప్ 2026లో భాగంగా నేపాల్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో విధ్వంసకర ఆడి వార్తల్లో నిలిచాడు. కేవలం 52 బంతుల్లోనే 70 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన భారత జట్టు ఘనవిజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆర్యవీర్ ఇన్నింగ్స్ లో ఏడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉండటం విశేషం. 134.62 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన ఆర్యవీర్.. తన తండ్రి వీరేంద్ర సెహ్వాగ్‌ను గుర్తు చేశాడు.
అల్ అమెరాట్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన నేపాల్ భారత బౌలర్ల ధాటికి 42.3 ఓవర్లలో 128 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నేపాల్ బ్యాటర్లు పరుగులు సాధించేందుకు ఇబ్బందులు పడ్డారు. భారత బౌలర్లలో ఇషాన్ సూద్ మూడు వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టును దెబ్బతీశాడు. అర్జున్ రాజ్‌పుత్ కూడా మూడు వికెట్లతో సత్తా చాటాడు. నేపాల్ బ్యాటర్లలో దర్శ్ సోనార్ 43 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా, ఆశిష్ లూథర్ 29 పరుగులు చేశాడు. ఒక దశలో 51 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన నేపాల్.. చివరకు 128 పరుగులకే పరిమితమైంది.
అనంతరం 129 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు ఆర్యవీర్ సెహ్వాగ్, లక్ష్య రైచందానీ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన వీరిద్దరూ నేపాల్ బౌలర్లకు అవకాశం ఇవ్వలేదు. ముఖ్యంగా ఆర్యవీర్ తనదైన శైలిలో బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. మరో లక్ష్యం రైచందానీ కూడా హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. రైచందానీ 63 బంతుల్లో ఏడు ఫోర్లతో 53 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో భారత్ కేవలం 19.1 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 129 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఏకంగా 185 బంతులు మిగిలి ఉండగానే 10 వికెట్ల తేడాతో నేపాల్‌ను చిత్తు చేసింది. మొత్తానికి తొలి మ్యాచ్‌లోనే ఇలాంటి అద్భుత ప్రదర్శన చేయడంతో ఆర్యవీర్ సెహ్వాగ్ పేరు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో మార్మోగుతోంది.

