Home సినిమా టాలీవుడ్‌లో నరకడమే ట్రెండా? – Andhra Waves

టాలీవుడ్‌లో నరకడమే ట్రెండా? – Andhra Waves

by andhra andhrawave
0 comments
టాలీవుడ్‌లో నరకడమే ట్రెండా?


ఒకప్పుడు తెలుగు సినిమా అంటే కుటుంబమంతా కలిసి హాయిగా థియేటర్‌కు వెళ్లి చూసేలా ఉండేది. పాటలు, ఫైట్లు ఉన్నా.. సినిమా చూసి బయటకు వచ్చేటపుడు మనసుకి ఏదో ఒక మంచి అనుభూతి మిగిలేది. కానీ, గత నాలుగేళ్లలో టాలీవుడ్ తీరు పూర్తిగా మారిపోయింది. తెరపై నరకడాలు, నెత్తురు కారడాలు చూపిస్తేనే సినిమా ఆడుతుందనే పరిస్థితి వచ్చేసింది. హింస లేకపోతే హీరో అనిపించుకోలేదన్న భ్రమలో ఇండస్ట్రీ పడిపోయిందని సెన్సార్ లెక్కలే చెబుతున్నాయి.

షాకింగ్ లెక్కలు.. 2021 vs 2025

గడిచిన నాలుగేళ్లలో తెలుగు చిత్ర పరిశ్రమలో వచ్చిన మార్పు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. 2021లో టాలీవుడ్‌లో కుటుంబంతో కలిసి చూడదగ్గ క్లీన్ ‘U’ సర్టిఫికెట్ సినిమాలు 51 వస్తే, ‘A’ సర్టిఫికెట్ ఉన్నవి 34 వచ్చాయి. కానీ 2025 నాటికి లెక్కలు పూర్తిగా మారిపోయాయి. ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో క్లీన్ ‘U’ సర్టిఫికెట్ తెచ్చుకున్నవి కేవలం 6 అంటే 6 మాత్రమే.

అదే సమయంలో రక్తపాతంతో నిండిన ‘A’ సర్టిఫికెట్ సినిమాల సంఖ్య ఏకంగా 62కు చేరుకుంది. పక్కనే ఉన్న మలయాళంలో 2025లో 88 ‘U’ సినిమాలు వస్తే, ‘A’ సినిమాలు కేవలం 15 మాత్రమే వచ్చాయి. తమిళంలో 64 ‘యు’ సినిమాలు, 17 ‘ఎ’ సినిమాలు ఉన్నాయి. అందరూ ఒకే దేశంలో ఉంటున్నారు, అవే ఫోన్లు వాడుతున్నారు, అవే ఓటీటీలు చూస్తున్నారు. మరి ఒక్క తెలుగు సినిమానే ఇంత వేగంగా ఎందుకు రక్తపాతం వైపు వెళ్లిందనేది అర్థం కానీ విషయంగా మారింది.

బూతు వల్ల కాదు.. అదే కారణం

ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఈ 62 సినిమాలకు ‘A’ సర్టిఫికెట్ ఇచ్చింది అడల్ట్ కంటెంట్ చూసి కాదు. కేవలం ఒళ్లు గగుర్పొడిచేలా నరకడం, రక్తం ఏరులై పారే సీన్లు పెట్టడం వల్లే సెన్సార్ బోర్డు ‘A’ ఇవ్వాల్సి వచ్చింది. ఒకప్పుడు మంచి ఎంటర్టైనర్లు చేసిన మన పెద్ద హీరోలే ఇప్పుడు కత్తులు, గొడ్డళ్లు పట్టుకుని తెరపై విరుచుకుపడుతున్నారు. ‘ఓజీ’, ‘హిట్ 3’, ‘భైరవం’, ‘కిష్కింధాపురి’, ‘జటాధర’.. ఇలా పెద్ద హీరోల సినిమాలన్నీ రక్తపాతం నిండినవే. ఈ రోజుల్లో నరకడమే కమర్షియల్ సినిమాకు కొలమానంగా మారిపోయింది.

ప్రేక్షకులు మారారా? తీసేవాళ్లు మారారా?

సమాజంలో ఉన్నదే సినిమాలో చూపిస్తున్నామని కొందరు అనొచ్చు. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రావడం మానేశారనుకుంటే పొరపాటే. రక్తపాతం లేకుండా, నవ్వుల జాతర తీసుకొచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 255 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంటే ప్రేక్షకులు మంచి సినిమాలను చూడటం ఆపలేదు.. మనవాళ్లే అలాంటి సినిమాలు తీయడం ఆపేశారంటే. క్రైమ్ సినిమాలు చూడగానే అందరూ నేరస్తులు అయిపోతారని ఎవరూ అనట్లేదు.

కానీ సినిమా అనేది ఒక హీరోని చూసి నేర్చుకునే వేదిక. థియేటర్లలో బోర్డులు పెట్టి ‘A’ సర్టిఫికెట్ సినిమాలకు పిల్లలను రాకుండా ఆపొచ్చు. కానీ కొన్ని రోజులకే అవే సినిమాలు ఓటీటీల ద్వారా పిల్లల చేతుల్లో ఉంటే స్మార్ట్ ఫోన్లలో నేరుగా వస్తున్నాయి. అక్కడ ఎలాంటి ఆంక్షలు ఉండవు. నరకడమే గొప్ప హింసే పౌరుషం అనుకునే ఈ ధోరణి పిల్లల మనసులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇండస్ట్రీ ఇప్పుడైనా ఆలోచించాలి.

The post టాలీవుడ్‌లో నరకడమే ట్రెండా? iDreamPostలో మొదట కనిపించారు.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird