జీవితంలో విజయం సాధించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ విజయం కొందరే సాధిస్తారు. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. అయితే జీవితంలో విజయం సాధించాలంటే.. కొన్ని పనులను అస్సలు వాయిదా వేయకూడదని చెబుతాడు ఆచార్య చాణక్యుడు. ఆచార్య చాణక్యుడు గొప్ప ఆధ్యాత్మిక వేత్త, తత్వవేత్త.. మనిషి జీవితం గురించి ఎన్నో విషయాలు ఆయన రెండు వేల సంవత్సరాల క్రితమే ఎంతో క్షుణ్ణంగా వివరించాడు. లైఫ్ లో సక్సెస్ కావాలంటే ఏ పనులను వాయిదా వేయకూడదు? ఆచార్య చాణక్యుడు ఏం చెప్పాడు? తెలుసుకుంటే..
ముఖ్యమైన పనులు..
ఒక మనిషి ఫుల్ సక్సెస్ కావాలంటే ఆ వ్యక్తి తన ముఖ్యమైన పనులకు చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. వారికి ముఖ్యమైన పనుల విషయంలో వారు చూపించే చురుకుదనమే వారిని ఆ పనిలో విజయం సాధించేలా చేస్తుంది.ముఖ్యమైన పనులు అయినా సరే.. మళ్లీ చేద్దాం అనే ఆలోచనతో వాయిదా వేయకూడదు. సమయం చాలా విలువైన ఆస్తి అని, వాయిదా వేయడం వల్ల చాలా గొప్ప ఆస్తిని కోల్పోయినట్టే, దీని వల్ల ఒత్తిడి పెరగడమే కాకుండా భవిష్యత్తులో పెద్ద సమస్యలు కూడా తలెత్తుతాయి ఆచార్య చాణక్యుడు చెబుతాడు.
నేర్చుకోవడం..
నేర్చుకోవడాన్ని అభ్యాసం అని అంటారు. చాణక్యుడి ప్రకారం, జ్ఞానమే మనిషి నిజమైన శక్తి. విజయవంతమైన వ్యక్తులు నేర్చుకోవడం ఎప్పుడూ ఆపరు. వారు ప్రతిరోజూ కొత్త విషయాలు నేర్చుకోవడానికి, తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి కృషి చేస్తారు. ఎందుకంటే, ఈ రోజు తాము సంపాదించే జ్ఞానమే రేపటి విజయానికి పునాది వేస్తుందని వారికి తెలుసు.
కష్టం..
విజయానికి కష్టపడటమే ఏకైక, ప్రధాన మార్గం. సక్సెస్ కావాలంటే.. పనులను భారంగా కాకుండా.. వాటిని చాలెంజ్ గా తీసుకుని పూర్తి చేయాలి. తమకు ఎదురొచ్చే ప్రతి పని, తమ ఎదుగుదలకు ఒక గొప్ప మార్గంగా చూడాలి. సోమరితనం , వాయిదా వేయడం మానవ పతనానికి దారితీస్తాయి. అందుకే చాణక్యుడు ప్రతి పనిని సమయానికి పూర్తి చేయమని సలహా ఇస్తాడు.
తప్పులు..
తప్పు చేసినప్పుడు దాన్ని సరిదిద్దుకోకుండా పారిపోవడం వైఫల్యానికి ప్రధాన కారణం అవుతుంది. తన తప్పుల గురించి తెలుసుకుని, వెంటనే వాటిని అంగీకరించి, ఏమాత్రం సమయం వృథా చేయకుండా సరిదిద్దుకునే వ్యక్తి జీవితంలో విజయం సాధించగలుగుతాడు. తప్పులను సకాలంలో సరిదిద్దుకోకపోతే, అవి భవిష్యత్తులో పెద్ద సమస్యలకు దారితీయవచ్చు.
అవకాశాలు..
జీవితంలో సువర్ణావకాశాలు కాలంతో పాటు వస్తూ ఉంటాయి. అలాగే కాలంతో పాటు చేజారి పోతాయి కూడా. ఒకసారి అవకాశం చేజారితే అది తిరిగి రాదని తెలిసి, దానిని గుర్తించి ఆలస్యం చేయకుండా వినియోగించుకోవడంలో నేర్పరి అయినవాడే విజయం సాధిస్తాడని చాణక్య నీతి చెబుతుంది.
*రూపశ్రీ.
.webp)