Table of Contents
దీపావళి పండుగ సంబరాలు దేశంలో అంబరాన్ని అంటాయి. నిన్న ఉదయం నుండే బాణసంచా పేల్చటం మొదలైంది. జనం పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి ఎంజాయ్ చేశారు. అయితే, దీపావళి పండగ సంబరాలు భాగ్యనగరంలో గాలి కాలుష్యాన్ని ఒక్కసారిగా పెంచేశాయి. నగరవ్యాప్తంగా పెద్ద ఎత్తున బాణసంచా కాల్చడం వల్ల హైదరాబాద్ పరిసరాల్లో గాలి తీవ్రంగా పడిపోయింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 160 పాయింట్లుగా నమోదైనట్లు అధికారికంగా చెబుతున్నాయి.
సాధారణంగా 100 దాటితేనే గాలి నాణ్యత క్షీణించినట్లు పరిగణిస్తారు. అటువంటిది ఒకేసారి సూచీ 160 కి చేరడం వల్ల ఇది తీవ్ర అనారోగ్యకరమైన వాతావరణ పరిస్థితులకు దారితీస్తుందని పర్యావరణం, ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా గాలిలో చేరిన రసాయన పొగలు, సూక్ష్మ ధూళి కణాల ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ కాలుష్య వాతావరణం వల్ల శ్వాసకోస సమస్యలు, కళ్ల మంటలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
జాగ్రత్తలు తప్పనిసరి..
ప్రస్తుత దృష్ట్యా నగర ప్రజలు, ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, ఆస్తమా వంటి శ్వాసకోస వ్యాధులతో బాధపడేవారు అత్యంత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. బయటకు వెళ్లే సమయంలో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, అనవసరంగా ఎక్కువ సమయం కాలుష్య వాతావరణంలో గడపకూడదని చరిస్తున్నారు.

