కార్లు, విలాసవంతమైన బంగ్లాలు, హోదా, డబ్బు ఉంటేనే సంతోషంగా ఉండగలమని జీవితంలో చాలా మంది భావిస్తుంటారు. కానీ, సీబీఐలో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన ఓ మాజీ అధికారి మాత్రం వీటని వదులుకుని అడవుల్లో సన్యాసిగా మారాడు. ఆధ్యాత్మిక బాటలో సంతోషాన్ని వెతుక్కుంటున్నాడు. ఆధునిక ప్రపంచపు హంగులకు దూరంగా గుహల్లో నివసిస్తూనే జీవితపు అసలైన సత్యాన్ని తెలుసుకున్నానని ఆయన చెబుతున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
తన పేరును బహిరంగంగా వెల్లడించిన మాజీ సీబీఐ అధికారి, తన ఆధ్యాత్మిక ప్రయాణం వెనుక ఉన్న కారణాలను వీడియోలో పంచుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించి సీబీఐ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో జీవితంలో అంతా సాధించానని అనుకున్నట్లు ఆయన చెప్పారు. అయితే, కొద్దికాలానికే ఆ వ్యవస్థలో ప్రతిక్షణం ఉక్కిరిబిక్కిరిగా అనిపించడం మొదలైందని పేర్కొన్నారు. చట్టాన్ని అమలు చేసే ప్రజలతో కఠినంగా, కర్కశంగా వ్యవహరించాల్సిన అవసరం లేదని, అది తన సహజ స్వభావానికి పూర్తిగా విరుద్ధమని వివరించారు.
ఇల్లు, కారు, డబ్బు తనకు కావాల్సిన నిజమైన స్వేచ్ఛ, మనశ్శాంతి లేవని గ్రహించానని.. ఆతిని పూడ్చుకునేందుకు ఉద్యోగాన్ని వదిలిపెట్టాలని నిర్ణయించుకున్నారు. ఉద్యోగం వదిలిన తర్వాత పలు రాష్ట్రాల్లో సంచరిస్తూ ఓంకారేశ్వర్ సమీపంలోని నర్మదా నది తీరానికి చేరుకున్నప్పుడే తన జీవితంలో అసలైన మార్పు మొదలైందని ఆయన చెప్పారు. నర్మదా నది ఒడ్డున అడుగుపెట్టగానే తన సమస్యలన్నీ తొలగిపోయినట్లు అనిపించింది.
ప్రస్తుతం ఆయన కాళ్లకు చెప్పులు, పడుకోవడానికి చాప కూడా లేకపోయినా ధ్యానం, అమ్మవారి ప్రార్థన, నర్మదా పరిక్రమ చేస్తూ, మిగిలిన ఆహారాన్ని తింటూ గడుపుతున్నారు. ఓ పర్వతంపై ఉన్న ఆలయంలో సాధువుల సాంగత్యంలో కొన్నేళ్లు ఉండి, సమీప గ్రామాల పిల్లలకు ప్రకృతితో మమేకమవ్వడం నేర్పించారు. ప్రస్తుతం ఆయన దట్టమైన అడవి గుహల్లో నివసిస్తూ, కట్టెల పొయ్యిలోని వంట చేసుకుంటూ ధ్యానంలో గడుపుతున్నారు.
