సంకోచాలు, సవాళ్లు, వ్యక్తిగత వివాదాలు ఇవేవీ విజయ్ ను నిలువరించలేకపోయాయి. తమిళనాట దళపతి రాజకీయ ప్రభంజనం సృష్టించారు. నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ అనూహ్య విజయాన్ని అందుకోవడంతో తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది.
తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ సినీ గ్లామర్‌తో పెనవేసుకుపోయి ఉంటాయి. ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి వంటి హేమాహేమీల తర్వాత ఆ స్థాయిలో జనాకర్షణ ఉన్న నాయకుడు ఎవరనే ప్రశ్నకు విజయ్ సమాధానంగా నిలిచారు. తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీ నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు. భార్యతో విడాకుల ప్రచారాలు, నటి త్రిషాతో ముడిపెట్టి చేసిన విమర్శలు ఓటర్లను ప్రభావితం చేస్తాయని విశ్లేషకులు భాష్యాలు చెప్పారు. కానీ.. తమిళ ఓటర్ల వ్యక్తిగత విషయాల కంటే విజయ్ ఆశయాలకే పెద్దపీట వేశారు.
ప్రచార పర్వంలో జరిగిన బహిరంగ సభలో తొక్కిసలాట జరిగి పదుల సంఖ్యలో మరణాలు సంభవించడం పార్టీకి పెద్దదెబ్బగా మారింది. తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. చివరికి సరైన అనుమతులు లేకపోవడంతో విజయ్ మలేషియాకు వెళ్లి అక్కడి నుండే డిజిటల్ ప్రచారం నిర్వహించాల్సి వచ్చింది. అయినప్పటికీ, ఆయన పట్టు వదలని విక్రమార్కుడిలా తన పోరాటాన్ని కొనసాగించారు. జాతీయ స్థాయి విశ్లేషకులు టీవీకే పార్టీకి స్వల్ప స్థానాలే దక్కాలని అంచనా వేశారు. ఎగ్జిట్ పోల్స్ కూడా అదే తేల్చాయి. కానీ.. ఫలితాలు మాత్రం యావత్తు భారతదేశాన్ని ఆశ్చర్యపరిచాయి. ఏకంగా 100కి పైగా స్థానాల్లో విజయం సాధించి.. ముఖ్యమంత్రి కుర్చీని దక్కించుకున్న మ్యాజిక్ ఫిగర్ కు అతి చేరువకు చేరుకున్నారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి సాంప్రదాయ పార్టీల ఆధిపత్యానికి ఆయన బ్రేక్ వేశారు.
విజయ్ సాధించిన ఈ విజయం కేవలం ఆయన సినిమా ఇమేజ్ వల్ల వచ్చింది కాదు. ప్రజల్లో ఆయనపై ఉన్నఅపార విశ్వాసానికి నిదర్శనం. ఎంజీఆర్, జయలలిత వంటి చరిత్రాత్మక నాయకుల వారసత్వాన్ని విజయ్ నిలబెడతారని ప్రజలు విశ్వసిస్తున్నారు. అవినీతి రహిత, ప్రజాహిత పాలనను ఆయన అందిస్తారని సామాన్యులు ఆశిస్తున్నారు. ఇక దళపతి ‘విజయ్ అనే నేను’ అంటూ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ముహూర్తం ఎప్పుడు అని ఎదురు చూస్తున్నారు.
