దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఎవరినైనా మెచ్చుకున్నారంటే ఇండస్ట్రీలో ఆ మాటకు ఉండే విలువే వేరు. తాజాగా దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చి, థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటున్న ‘ఆకాశంలో ఒక తార’ సక్సెస్ మీట్‌లో జక్కన్న మాట్లాడిన మాటలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో నటించిన తెలుగమ్మాయి సాత్విక గురించి ఆయన చేసిన కామెంట్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
సాధారణంగా తెలుగు సినిమాల్లో బయటి భాషల హీరోయిన్ల హవానే ఎక్కువగా కనిపిస్తుంటుంది. రాజమౌళి తన మనసులో మాట బయటపెట్టారు. “మన ఇండస్ట్రీకి ఏ భాష నుంచి నటులు వచ్చినా నెత్తిన పెట్టుకుంటాం. కానీ ఎక్కడో లోపల.. శ్రీదేవి గారు, జయప్రద గారు, జయసుధ గారిలా మన తెలుగు అమ్మాయి ఒకరు ఆ స్థాయికి వెళ్తే చూడాలని బలంగా అనిపిస్తుంటుంది.
సాత్విక.. కచ్చితంగా నువ్వు ఆ స్థానానికి వెళ్తావు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నువ్వు చాలా పెద్ద స్థాయికి చేరుకుంటావు, ఇందులో నాకు ఏ డౌట్ లేదు” అంటూ నాటి స్టార్ హీరోయిన్లతో పోలుస్తూ మెచ్చుకున్నారు. అంతేకాదు, “మాకోసం ఇంకొంచెం త్వరగా తెలుగు నేర్చేసుకో” అంటూ ఆప్యాయంగా చెప్పారు. కెరీర్ మొదట్లోనే రాజమౌళి లాంటి డైరెక్టర్ నుంచి ఇలాంటి కితాబు దక్కడం మామూలు విషయం కాదు.
తమ్మీ.. నువ్వు మావాడివే!
హీరో దుల్కర్ సల్మాన్‌ను కూడా జక్కన్న మనస్ఫూర్తిగా మెచ్చుకున్నారు. కల్పన పాత్ర కృష్ణ భుజాలపై నిలబడితే, ‘ఆకాశంలో ఒక తార’ సినిమా మొత్తం దుల్కర్ భుజాలపైనే నడిచిందని అన్నారు. దుల్కర్ లేకపోతే ఈ సినిమా ఇంత అందంగా వచ్చేది కాదన్న రాజమౌళి.. “నువ్వు గొప్ప నటుడివి కాదని నీ గురించి నువ్వు ఏమైనా అనుకోవచ్చు, కానీ తెలుగు ప్రేక్షకులు నిన్ను ఎప్పుడో సొంతం చేసుకున్నారు. తమ్మీ నువ్వు మావాడివే!” అనడంతో ఆడిటోరియం మొత్తం విజిల్స్, అరుపులతో దద్దరిల్లిపోయింది.
వేదికపై ఉన్న నిర్మాత అల్లు అరవింద్‌ను రాజమౌళి సరదాగా ఆటపట్టించారు. “అరవింద్ గారూ.. మీరు ఇప్పుడు అవార్డులు తెచ్చే సినిమాలు చేస్తున్నారు. కానీ పక్కనున్న ఈ యంగ్ ప్రొడ్యూసర్ (స్వప్న దత్) ఉన్నారు చూశారా.. మొత్తం క్రెడిట్ అంతా లాగేసుకుంటారు, మీకు ఏమీ మిగలనివ్వరు. అందుకే మీరు మన ‘మగధీర’ తీసిన గీతా ఆర్ట్స్‌లో సోలోగా సినిమాలు చేయాలి, అప్పుడే క్రెడిట్ అంతా మీకే దక్కుతుంది” అంటూ అందరూ నవ్వారు.
దర్శకుడు పవన్ సాధినేని పడిన కష్టాన్ని, స్క్రీన్ ప్లేలో ఆస్ట్రోనాట్ చిన్ననాటి కల్పనను తాకే సీన్, నాజర్ నటనను ప్రత్యేకంగా మెచ్చుకున్నారు రాజమౌళి. ఇక స్పీచ్ ముగించే టైంలో ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా “బాబ్ అప్‌డేట్” (వారణాసి సినిమా అప్‌డేట్) అంటూ అరవడంతో.. జక్కన్న నవ్వుతూ “త్వరలో.. త్వరలో..” అని అభిమానుల్లో హుషారు నింపారు.
The post మరీ పొగిడేస్తున్నారు appeared first on iDreamPost.
