ప్రపంచవ్యాప్తంగా గేమింగ్ ప్రియులను ఉర్రూతలూగిస్తున్న ‘గ్రాండ్ టెఫ్ట్ ఆటో 6’ (GTA 6) క్రేజ్ ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇది ఉదాహరణ. ప్రముఖ అమెరికన్ యూట్యూబర్, గేమింగ్ స్ట్రీమర్ ఐషోస్పీడ్ ఏకంగా 40 గంటల పాటు నిద్రపోకుండా ఈ గేమ్ ఆడినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, ఈ సమయంలో గేమ్ ప్రధాన కథలో దాదాపు 82 శాతం పూర్తి చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. నవంబర్ 19న GTA 6 విడుదలైన నేపథ్యంలో ఐషోస్పీడ్ నవంబర్ 18 రాత్రి నుంచే యూట్యూబ్, ట్విచ్ వేదికగా లైవ్ స్ట్రీమింగ్ ప్రారంభమైంది. మొదట రోజుకు 10 నుంచి 12 గంటలు మాత్రమే ఆడాలని నిర్ణయించుకున్నాడు. కానీ గేమ్ మొదలుపెట్టాక కథలో పూర్తిగా లీనమైపోయాడు. తొలి లైవ్ స్ట్రీమ్ ఏకంగా 23 గంటల 45 నిమిషాల పాటు కొనసాగింది.
ఈ లైవ్‌ను ఒకేసారి గరిష్ఠంగా 3.92 లక్షల మంది వీక్షించారు. అనంతరం కూడా గేమ్ కొనసాగిన స్పీడ్ 40 గంటల మార్కును చేరుకున్నట్లు కథనాలు వెల్లడించాయి. అప్పటికి గేమ్‌లోని ప్రధాన స్టోరీ 81 నుంచి 82 శాతం సాధించినట్లు అతని ప్రోగ్రెస్ స్క్రీన్‌లో కనిపించింది. మిగిలిన స్టోరీ పూర్తి చేయడానికి మరో 12 గంటలు పట్టొచ్చని స్పీడ్ అభిమానులతో చెప్పాడు. అసలు గేమ్ కథ ఎలా ముగుస్తుందో తెలుసుకోవాలంటే ఆసక్తితోనే ఆడటం ఆపలేకపోతున్నానని వివరించాడు. అయితే అభిమానులు మాత్రం అతడి ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముందు నిద్రపోవాలని, విశ్రాంతి తీసుకోవాలని లైవ్ చాట్‌లో సూచిస్తున్నారు. మొత్తానికి GTA 6పై ఉన్న క్రేజ్‌కు ఐషోస్పీడ్ మారథాన్ గేమింగ్ సెషన్ మరో ఉదాహరణగా నిలిచింది. అయితే ఈ గేమ్ లైవ్ స్ట్రీమింగ్ చేసి, ఏకంగా ఒక్కరాత్రిలోనే రూ.2 కోట్లు సంపాదించాడు.

