లైఫ్ పార్టనర్ ఎందుకు మారిపోతారు? దీనికి కారణాలు ఏమిటి?

ప్రతి ఒక్కరి జీవితంలోనూ ప్రేమ, నమ్మకం , నిజాయితీ అనేవి ఏ బంధానికైనా ప్రాణాధారమైన మూలాలు. కానీ కొన్నిసార్లు ఒక భాగస్వామి ఎంతో నిజాయితీగా, పూర్తి నిబద్ధతతో సంబంధాన్ని కొనసాగిస్తున్నప్పటికీ, ఎదుటి వ్యక్తి వైపు నుంచి మోసం లేదా నమ్మకద్రోహం ఎదురవుతుంది. ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు మనసులో అనేక ప్రశ్నలు మెదులుతుంటాయి. అంతులేని ప్రేమను పంచినా, నమ్మకాన్ని నిలబెట్టుకున్నా భాగస్వామి ఎందుకు మారిపోతారు అనేదానికి ఒక్కటే కారణం ఉండదు. దీని వెనుక అనేక వ్యక్తులు, మానసిక , భావోద్వేగ కారణాలు దాగి ఉంటాయి. అవేంటో తెలుసుకుంటే.. ఎంతో మందికి ఎన్నో సందేహాలు తొలగుతాయి, మనసులోని సంఘర్షణకు ఒక ముగింపు పడుతుంది. ఆ విషయాలేంటో తెలుసుకుంటే..
ఎమోషన్ గ్యాప్..
నేటి కాలంలో జీవితంలో బిజీ లైఫ్ చాలా పెరిగింది. దీని వల్ల ఎమోషనల్ గా దూరం పెరగడం అనేది ఒక ప్రధాన కారణం అవుతోంది. ఉరుకుల పరుగుల లైఫ్ స్టైల్ , వృత్తిపరమైన ఒత్తిళ్లు , పెరిగిన బాధ్యతల కారణంగా ఇద్దరూ ఒకరికొకరు తగినంత సమయం కేటాయించుకోలేక పోయారు. క్రమంగా ఈ చిన్న దూరం కాస్తా మనసుల మధ్య పెద్ద ఖాళీని సృష్టిస్తుంది. మాట్లాడటం తగ్గడం, మనసులోని భావాలను పంచుకోలేకపోవడం వల్ల కొందరు మనసులో ఉన్న ఎమోషన్స్ ను పంచుకోవడానికి, మనసులో ఉన్న విషయాలు ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి ఉందే.. అనే లోటును పూడ్చుకోవడానికి ఇతర మార్గాలను వెతకడం ప్రారంభిస్తారు.
ప్రాధాన్యత లేకపోవడం..
కొన్నిసార్లు సంబంధంలో వారికి తగిన ప్రాధాన్యత దక్కడం లేదనే భావన కూడా లైఫ్ పార్టనర్ ను దూరం చేస్తుంది. తమ చిన్న చిన్న ఆశలను పక్కన పెట్టడం, అభిప్రాయాలను విస్మరించటం లేదా భావాలను ఎవరూ పట్టించుకోకపోవడం వంటి విషయాలు వ్యక్తిని తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయి. బంధంలో తమ ఉనికికి విలువ లేదనిపించినప్పుడు, తమను అర్థం చేసుకునే మూడో వ్యక్తి వైపు ఆకర్షితులయ్యే ప్రమాదం పెరుగుతుంది.

నియంత్రణ స్వభావం..
కొందరు లైఫ్ పార్ట్నర్స్ మితిమీరిన నియంత్రణ ధోరణి కలిగి ఉంటారు. ఇలా చాలా కంట్రోల్ చేయడం చూడటం కూడా సంబంధాలలో పెద్ద చిచ్చు పెడుతుంది. ఏ విషయంలోనైనా పదే పదే ఆంక్షలు విధించడం, తమ మాటనే చెల్లాలని పట్టుబట్టడం , అవతలి వ్యక్తి స్వేచ్ఛను హరించడం వంటి ప్రవర్తన వల్ల బంధంలో అసంతృప్తి గూడు కట్టుకుంటుంది. ఎలాంటి తప్పు చేయకపోయినా ప్రతిసారీ రాజీ పడాల్సి వస్తుందనే భావన భాగస్వామిలో తిరుగుబాటు భావాలను లేదా బంధం నుండి మానసికంగా దూరమయ్యే ధోరణిని ప్రేరేపిస్తుంది.
ఇది కూడా చదవండి పిల్లలు తల్లిదండ్రులతో అన్ని విషయాలు షేర్ చేసుకోవాలంటే.. ఇదిగో ఇలా పెంచండి..!
చిన్న విషయాలకు గొడవలు..
చిన్న చిన్న విషయాలకు కూడా ఎప్పుడూ గొడవలు పడటం, మనసులో పగను లేదా కోపాన్ని ఎక్కువ కాలం దాచుకోవడం వల్ల బంధంలో చేదు అనుభవాలు మిగులతాయి. కొన్ని సందర్భాల్లో ప్రతీకార భావంతో లేదా భాగస్వామిని మానసికంగా బాధపెట్టాలంటే దుర్వ్యామోహంతో కూడా కొందరు ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు.
గత బంధాల భయం..
గతంలో ఎదురైన చేదు అనుభవాలు లేదా పాత బంధాల తాలూకు భయాలు కూడా కొందరిలో మానసిక నిలకడగా ఉండకుండా చేస్తాయి. సీరియస్ రిలేషన్షిప్స్ పట్ల భయం లేదా భాగస్వామి ఆలోచనా విధానాలు ఉండటం వల్ల కూడా అపార్ధాలు చోటుచేసుకుంటాయి. ఏది ఏమైనప్పటికీ, ప్రేమ , నమ్మకం ఉన్న చోట దాపరికాలు లేకుండా మాట్లాడుకోవడం, పరస్పర గౌరవం లేకపోతే ఏ బంధమైనా బలహీనపడే అవకాశం ఉంటుంది.
*రూపశ్రీ.
మీకు నచ్చవచ్చు మొహమాటం కొద్దీ అందరి ముందు తాలూపుతూ ఉంటారా.!
డిప్రెషన్, బీపీ, నిద్రలేమి.. వీటి వెనుక అసలు కారణం ఏమిటి
