పార్టీకి నాయకులు కాదు, కార్యకర్తలు ముఖ్యం. ఈ మాట తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు తరచూ చెబుతూనే ఉంటారు. అందుకు భిన్నంగా వ్యవహరించే నాయకులపై పార్టీ వేటు వేయడం కూడా కద్దు. తాజాగా ఆ కోవలోనే.. పిఠాపురం వర్మపై పార్టీ వేటు వేసింది. ఆయనను పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ చార్జ్ పదవి నుంచి తొలగించారు.
ఇందుకు కారణం.. పిఠాపురం నియోజకవర్గంలో తరచూ కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య వాగ్వాదాలు తలెత్తడమే. ఈ వాగ్వాదాల వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడటం, పరిస్థితి నిత్య పంచాయతీగా మారిపోవడంతో తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నియోజకవర్గ ఇన్ చార్జి వర్మను ఆ పదవి నుంచి తప్పించాలని నిర్ణయించారు. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వ్యవహారాలను చక్కదిద్దేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రకటన విడుదలైన తర్వాత వర్మ మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా ఈయన ఒకింత భావోద్వేగానికి లోనై కన్నీటి పర్యంతమైనా… తనకు నియోజకవర్గ ఇన్ చార్జి పదవి నుంచి ఉద్వాసన పలకడంపై ఆయన స్పందించిన తీరు నిస్సందేహంగా హుందాగా ఉంది. ఆయన ఎక్కడా తన తొలగింపుపై నిరసన స్వరం వినిపించలేదు. పార్టీపై పన్నెత్తి ఒక పరుష వాక్యం కూడా మాట్లాడలేదు. అంతే కాకుండా తన తొలగింపు విషయం తనకు పార్టీ ముందే చెప్పిందన్నారు. మంత్రి నారా లోకేష్ ఈ విషయాన్ని తనకు ముందే చెప్పారు. ఆ తరువాతే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, మంత్రి నారాయణ ఈ విషయం తనకు తెలిపారని వర్మ చెప్పారు. అక్కడితో ఆగకుండా.. తనకు పార్టీయే ముఖ్యమన్న వర్మ.. అందుకోసం త్యాగాలు చేయడానికి తాను ఎప్పుడూ వెనుకాడనన్నారు. తాను క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం కార్యకర్తనని చెప్పారు. ఆ సందర్భంగా ఆయనలో తనకు అన్యాయం జరిగిందన్న బాధ కించింది.
ఆయన బాధపడటాన్ని ఎవరూ తప్పుపట్టలేరు. తప్పుపట్టరు కూడా. ఎందుకంటే.. గత ఎన్నికలలో పొత్తులో భాగంగా పిఠాపురం నియోజకవర్గాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కేటాయించినప్పుడు ఆయన పార్టీ ప్రయోజనాలు, పార్టీ నిర్ణయానికి అనుగుణంగా వ్యవహరించారు. పార్టీ ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని తన సీటుని పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేసి, ఆయన తరపున ఎన్నికల ప్రచారంలో అన్నీ తానై వ్యవహరించారు. ఆయన త్యాగాన్ని, తన విజయం కోసం ఆయన చేసిన కృషిని గుర్తించిన పవన్ అప్పట్లో తాను పిఠాపురం ఎమ్మెల్యే అయినప్పటికీ.. పిఠాపురానికి వర్మే నిజమైన ప్రతినిథి అన్నారు. వర్మతో చెపితే నాతో చెప్పినట్లే. వర్మ చెపితే నేను చెప్పినట్లే అని సముచిత గౌరవం, గుర్తింపు ఇచ్చారు.
అక్కడి వరకూ ఓకే కానీ, తర్వాత పిఠాపురంలో జనసేన, వర్మ అనుచరులకు మద్య పలు సందర్భాల్లో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. అదీ సహజమే.. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవు. ఆ విషయం తెలిసి కూడా ఇంత కాలం నియోజకవర్గంలో, వర్మ వర్గీయుల మధ్య గ్యాప్ పూడ్చడానికి ఇటు తెలుగుదేశం అధిష్ఠానం కానీ, అటు జనసేనాని కానీ ప్రయత్నించకపోవడమే తెలుగుదేశం పరిస్థితి ఇంత వరకూ రావడానికి కారణమైందని పరిశీలకులు అంటున్నారు.
కనుక ఇకనైనా పిఠాపురంలో పరిస్థితిని చక్కదిద్దడానికి రెండు పార్టీలూ చర్యలు తీసుకోవాలి. వర్మ తొలగింపు ఆయనపై వేటుగా కాకుండా.. మరో పదవి ఇచ్చేందుకు మార్గంగా నియోజకవర్గ కార్యకర్తల పరిస్థితిని గమనించి ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. ఇక జనసేన కూడా.. స్థానిక జనసేన క్యాడర్ కూడా పొత్త ధర్మం ప్రకారం నడుచునునేలా చూసే బాధ్యత పవన్ కల్యాణ్ తీసుకోవాలి. లేకుంటే పరిస్థితి మరింత దిగజారి వైసీపీకి అవకాశం ఇచ్చేందుకు దోహదపడుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
