దీపావళి పండుగ రోజున టపాసుల కారణంగా దేశ వ్యాప్తంగా వందల సంఖ్యలో ప్రమాదాలు జరిగాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వందకు పైగా ప్రమాదాలు నమోదయ్యాయి. భాగ్యనగరంలో దీపావళి వేడుకలు పలువురి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. ఒక్క హైదరాబాద్‌లోనే కంటికి గాయాలు అయ్యి.. 32 మంది ఆసుపత్రిలో చేరారు. టపాసులు కాల్చే ప్రమాదవశాత్తు కంటికి గాయాలైన బాధితులు మెహదీపట్నంలోని ప్రముఖ సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి క్యూ కడుతున్నారు.
ఇప్పటి వరకు 32 మంది ఆసుపత్రికి వచ్చారు. బాధితుల్లో ఎక్కువ శాతం మంది చిన్నారులు, యువకులు ఉన్నారు. 32 మంది బాధితుల్లో ఆరుగురి పరిస్థితి తీవ్రంగా ఉండటంతో వైద్యులు వారిని ఇన్పేషెన్లుగా చేర్చుకున్నారు. వారికి ప్రత్యేక చికిత్స అందించారు. మిగిలిన 26 మందికి ప్రాథమిక వైద్యం అందించి, మందులు ఇచ్చి హోం ఐసోలేషన్‌కు పంపించారు. తదుపరి పరీక్షల కోసం మళ్లీ ఆసుపత్రికి రావాలని వారికి సూచించారు. కాగా, ఆసుపత్రిలో చేరిన ఆరుగురిలో నలుగురు చిన్నారులు, ఇద్దరు పెద్దలు ఉన్నారు.
వీరిలో ఓ బాధితుడు తన కుడి కంటి చూపును పూర్తిగా కోల్పోవడం అత్యంత బాధాకరం. ఈలపై సరోజినీ దేవి కంటి ఆసుపత్రి ఆర్ఎమ్ఓ డాక్టర్ ఇబ్రహీం మాట్లాడుతూ.. ”వారాంతంలో దీపావళి సెలవులు రావడంతో రానున్న రోజుల్లో బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఎలాంటి అత్యవసర బాధితుల పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు, తక్షణ వైద్య సేవలకు ఆసుపత్రి సిబ్బంది పూర్తి సన్నద్ధతతో ఉన్నారు” అని ఆయన తెలిపారు.

