స్మార్ట్‌ఫోన్‌లో మనం తరచుగా ఉపయోగించే ఫీచర్లలో ఎయిర్‌ప్లేన్ మోడ్ ఒకటి. విమాన ప్రయాణ సమయంలో ఫోన్‌ను ఈ మోడ్‌లో పెట్టాలని సిబ్బంది సూచిస్తున్నారు. అయితే విమానాల్లోనే కాదు.. నెట్వర్క్ సరిగా లేని, బ్యాటరీ ఆదా చేసుకోవాలనుకున్నప్పుడు కూడా చాలామంది ఈ ఫీచర్‌ను ఉపయోగిస్తుంటారు. అసలు ఎయిర్‌ప్లేన్ మోడ్ ఆన్ చేసిన వెంటనే ఫోన్లో ఏం జరుగుతుంది? ఓసారి చూసేయండి..
ఎయిర్‌ప్లేన్ మోడ్ ఆన్ చేయగానే స్మార్ట్‌ఫోన్‌లోని సెల్యులార్ నెట్వర్క్ కనెక్షన్ నిలిచిపోతుంది. అంటే మొబైల్ టవర్లతో ఫోన్‌కు ఉండే కనెక్షన్ తెగిపోతుంది. దీనితో సాధారణ మొబైల్ కాల్స్, SMSలు, మొబైల్ డేటా పనిచేయవు. ఫోన్ నెట్వర్క్ కోసం సిగ్నల్ వెతకడం కూడా ఆపేస్తుంది. అయితే ఫోన్ పూర్తిగా ఆఫ్ అయిపోదు. అందులోని ప్రాసెసర్, స్క్రీన్, స్టోరేజ్, ఇతర యాప్‌లు యథావిధిగా పనిచేస్తాయి.
గతంలో ఎయిర్‌ప్లేన్ మోడ్ ఆన్ చేయగానే వైఫై, బ్లూటూత్ కూడా ఆఫ్ అయ్యేవి. కానీ ప్రస్తుతం చాలా స్మార్ట్ఫోన్లలో ఈ కనెక్షన్లను విడిగా ఆన్ చేసుకునే అవకాశం ఉంది. అంటే ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో వైఫై ఆన్ చేసి ఇంటర్నెట్ ఉపయోగించవచ్చు. బ్లూటూత్ ద్వారా ఇయర్‌ఫోన్స్, స్మార్ట్‌వాచ్ వంటి పరికరాలను కనెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఈ సౌకర్యాలు ఫోన్ మోడల్, ఆపరేటింగ్ సిస్టమ్‌ను బట్టి మారవచ్చు.
ఎయిర్ప్లెన్ మోడ్, డూ నాట్ డిస్టర్ ఒకటి కావు. ఎయిర్ప్లెన్ మోడ్ సెల్యులార్ నెట్వర్క్ కనెక్షన్‌ను నిలిపివేస్తుంది. డూ నాట్ డిస్టర్బ్ మాత్రం కాల్స్, మెసేజ్‌లు, నోటిఫికేషన్ల నుంచి వచ్చే అంతరాయాలను నియంత్రిస్తుంది. ఇందులో మొబైల్ నెట్వర్క్ మాత్రం యథావిధిగా పనిచేస్తుంది. కాబట్టి కాల్స్ రాకుండా ఉండాలంటే డీఎన్డీ, నెట్వర్క్ నుంచి పూర్తిగా డిస్కనెక్ట్ కావాలంటే ఎయిర్‌ప్లేన్ మోడ్ ఉపయోగించవచ్చు.
మరిన్ని టెక్నాలజీ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
