Table of Contents
అధికారంలోకి వచ్చిన నాటి పాలనలో తనదైన మార్కుతో అందరి మన్ననలు పొందుతూ ముందుకు వెళ్తోన్న తమిళనాడు ముఖ్యమంత్రి ముందు ఇప్పుడు పెద్ద సవాలుగా నిలిచాడు విజయ్. అదే తిరుపరంకుండ్రం కార్తీక దీపం వివాదం. మధురైలోని తిరుపరంకుండ్రం కొండపై ఉన్న పురాతన రాతి స్తంభం ‘దీపాథూన్’పై కార్తీక దీపం వెలిగించేందుకు మద్రాస్ హైకోర్టు అనుమతించింది. అయితే ఈ తీర్పును సవాలు చేస్తూ విజయ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో వివాదం మరింత ముదిరింది. నవంబర్ 24న కార్తీక దీపోత్సవం జరగనున్న నేపథ్యంలో హైకోర్టు వేదికపై ప్రభుత్వం పట్టుబడుతోంది. దీంతో విజయ్ వైఖరిపై విమర్శలు మొదలయ్యాయి. అసలు ఏంటి.. ప్రభుత్వం ఏం చెబుతోంది.. జనాలు ఏమంటున్నారంటే
వివాదానికి కారణం
మధురైలోని తిరుపరంకుండ్రం కొండపై అరుల్మిగు సుబ్రహ్మణ్యస్వామి ఆలయంతో పాటు హజరత్ సుల్తాన్ సికిందర్ బాదుషా దర్గా ఉన్నాయి. దర్గాకు సుమారు 50 మీటర్ల దూరంలో ఉన్న రాతి స్తంభం ‘దీపాథూన్’ ఇప్పుడు వివాదానికి కేంద్రంగా మారింది. ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారం.. గత 150 ఏళ్లుగా కొండపై ఉచ్చి పిళ్లయార్ ఆలయానికి సమీపంలోని దీప మండపంలోనే కార్తీక దీపం వెలిగిస్తున్నారు. అదే సంప్రదాయాన్ని కొనసాగించాలని, కొత్తగా ‘దీపాథూన్’ వద్ద దీపం వెలిగించాల్సిన అవసరం లేదని వాదిస్తోంది.
మరోవైపు భక్తులు మాత్రం దీపథూన్పై కూడా కార్తీక దీపం వెలిగించేందుకు అనుమతించాలని కోరుతున్నారు. అక్కడ దీపం వెలిగించడం వల్ల దర్గాకు ఎలాంటి ఇబ్బంది ఉండదని, తమ మతపరమైన హక్కులను అడ్డుకోవడం సరికాదని అంటున్నారు.
హైకోర్టు తీర్పును సవాలు చేసిన విజయ్
2025 డిసెంబర్ 1న మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జీఆర్ స్వామినాథన్ దీపథూన్పై దీపం వెలిగించేందుకు అనుమతించారు. దీని వల్ల దర్గా హక్కులకు భంగం కలగదని పేర్కొన్నారు. 2026 జనవరి 6న డివిజన్ బెంచ్ కూడా ఈ తీర్పును సమర్థించింది. అయితే విజయ్ ప్రభుత్వం జూన్ 11న సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేయడం వివాదాన్ని మరింత పెంచింది.
ప్రభుత్వ వాదన.. విమర్శలు!
రెండు రోజుల నుంచి సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం న్యాయవాది జయదీప్ గుప్త వాదిస్తూ.. దీపథూన్పై దీపం వెలిగించే సంప్రదాయానికి ఆధారాలు లేవని, అక్కడ దీపం వెలిగిస్తే మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొంది. ఆ స్తంభం దీపం వెలిగించేందుకు ఉద్దేశించినది కాకుండా బ్రిటిష్ కాలం నాటి సర్వే గుర్తు అయి ఉండొచ్చని కూడా ప్రభుత్వ వర్గాలు వాదిస్తున్నాయి. మరో దర్గా కమిటీ 1923 నాటి సివిల్ కోర్టు డిక్రీని ప్రస్తావిస్తూ ఆ ప్రాంతంపై తమ హక్కులను వాదించింది. భక్తుల తరఫు న్యాయవాదులు మాత్రం స్తంభం.. దీపం వెలిగించేందుకే అనుకూలంగా ఉందని చెబుతున్నారు. సుప్రీంకోర్టు ఇంకా తుది తీర్పును వెల్లడించలేదు. నేడు కూడా విచారణ కొనసాగనుంది.
ఇప్పటికే రెండుసార్లు భక్తులకు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పుడు ప్రభుత్వం మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఎందుకని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. శాంతిభద్రతల పేరుతో భక్తుల మతపరమైన హక్కులను అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని నిలదీస్తున్నారు.
అయితే ప్రభుత్వ వాదనలోనూ కొంత ప్రాధాన్యత ఉంది. ఒక మతం సంప్రదాయం పేరుతో మరో ప్రార్థనా స్థలం హక్కులు దెబ్బతినకూడదు. చారిత్రక ఆధారాలు, భూమి హక్కులు, పాత సంప్రదాయాలను పరిశీలించాల్సిందే. రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరగకుండా చూడటం కూడా ప్రభుత్వ బాధ్యత.
విజయ్ తీరుపై విమర్శలు
ప్రభుత్వానికి అప్పీల్ చేసుకునే హక్కు ఉంది. కానీ శాంతిభద్రతల సమస్య వస్తుందనే కారణంతో భక్తుల హక్కులను నిర్లక్ష్యం చేయకూడదు. అదే సమయంలో మరో వర్గం మనోభావాలనూ దెబ్బతీయకూడదు. పైగా హైకోర్టు అనుమతించిన తర్వాత.. మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఏంటంటున్నారు. న్యాయస్థానాల నుండి గౌరవిస్తూ రెండు వర్గాల మధ్య సామరస్యాన్ని కాపాడటమే విజయ్ ముందున్న అసలైన పరీక్ష. ఈ వివాదంలో ఎవరి వాదన సరైనదో సుప్రీంకోర్టు తేల్చాల్సి ఉంది. మరి తీర్పు ఎవరికి అనుకూలంగా వస్తుంది.. విజయ్ సర్కారు స్పందించే తీరుపై తదుపరి పరిణామాలు ఉంటాయి. ఇలాంటి సున్నితమైన అంశంలో.. ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా.. సమస్యను పరిష్కరించడమే అతి పెద్ద సవాలు. మరి విజయ్ దీన్ని పరిష్కరిస్తారో చూడాలంటున్నారు రాజకీయ పండితులు, సామాన్య జనాలు.
