Table of Contents
చైనా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో సరోగసీని నేరంగా పరిగణిస్తున్నట్లు స్పష్టం చేసింది. అక్రమంగా వారి ఫెర్టిలిటీ సెంటర్లపై ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. మధ్య చైనాలోని హునాన్ ప్రావిన్స్ రాజధాని చాంగ్షాలో అక్రమంగా ఫెర్టిలిటీ సెంటర్లను నడుస్తున్న నివేదికల నేపథ్యంలో చైనా ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారానికి సంబంధించి చాంగ్షాలో ఇప్పటికే 21 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చట్టవిరుద్ధంగా సరోగసీ కార్యకలాపాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు.
ఈ మేరకు చైనా జాతీయ ఆరోగ్య కమీషన్ ప్రతినిధి యాంగ్ జిన్రూయ్ శుక్రవారం మీడియా సమావేశంలో కీలక హెచ్చరికలు జారీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ”చైనాలో అన్ని రకాల సరోగసీ విధానాలపై పూర్తి నిషేధం ఉంది. సరోగసీ ఏర్పాట్లు చేయడం నైతిక విలువలకు విరుద్ధం. దాన్ని వ్యవస్థీకృతంగా నిర్వహించడం తీవ్రమైన క్రిమినల్ నేరం” అని స్పష్టం చేశారు. కాగా, చైనా తీసుకున్న ఈ నిర్ణయంతో సరోగసీ కోసం చేసుకునే ఒప్పందాలకు చట్టబద్ధత ఉండదు. అలాంటి ఒప్పందాల్లో పాల్గొనే దంపతులు, మధ్యవర్తులు కూడా న్యాయపరమైన శిక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
నిర్ణయం వెనుక అసలు కారణం..
అక్రమ ఏజెన్సీలు అర్హత లేని వ్యక్తులతో, కనీస వైద్య సదుపాయాలు లేని చోట చికిత్సలు చేస్తున్నారు. అందాల ఉత్పత్తి పెరగడానికి మోతాదుకు మించి మందులు వాడటం వల్ల మహిళల అండాశయాలు దెబ్బతిని తీవ్ర రక్తస్రావం, ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి. ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోంది. అపరిశుభ్రమైన వాతావరణంలో పిండాలను పెంచడం, మార్పిడి చేయడం వల్ల గర్భస్రావాలు, నెలలు నిండకుండానే ప్రసవాలు జరగడం, పుట్టబోయే పిల్లల్లో తీవ్రమైన జన్యుపరమైన లోపాలు ఏర్పడుతున్నాయి.

