అనకాపల్లి, ఆంధ్రావేవ్స్: ఆర్నబ్ తుఫాన్ ప్రభావం నేపథ్యంలో అనకాపల్లి జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ ఆదేశాల మేరకు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల భద్రతకు, అత్యవసర సహాయక చర్యలకు పోలీసులు సర్వసన్నద్ధంగా ఉన్నారు. లోతట్టు, తీర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించే చర్యలు చేపట్టారు.
తుఫాన్ కారణంగా ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా వెంటనే స్పందించేందుకు SDRF, NDRF ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. పోలీసులతో కలిసి ఈ బృందాలు గస్తీ నిర్వహిస్తూ, అవసరమైన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించేందుకు పటిష్టమైన పోలీసు వైర్లెస్, కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
అత్యవసర పరికరాలు, సిబ్బంది సిద్ధం
తుఫాన్ సహాయక చర్యల కోసం పోలీసు స్టేషన్ల పరిధిలో 73 జేసీబీలు, రెండు భారీ క్రేన్లు, 77 వుడ్ కట్టర్లు, 34 జనరేటర్లతో పాటు 179 మంది సహాయక సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. తుఫాన్ ప్రభావంతో రహదారులపై చెట్లు కూలిన చోట వాటిని ఎప్పటికప్పుడు తొలగించి రాకపోకలను పునరుద్ధరించేందుకు చర్యలు చేపడుతున్నారు.
మత్స్యకారులకు హెచ్చరిక
తీర ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని పోలీసులు హెచ్చరించారు. ప్రజలు అధికారుల సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు తక్షణ సహాయం కోసం పోలీసు కంట్రోల్ రూమ్‌ను లేదా డయల్ 112ను సంప్రదించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. తుఫాన్ సమయంలో ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు పోలీసు యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తోందని తెలిపారు.
ఆంధ్రావేవ్స్ | అనకాపల్లి

