ఆంధ్రా వేవ్స్ – అనకాపల్లి:
అనకాపల్లి జోన్ పరిధిలోని ఆరు వార్డుల కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తే అనకాపల్లి నగరంలో అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేసేందుకు అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
107వ వార్డు నుంచి టీడీపీ అభ్యర్థిగా మాడంశెట్టి చిన్నతల్లి, 108వ వార్డు నుంచి కొణతాల సింధుజ, 109వ వార్డు నుంచి జనసేన అభ్యర్థిగా బుద్ధ జ్యోతి, 110వ వార్డు నుంచి తాడి శాంతికుమారి, 111వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా పలక యశోద, 112వ వార్డు నుంచి జనసేన అభ్యర్థిగా ఆళ్ల వైష్ణవి పోటీ చేస్తున్నట్లు తెలిపారు. జీవీఎంసీ మేయర్ అభ్యర్థి ముక్క శ్రావణికి కూడా మద్దతు పలకాలని కోరారు.
పట్టణ ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఆధ్వర్యంలో రూ.49 కోట్లతో రిజర్వాయర్ పనులు జరుగుతున్నాయని నాగ జగదీష్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో భవనాల నిర్మాణాలు, మరమ్మతులు, విద్యార్థులకు అవసరమైన సదుపాయాల కల్పనతో పాటు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
ఎన్టీఆర్ ఏరియా ఆసుపత్రిలో వైద్య సేవలను మెరుగుపరిచేందుకు వైద్యుల నియామకంతో పాటు సీటీ స్కాన్, డయాలసిస్ కేంద్రం, క్రిటికల్ కేర్ వైద్య సదుపాయాలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించారు. ఎంపీ సీఎం రమేష్ కృషితో లక్ష్మీదేవిపేట ఫ్లైఓవర్ నిర్మాణానికి రూ.90 కోట్ల నిధులు సమకూరాయని, టెండర్ ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. రైతుల రాకపోకలకు ఉపయోగపడే వంతెన నిర్మాణం కూడా పూర్తయిందని పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలతో పాటు పరిశ్రమల స్థాపన ద్వారా జిల్లాలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని నాగ జగదీష్ ఆశాభావం వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లాలో భారీ పెట్టుబడులతో పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని, తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.
నగరంలో తాగునీరు, విద్య, వైద్యం, రవాణా వంటి రంగాల్లో మరింత అభివృద్ధి సాధించేందుకు కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు.
ఈ సమావేశంలో బోడి వెంకటరావు, కుప్పిలి జగన్, దూలం ప్రసాద్, శ్రీకాకుళం గణపతి, రేబాక లోవరాజు తదితరులు పాల్గొన్నారు.







