రైలు ప్రయాణం చేయాలనుకునేవారికి దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. పండుగల సమయంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రెండు వన్-వే ప్రత్యేక రైళ్లను ప్రకటించడంతో పాటు, ఇప్పటికే నడుస్తున్న మరో ప్రత్యేక రైలు సర్వీసులను పొడిగించింది. చర్లపల్లి నుంచి ప్రయాగ్‌రాజ్‌కు, హైదరాబాద్ నుంచి పార్వతీపురానికి ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. జాల్నా–ఛప్రా మధ్య నడిచే రైళ్లకు కూడా అదనపు ట్రిప్పులు కేటాయించారు. ఈ రైళ్ల తేదీలు, సమయాలు, స్టేజీల వివరాలను చూడండి.
చర్లపల్లి నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే ప్రయాణికుల కోసం రైల్వే శాఖ వన్-వే ప్రత్యేక రైలును ప్రకటించింది. రైలు నంబర్ 07077 అక్టోబర్ 25, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు చర్లపల్లి స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. మరుసటి రోజు సోమవారం ఉదయం 10:35 గంటలకు ప్రయాగ్‌రాజ్ చేరుకుంటుంది.మార్గమధ్యంలో ఈ ప్రత్యేక రైలు కాజీపేట, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్లార్షా, చంద్రపూర్, నాగ్‌పూర్, ఇటార్, జబల్పూర్, కట్నీ, సత్నా, మాణిక్పూర్ స్టేషన్లలో ఆగుతుంది.
ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురం వైపు వెళ్లే ప్రయాణికుల కోసం కూడా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైలును ప్రకటించింది. రైలు నంబర్ 07078 అక్టోబర్ 27, 2026 మంగళవారం మధ్యాహ్నం 3:30 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరుతుంది. మరుసటి రోజు బుధవారం ఉదయం 7 గంటలకు పార్వతీపురం చేరుకుంటుంది.ఈ ప్రత్యేక రైలు చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, విజయనగరం స్టేషన్లలో ఆగుతుంది.
రైలు నంబర్ 07651 (జాల్నా–ఛప్రా) బుధవారాల్లో నడిచే ఈ రైలుకు నవంబర్ 11, 18, 25 తేదీల్లో మరో మూడు ట్రిప్పులను కేటాయించారు. రైలు నంబర్ 07652 (ఛప్రా–జాల్నా) శుక్రవారాల్లో నడిచే ఈ రైలుకు నవంబర్ 13, 20, 27 తేదీల్లో మరో మూడు ట్రిప్పులను పొడిగించారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
