టాలీవుడ్లో కొందరు దర్శకుల సినిమాల్లో నటిస్తే చాలు హీరోయిన్ల రేంజ్ మారిపోతుంది. ఆ లిస్టులో ముందుగా వినిపించే పేరు హను రాఘవపూడి. ఆయన సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు ఉండే వెయిట్, ఆ పాత్రలను ఆయన చూపించే విధానం చాలా స్పెషల్‌గా ఉంటాయి. హను పరిచయం వాళ్లు, ఆయన సినిమాల్లో నటించిన చాలామంది హీరోయిన్లు ఇప్పుడు ఇండియన్ సినిమాలోనే టాప్ స్టార్స్‌గా కొనసాగుతున్నారు. ఇప్పుడు అదే లక్ ప్రభాస్ సరసన ‘ఫౌజీ’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అవుతున్న కొత్త హీరోయిన్ ఇమాన్వికి దక్కుతుందా అనే ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
మృణాల్, సాయి పల్లవి బాటలో ఇమాన్వి
గతంలో లావణ్య త్రిపాఠి, మెహ్రీన్ పిర్జాదా, మేఘా ఆకాష్లను హను రాఘవపూడి తన సినిమాలతోనే టాలీవుడ్‌కు పరిచయం చేశారు. మెహ్రీన్, మేఘా ఆకాష్ టాప్ లీగ్‌లో లేకపోయినా వరుస సినిమాలతో కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. ఇక ‘పడి పడి లేచె మనసు’లో నటించిన సాయి పల్లవి, ‘సీతా రామం’తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్, అదే సినిమాలో కీలక పాత్ర చేసిన రష్మిక మందన్న ప్రస్తుతం ఇండియా వైడ్‌గా భారీ ప్రాజెక్టులు చేస్తూ దూసుకుపోతున్నారు. ముఖ్యంగా ‘సీతా రామం’ తర్వాత మృణాల్ ఠాకూర్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఇప్పుడు అదే మ్యాజిక్ ‘ఫౌజీ’ హీరోయిన్ ఇమాన్వి విషయంలోనూ రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు.
ఫస్ట్ సినిమాతోనే జాక్‌పాట్!
ఇమాన్వి అసలు పేరు ఇమాన్ ఇస్మాయిల్. ఢిల్లీలో పుట్టిన ఈమె, అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్నత చదువులు పూర్తి చేశారు. సోషల్ మీడియాలో డ్యాన్స్ వీడియోలతో పాపులర్ అయిన ఇమాన్వి, ఏకంగా తన ఫస్ట్ సినిమాతోనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన ఛాన్స్ కొట్టేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. పిరియాడిక్ వార్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకంగా ఉండబోతోందని టాక్.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణం ‘ఫౌజీ’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా జరుగుతోంది. రీసెంట్గా ప్రభాస్, ఇమాన్విలపై ఒక గ్రాండ్ పెళ్లి మండపం సెట్లో కీలక సన్నివేశాలు షూట్ చేశారట. విశేషమేమిటంటే, ‘ఫౌజీ’ రిలీజ్ అయ్యే వరకు మరో కొత్త తెలుగు సినిమాకు సైన్ చేయకూడదని ఇమాన్వి ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. 2027 మార్చి 19న విడుదల కానున్న ఈ సినిమాతో ఇమాన్వి ఇండియా వైడ్‌గా ఎలాంటి క్రేజ్ తెచ్చుకుంటుందో చూడాలి.
The post ‘ఫౌజీ’ బ్యూటీకి ఆ లక్ దక్కుతుందా? iDreamPostలో మొదట కనిపించారు.
