దోహాలో జరుగుతున్న రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో భారత్ ‘ఎ’, పాకిస్థాన్ ‘ఎ’ జట్ల మధ్య మ్యాచ్‌కు ముందు ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. టాస్ సమయంలో నానెం ఏ వైపు పడిందనే విషయంలో గందరగోళం ఏర్పడింది. మ్యాచ్ రిఫరీ నీయమూర్ రషీద్ మొదట నానెం తప్పుగా ప్రకటించినట్లు కనిపించడంతో కొద్దిసేపు ఉత్కంఠ ఏర్పడింది. చివరకు పాకిస్థాన్ ‘ఎ’ జట్టుకే టాస్ దక్కింది.
భారత్ ‘ఎ’ కెప్టెన్ తిలక్ వర్మ నానెం ఎగరవేయగా, పాకిస్థాన్ ‘ఎ’ సారథి అబ్దుల్ సమద్ ‘హెడ్స్’ అని చెప్పాడు. నానెం ఇద్దరు కెప్టెన్ల మధ్య పడడంతో మ్యాచ్ రిఫరీ రషీద్ దాని ఫలితాన్ని పరిశీలించారు. అనంతరం అది ‘టెయిల్స్’ అని బ్రాడ్కాస్ట్ హోస్ట్‌కు చెప్పినట్లు కనిపించింది. అయితే అబ్దుల్ సమద్ మాత్రం ఆ నిర్ణయంపై సందేహం వ్యక్తం చేశాడు. స్వయంగా నానెం పరిశీలించి అది ‘హెడ్స్’ అని చెప్పాడు. దీంతో రషీద్ అతడి మాటను అంగీకరించడంతో టాస్ పాకిస్థాన్‌కు అనుకూలంగా మారింది.
ఈ పరిణామం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. కొందరు పాకిస్తాన్ అభిమానులు టాస్ సమయంలో జరిగిన గందరగోళాన్ని ప్రస్తావిస్తూ ఆసియా క్రికెట్ కౌన్సిల్‌పై పక్షపాత ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఏసీకి క్రికెట్ బోర్డు చీఫ్ మోసిన్ నఖ్వీ అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో ఈ అంశంపై మరింత చర్చ జరిగింది. అయితే టాస్ విషయంలో జరిగినది పొరపాట, ఉద్దేశపూర్వక చర్య అనే దానిపై ఎలాంటి ఆధారాలు లేవు.
టాస్ గెలిచిన పాకిస్థాన్ ‘ఎ’ కెప్టెన్ అబ్దుల్ సమద్ మొదట బ్యాటింగ్ ఎంపిక చేసుకున్నాడు. పిచ్ పొడిగా కనిపిస్తోందని, అందుకే మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపాడు. తమ జట్టులోని బ్యాటర్లు, బౌలర్లు అందరూ ఆత్మవిశ్వాసంతో ఉన్నారని, మంచి పోటీని ప్రేక్షకులు చూస్తారని అన్నారు. మరోవైపు తిలక్ వర్మ కూడా తాము టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకునేవాళ్లమని చెప్పాడు. పిచ్ కొంత పొడిగా కనిపిస్తోందని తెలిపారు. వారికి ఇది మరో సాధారణ మ్యాచ్ మాత్రమేనని, అయితే ఇండియా-పాక్ మ్యాచ్ ను ప్రేక్షకులు ఎప్పుడూ ఇంట్రెస్ట్ గా చూస్తారని తెలిపాడు.
