పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ చరిత్ర విజయం దిశగా దూసుకుపోతోంది. సీఎం అభ్యర్ధిని ప్రకటించకుండా ఎన్టీఏ ఎన్నికల బరిలోకి దిగింది. దాంతో రాష్ట్ర తదుపరి సీఎం ఎవరనే దానిపై సర్వత్రా ఆసక్తి. బెంగాల్ బీజేపీ దిగ్గజ నేతలు సువేందు అధికారి, ఘోష్ పేర్లు సీఎం రేసులో గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రస్తుత ప్రతిపక్ష నేత సువేందు ముఖ్యమంత్రి పదవి రేసులో మొదటి వరుసలో ఉన్నారు. మమతా బెనర్జీని ఆమె సొంత నియోజకవర్గమైన భవానీపూర్‌లో సవాలు చేసి, గట్టి పోటీని ఇచ్చారు. నందిగ్రామ్‌లో గతంలో మమతను ఓడించడం, రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలపై పట్టు, దూకుడుగా ఉండే రాజకీయ శైలి ఆయనకు కలిసొచ్చే అంశాలు. ఎన్నికల ప్రచారంలో హిందూ ఓట్ల ఏకీకరణలో ఆయన కీలక పాత్ర పోషించారు.
బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత దిలీప్ ఘోష్ కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి బలమైన పోటీదారుగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఆయన ఖరగ్‌పూర్ సదర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ మూలాలు కారణంగా, రాష్ట్రవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసిన అనుభవం ఆయనకు అండగా ఉంది. స్థానిక నేతగా ప్రజల్లో ఆయనకున్న గుర్తింపు ప్లస్ అయ్యే అవకాశం ఉంది. అయితే బీజేపీ ఢిల్లీ పెద్దల నిర్ణయమే ఫైనల్. ముఖ్యంగా రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాల దృష్ట్యా, అధిష్ఠానం ఎవరైనా ఊహించని పేరు తెరపైకి తెచ్చే అవకాశం కూడా లేకపోలేదంటున్నారు. ఇద్దరి సీనియర్ నేతల పేర్లు కూడా పరిశీలనలో కనిపిస్తున్నాయి.
