Home సినిమా హైదరాబాద్‌లో మరో ట్విన్ టవర్స్! – Andhra Waves

హైదరాబాద్‌లో మరో ట్విన్ టవర్స్! – Andhra Waves

by andhra andhrawave
0 comments
హైదరాబాద్‌లో మరో ట్విన్ టవర్స్!


హైదరాబాద్‌లో ఇప్పటికే ఎన్నో ఐటీ కంపెనీల భవనాలు, భారీ ఆఫీసులు ఉన్నాయి. ఇప్పుడు వీటికి పోటీగా మరో అత్యాధునిక భవనం రాబోతోంది. అది కూడా ప్రైవేట్ కంపెనీ కాదు.. సైబరాబాద్ నగరపాలక సంస్థకు సంబంధించిన ప్రధాన కార్యాలయం. మాదాపూర్‌లోని హైటెక్స్ ప్రాంతంలో ఏకంగా రూ.169 కోట్లతో ఈ భారీ భవనాన్ని నిర్మించబోతున్నారు. రెండు టవర్ల తరహాలో ఉండే ఈ భవనంలో మొత్తం ఎనిమిది అంతస్తులు ఉంటాయి. ప్రజల సమస్యలు చెప్పుకోవడానికి ప్రత్యేక కేంద్రం నుంచి.. 400 మంది కూర్చునే ఆడిటోరియం వరకు ఎన్నో సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు. అంతేకాదు.. వివిధ ప్రభుత్వ విభాగాల కార్యాలయాలన్నీ ఒకే చోట ఉండేలా ప్లాన్ చేశారు. మరి ఈ ట్విన్ టవర్లు ఎక్కడ రాబోతున్నాయి? ఇందులో ఏయే సౌకర్యాలు ఉండబోతున్నాయి? ఎప్పటిలోగా నిర్మాణం పూర్తి చేయాలని పెట్టుకున్నారు? వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం.

హైదరాబాద్ మాదాపూర్‌లోని ఖానామెట్ ప్రాంతంలోని హైటెక్స్, నోవాటెల్ మధ్య ఈ కొత్త భవనాన్ని నిర్మించనున్నారు. దాదాపు 4.11 ఎకరాల స్థలంలో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఇప్పటికే సైబరాబాద్ నగరపాలక సంస్థ టెండర్లు పిలిచింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.169 కోట్లు. భవన నిర్మాణం పూర్తయితే ప్రస్తుతం తాత్కాలికంగా న్యాక్ భవనంలో కొనసాగుతున్న సీఎంసీ కార్యాలయానికి సొంత ప్రధాన కార్యాలయం అందుబాటులోకి వస్తుంది.

ఈ భవనం ప్రత్యేకత దాని డిజైన్. రెండు టవర్ల తరహాలో నిర్మించనున్నారు. ఒక టవర్ ఆరు అంతస్తులతో, మరో టవర్ ఎనిమిది అంతస్తులతో ఉంటుంది. మొత్తం నిర్మాణం స్టిల్ట్ ప్లస్ ఎనిమిది అంతస్తులుగా ఉండనుంది. సుమారు 2.41 లక్షల అడుగుల విస్తీర్ణంలో భవనాన్ని నిర్మించారు. బయటివైపు ముదురు కాఫీ రంగు అద్దాలు అమర్చారు. ప్రతి అంతస్తులో సహజమైన గాలి, వెలుతురు వచ్చేలా ప్రత్యేకంగా డిజైన్ చేశారు. భవనం వెనుక భాగంలో చెరువు ఉండేలా కూడా ప్రణాళిక రూపొందించారు.

ఈ భవనంలో మొదటి అంతస్తును పూర్తిగా ప్రజలకు ఉపయోగపడేలా రూపొందించారు. ఇక్కడ 195 మంది కూర్చునే సామర్థ్యంతో కౌన్సిల్ హాల్ ఏర్పాటు చేస్తారు. అలాగే ప్రజలు తమ సమస్యలను అధికారులకు చెప్పుకోవడానికి ప్రజావాణి కేంద్రం ఉంటుంది. వీఐపీల గది, మీడియా గది, డైనింగ్ హాల్ కూడా ఏర్పాటు చేయనున్నారు. రెండో అంతస్తులో మేయర్, డిప్యూటీ మేయర్, కమిషనర్ కార్యాలయాలు. ప్రజాప్రతినిధులు సమావేశాలు నిర్వహించేందుకు ప్రత్యేక గదులు కూడా ఏర్పాటు చేస్తారు.

ఈ మూడో అంతస్తు నుంచి ఆరో అంతస్తు వరకు వివిధ ప్రభుత్వ విభాగాలకు స్థలం కేటాయించారు. మూడో అంతస్తులో పరిపాలన, ఆర్థిక విభాగాల కార్యాలయాలు ఉంటాయి. నాలుగో అంతస్తులో క్రీడలు, హైడ్రా, విద్యుత్, జలమండలి, పారిశుద్ధ్య విభాగాలకు సంబంధించిన కార్యాలయాలు ఏర్పాటు చేస్తారు. ఐదో అంతస్తులో ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్, భూసేకరణ విభాగాలు ఉంటాయి. ఆరో అంతస్తులో, ఎన్నికలు, ఐటీ, న్యాయ జీఐఎస్, ఎస్టేట్స్ విభాగాలకు కార్యాలయాలు ఏర్పాటు చేస్తారు. అంటే ప్రజలకు అవసరమైన అనేక ప్రభుత్వ సేవలకు సంబంధించిన విభాగాలు ఒకే భవనంలో అందుబాటులోకి రానున్నాయి.

ఈ భవనంలో మరో ప్రత్యేకత ఏడో అంతస్తులో ఏర్పాటు చేయనున్న కమాండ్ కంట్రోల్ సెంటర్. సుమారు 1,311 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని నిర్మించనున్నారు. నగర పాలనకు సంబంధించిన పర్యవేక్షణ, సమన్వయానికి ఇది ఉపయోగపడనుంది. ఇక ఎనిమిదో అంతస్తులో 400 మంది కూర్చునే సామర్థ్యంతో భారీ ఆడిటోరియం ఏర్పాటు చేస్తారు. దీని విస్తీర్ణం 3,270 చదరపు అడుగులు. అలాగే భవనానికి అవసరమైన విద్యుత్‌లో కొంత సొంతంగా ఉత్పత్తి చేసుకునేందుకు సోలార్ విద్యుత్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తారు.

భవనం కింద ఉండే స్టిల్ట్ ప్రాంతంలో పార్కింగ్ సదుపాయం కల్పిస్తారు. అంతేకాదు.. మీ సేవా కేంద్రాలు, పౌరసేవా కేంద్రాలు, పార్కు, మురుగునీటి శుద్ధి కేంద్రం, శౌచాలయాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఒప్పందం పూర్తయిన తర్వాత 12 నెలల్లో నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

మొత్తంగా చూస్తే.. రూ.169 కోట్లతో నిర్మించనున్న ఈ సైబరాబాద్ ట్విన్ టవర్స్ కేవలం ప్రభుత్వ కార్యాలయం మాత్రమే కాదు. ప్రజలకు పౌరసేవలు అందించడంతో పాటు నగర పాలనకు ఒకే చోటు నుంచి అవసరమైన సేవలను సమన్వయం చేసి రూపొందించారు. నిర్మాణం పూర్తయితే మాదాపూర్ హైటెక్స్ ప్రాంతంలో మరో భారీ ప్రభుత్వ భవనం అందుబాటులోకి రానుంది.

The post హైదరాబాద్‌లో మరో ట్విన్ టవర్స్! iDreamPostలో మొదట కనిపించారు.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird