సెర్చ్ ఇంజిన్‌గా మొదలైన గూగుల్.. విశాఖలో ఏర్పాటు చేయబోతున్న సెంటర్ ద్వారా దేశానికే గ్రోత్ ఇంజిన్ కాబోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. టెక్నాలజీ రంగంలో ఏపీలో కొత్త శకానికి శ్రీకారం చుడుతున్న రోజుగా 2026 ఏప్రిల్ 28వ తేదీ గుర్తుండిపోతుందని చెప్పారు. గూగుల్ క్లౌడ్ ఏఐ హబ్ ఏర్పాటుకు మంగళవారం విశాఖపట్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్, గూగుల్ గ్లోబల్ ఇన్ ఫ్రా, క్లౌడ్ వైస్ ప్రెసిడెండ్ బికాస్ కోలే శంకుస్థాపన చేశారు.
శంకుస్థాపన కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులెట్ జనరల్ లారా విలియమ్స్, బీజేపీ ఏపీ చీఫ్ పీవీఎన్ మాధవ్, భారతీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైజెస్ వైస్ చైర్మన్ రాకేష్ మిట్టల్, అదానీ గ్రూప్ చైర్ పర్సన్ జీత్ అదానీ, గూగుల్ ఇండియా ప్రతినిధి ప్రీతి లొబానా ఉన్నారు. అదానీ కనెక్స్, ఎయిర్ టెల్ నెక్స్ ట్రా భాగస్వామ్యంతో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో క్లౌడ్ డేటా సెంటర్‌ను గూగుల్ ఏర్పాటు చేస్తోంది. 1 గిగావాట్ హైపర్ స్కేల్ ఏఐ డేటా సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నారు.
తర్లువాడ, రాంబిల్లి, అడవివరం ప్రాంతాల్లో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు 601 ఎకరాలు ప్రభుత్వం కేటాయించింది. శంకుస్థాపన ముందు గూగుల్ ఎక్స్ పీరియెన్స్ జోన్‌ను సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ…”ఏపీ చరిత్రలో కొత్త టెక్ శకానికి శ్రీకారం చుట్టిన రోజు గూగుల్ రాక విశాఖకే కాదు ఏపీకి ఓ గేమ్ చెంజర్.
గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో భారత చరిత్రలో 2026 ఏప్రిల్ 28వ తేదీ శాశ్వతంగా నిలిచిపోతుంది. 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో టెక్నాలజీ రంగంలో ఏపీ తలెత్తుకుని నిలబడుతుంది. ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ ఇది. దేశానికి ఏఐ గేట్ వేగా ఏపీ డేటా నిలుస్తుంది. సెర్చ్ ఇంజన్‌గా మొదలైన గూగుల్ సంస్థ… భారత్ గ్రోత్ ఇంజన్‌గా మారుతుంది. ప్రతీ ఒక్కరూ గూగుల్‌లో సెర్చ్ చేస్తే గూగుల్ ఏపీని సెలెక్ట్ చేసుకుంది” అని ముఖ్యమంత్రి చెప్పారు.
సీఎంఓ సెక్రటరీగా గూగుల్ ఏఐ అసిస్టెంట్
“ఏపీ ప్రభుత్వం అందించే స్పీడ్ ఆఫ్ గవర్నెన్సుకు గూగుల్ ఏఐ డేటా సెంటర్ నుంచి కూడా సహకారం తీసుకుంటాం. సీఎంఓలోని నలుగురు కార్యదర్శులతో పాటు నాకు కొత్తగా ఏఐఐ అసిస్టెంట్ కూడా సుపరిపాలన సహకారం అందిస్తున్నారు.
ఉత్తరాంధ్ర అంటే గతంలో వలసలు, వెనకబాటుతనం, నిరుద్యోగం కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ఇతర ప్రాంతాల నుంచి ఉత్తరాంధ్రకే వలస వస్తారు. ట్యాలెంట్ మైగ్రేషన్ ముగిసింది. విశాఖ ఇకపై టాలెంట్‌కు డెస్టినీగా నిలవనుంది. విశాఖకు గూగుల్ సెంటరును తీసుకురావడంలో లోకేష్ చొరవను ప్రశంసిస్తున్నాను.
లోకేష్ తొలిసారి గూగుల్ సెంటర్‌ను సందర్శించినప్పుడు విశాఖకు గూగుల్ వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. కానీ ఆ తర్వాత అది సాకారమైంది. గూగుల్ ఇండియాలో ఏఐ ప్రైమ్ డేటా సెంటర్ ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు కలిశారు. రాష్ట్రానికి గూగుల్ పెట్టుబడులు పెట్టేందుకు సహకరించాలని. గూగుల్ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తే… పూర్తిగా సహకరిస్తామని ప్రధాని మోదీ చెప్పారు..
చెప్పినట్టుగానే సహకరించారు. లోకేష్ చొరవ… ప్రధాని సహకారంతో విశాఖలో గూగుల్ ప్రాజెక్ట్ సాకారమైంది. ప్రతిష్టాత్మక అదానీ గ్రూప్, ఎయిర్ టెల్ లాంటి దిగ్గజ సంస్థలు ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తున్నాయి. 2028 సెప్టెంబరు నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేసి ప్రారంభించాలని కోరుతున్నాను. ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది. ఈ నీటి సమస్య లేదు. 60 రోజుల్లోనే గోదావరి నీరు విశాఖకు తీసుకువస్తాం.”అని సీఎం భరోసా ఇచ్చారు.
