అజరుద్దీన్ మంత్రి పదవి.. అంతే సంగతులా? ఆయన ఎమ్మెల్సీ కాక పోవటంతో మరో రోజుల్లో తన మంత్రి పదవిని కోల్పోవాల్సి వస్తుందా? అజర్ భవితవ్యం ఏంటి? ఒక వేళ ఆయన మంత్రిత్వం కాపాడలేక పోతే.. మైనార్టీల్లో అసంతృప్తి మొదలవదా? తెలంగాణ రాజకీయాల్లో మాజీ క్రికెటర్, ప్రస్తుత మంత్రి మహమ్మద్ అజరుద్దీన్ భవితవ్యం ఇప్పుడు అత్యంత ఉత్కంఠ భరితంగా మారింది. ఆయన ఇప్పుడు ఒక రాజ్యాంగపరమైన అనుమతిపై ఆధారపడి ఉన్నారు.
ప్రస్తుత రోజుల్లో పరిస్థితి చూస్తే.. నెల ఆయన మంత్రి ఉద్యోగం పోతుందా? అని పరిశీలిస్తే ఆయనకా గండం ఉందనే చెప్పాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(4) ప్రకారం, ఒక వ్యక్తి ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ కాకుండా మంత్రిగా ప్రమాణ స్వీకారం.. ఆరు నెలల లోపు అసెంబ్లీకో, మండలికో ఎన్నికవ్వాలి. అజారుద్దీన్ అక్టోబర్ 31, 2025న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంటే ఆయన ఆరు నెలల గడువు ఈ నెల 30తో ముగుస్తుంది. ఈ నెలాఖరు లోపు ఆయన ఎమ్మెల్సీగా ప్రమాణం చేయకపోతే, సాంకేతికంగా ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయవలసి ఉంటుంది.
అజర్ ఎమ్మెల్సీ ఎందుకు కాలేకపోయారు? ప్రభుత్వం ఆయన పేరును గవర్నర్ కోట కింద ఎమ్మెల్సీ పదవికి ప్రతిపాదించింది. అయితే.. గతంలో గవర్నర్ కోటాల నామినేషన్లపై కోర్టులో వివాదం నడవటం, ఆ తర్వాత కొత్త గవర్నర్ రాక వంటి పరిణామాల వల్ల ఈ ప్రక్రియ ఆలస్యమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్‌తో చర్చలు జరిపి ఈ అడ్డంకిని తొలగించడానికి ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ గవర్నర్ కోటా క్లియర్ కాకపోతే.. ఖాళీగా ఉన్న ఏదైనా ఇతర ఎమ్మెల్సీ స్థానం.. స్థానిక సంస్థ లేదా ఎమ్మెల్యే కోట ద్వారా ఆయన్ని మండలికి పంపాల్సి ఉంటుంది.
ఒక వేళ ఈ ప్రయత్నాలు వర్కవుట్ కాకుంటే అజర్ మంత్రి పదవి పోతే.. మైనార్టీల్లో అసంతృప్తి మొదలవుతుందా? అన్న ప్రశ్నకు ఆస్కారమేర్పడుతోంది. రేవంత్ రెడ్డి క్యాబినెట్‌లో అజరుద్దీన్ ఏకైక ముస్లిం మంత్రి. అది కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ముందు ఆయన్ను క్యాబినెట్‌లోకి తీసుకున్నారు. ఒక వేళ అజారుద్దీన్ మంత్రి పదవిని రేవంత్ నిలపలేకపోతే.. అదంతా ఆ టైంలో అంటూ జూబ్లీ ఉపఎన్నికలో అవసరానికి మైనార్టీ ఓట్ల కోసం వేసిన ఎరగా వారు భావించే అవకాశముంది. ప్రభుత్వం ఏర్పాటైన దాదాపు రెండేళ్ల వరకు మంత్రిమండలిలో మైనారిటీ లేదన్న విమర్శలు ఉన్నాయి. దాన్ని పూడ్చడానికే ఉప ఎన్నిక సమయంలో అజారుద్దీన్‌ను మంత్రిని చేశారు.
ఇప్పుడు ఆయన పదవి కోల్పోతే, అది కాంగ్రెస్ పార్టీకి మైనార్టీ ఓటు బ్యాంకు విషయంలో రాజకీయంగా పెద్ద దెబ్బ అవుతుంది. అందుకే ప్రభుత్వం ఎలాగైనా ఆయన్ను ఎమ్మెల్సీగా గెలిపించే ప్రయత్నాల్లో ఉంది. ప్రస్తుతానికి అజర్ భవితవ్యం గవర్నర్ నిర్ణయం, న్యాయపరమైన అంశాల చేతుల్లో ఉంది. ఒకవేళ ఏప్రిల్ 30 లోపు వీలు కాకపోతే, ఆయన రాజీనామా చేసి, మళ్ళీ ఎమ్మెల్సీ అయ్యాక తిరిగి మంత్రిగా ప్రమాణం చేసే అవకాశం ఉంటుంది. కానీ గతంలో హరికృష్ణ విషయంలో జరిగినట్లుగా, ఒకసారి పదవి పోతే తిరిగి రావడం అంత సులభం కాదు. మొత్తానికి, ఏప్రిల్ 30వ తేదీ అజరుద్దీన్ రాజకీయ ఇన్నింగ్స్‌లో ఒక క్రూషియల్ పీరియడ్ లాంటిది. ఆయన ఈ గడువును దాటుతారా లేదా? అనేది వచ్చే కొద్ది రోజుల్లో తేలిపోతుంది.
