Home సినిమా Arulvaan Rivew: గుండె తడిని తట్టి లేపి.. కన్నీటి చెమ్మను రగిలించే – Andhra Waves

Arulvaan Rivew: గుండె తడిని తట్టి లేపి.. కన్నీటి చెమ్మను రగిలించే – Andhra Waves

by andhra andhrawave
0 comments
Oktelugu Epaper


అరుల్వాన్ రివ్యూ: మనం ఒక సినిమా చూస్తాం.. థియేటర్ నుంచి బయటికి వస్తాం. ఆ తర్వాత ఆ సినిమా గురించి మర్చిపోతాం. కానీ కొన్ని సినిమాలు మనతోపాటు బయటికి వచ్చేస్తుంటాయి. మనల్ని అనేక సందర్భాల్లో వెంటాడుతుంటాయి. మన గుండె చప్పుడును మరింత బలోపేతం చేస్తుంది. కన్నీటి చెమ్మను రగిలిస్తుంటాయి. మన ఆలోచనలలో అనునిత్యం తిరుగుతూనే ఉంటాయి. అటువంటి సినిమానే అరుల్వాన్. పేరుకు ఇది తమిళ సినిమా అయినప్పటికీ.. ఆ చిత్రంలో సన్నివేశాలు.. దృశ్యాలు.. మాటలు.. ఇలా ప్రతి ఒక్కటి మనతోపాటు వస్తుంది. మన జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఉంటుంది. మనం మనుషులం అంటే కళ్ళముందు కనిపించేలా చేస్తుంది.

ఈ చిత్రానికి గణేష్ వినాయక దర్శకుడు. చదువు అనే లక్ష్యంతో ఈ సినిమాని రూపొందించారు. ఒక మారుమూల కొండ ప్రాంతంలోని గిరిజన గ్రామానికి చెందిన చిన్నారి కురింజి చదువుకోవాలని అనుకుంటుంది. కానీ ఆమెకు స్కూలుకు వెళ్లే అవకాశం ఉండదు. అక్కడ కనీసం సౌకర్యాలు కూడా ఉండవు. బయటి ప్రపంచంతో సంబంధాలు లేవు. ఈ నేపథ్యంలో తనకు మాత్రమే కాదు.. గ్రామంలో ఉన్న ప్రతి చిన్నారికి చదువు అందాలని ఆమె చేసే ప్రయాణమే ఈ సినిమా కథ

ఈ సినిమా ప్రారంభంలో కురింజి ప్రపంచాన్ని మనకు పరిచయం చేస్తారు. కొండలు, గిరిజనుల జీవన విధానం, వారి ఆచారాలు.. అమాయకత్వం చూస్తుంటే మనకు మరొక లోకంలోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. కాంక్రీట్ జంగిల్ లో మనం ఏం మిస్ అవుతున్నామో అర్థమవుతుంది. కదా అనుకున్నంత వేగంగా సాగదు. అలాగని మనల్ని బోర్ కొట్టనివ్వదు. ఒకరకంగా చెప్పాలంటే సినిమా ప్రపంచంలోకి మనం నెమ్మదిగా వెళ్లిపోతాం. అయితే ఇక్కడే సినిమాకు బలం ఉంది. బలహీనత కూడా ఉంది. దర్శకుడు చెప్పాలి అనుకున్న విషయం బలంగానే ఉండవచ్చు. కానీ ఆ ప్రేక్షకులకు చేరవేసే విధంగా తడబడ్డాడు. కొన్ని సన్నివేశాల నుంచి భావోద్వేగాన్ని రాబట్టడానికి లాగ్ ఉన్నట్లు అనిపిస్తుంది.

ఇక ఈ సినిమాకు అసలు బలం బేబీ కృతిక. కురింజి అనే పాత్రలో ఆమె జీవించింది. ఆమె సహజమైన నటనకు భావోద్వేగమైన బలాన్ని ఇస్తుంది. ఆమె కళ్ళల్లో కనిపించే అమాయకత్వం.. చదువుకోవాలి అంటే పట్టుదల.. తన గ్రామంలోని పిల్లల కోసం ఆమె తీసుకునే నిర్ణయాలు.. ఇవన్నీ కూడా కథను ప్రేక్షకుడికి అత్యంత దగ్గర చేస్తాయి. ఇక ఇప్పటివరకు ఎక్కువగా త్రిల్లర్.. డార్క్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించిన అరుల్ నిధి ఈ సినిమాలో కలెక్టర్ ముత్తు వేల్ పాత్రలో కనిపిస్తారు. ఈయన పాత్ర సినిమాలోకి వచ్చిన తర్వాత కథ వేరే విధంగా మారిపోతుంది. ఆయన కురింజి కలను అర్థం చేసుకున్న తర్వాత. ఆమెకు అండగా నిలిచే అధికారి పాత్రలో అరుల్ నిధి కనిపిస్తారు. ఈయన ప్రశాంతమైన నటనతో ఆకట్టుకున్నారు. అయితే హీరో పాత్రకు సంబంధించిన స్క్రీన్ టైం తక్కువగా ఉండటంతో అరుల్ నిధి అభిమానులు కాస్త నిరాశకు గురయ్యే అవకాశం ఉండొచ్చు.

ఈ సినిమాకు మరో ప్రధాన బలం సినిమాటోగ్రఫీ. ప్రకృతి అందాలను అద్భుతంగా బంధించి ఈ సినిమాకు తిరుగులేని స్థాయిని అందించారు. నిజానికి అందమైన దృశ్యాలను బ్యాక్ డ్రాప్ లాగా వాడుకుంటారు. కానీ ఈ సినిమాలో ప్రకృతి ఒక పాత్రలాగా ఉంటుంది. విజువల్ ట్రీట్ అభిమానులకు కన్నుల పండుగలాగా ఉంటుంది.

జీవి ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం.. నేపథ్య సంగీతం కథలోని భావోద్వేగాలను మరింత బలోపేతం చేసే ప్రయత్నం చేస్తుంది. అయితే కొన్ని సన్నివేశాలకు మాత్రం నేపద్య సంగీతం మరీ సూటిగా ఉన్నట్టు కనిపిస్తుంది.

ఈ సినిమాకు ప్రధాన లోపం ఒకటి. చెప్పాలి అనుకున్నది సందేశం మంచిదే. కాకపోతే దానిని ప్రేక్షకుడిపై బలంగా మోపుతున్నట్టు కనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు నాచురల్ గా కాకుండా, కేవలం సందేశాలను చెప్పడానికి మాత్రమే రూపొందించినట్లుగా కనిపిస్తుంది. అందుకే ఈ సినిమా గొప్పగా ఉందని పూర్తిగా చెప్పలేని పరిస్థితి. మేకింగ్.. కథనం విషయంలో కూడా ప్రేక్షకుడు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందలేదు.. ఈ సినిమా పర్ఫెక్ట్ సినిమా కాకపోవచ్చు. కానీ చెప్పాలి అనుకున్న విషయం మాత్రం చాలా అవసరం. నేటి కాలంలో విద్య అనేది ఒక లగ్జరీ కాదు. అవకాశం కాదు. ప్రతి బిడ్డ హక్కు.. అనే ఆలోచనను ఈ సినిమా ముందుకు తీసుకొస్తుంది. చిన్నారి కృతిక నటన.. అరుల్ నిధి పాత్ర.. కొండప్రాంతాల విజువల్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. ఒకవేళ కథనం గనుక బిగుతుగా ఉంటే.. భావోద్వేగాలను సహజంగా పలికించి ఉంటే కచ్చితంగా ఈ సినిమా చాలా పెద్దగా ఉండేది.

సూటిగా ఒక ముక్కలో చెప్పాలంటే కథలో నిజాయితీ ఉంది. చూపించే విధానంలో మాత్రం లోపాలు కనిపించాయి. సినిమా పూర్తి అయిన తర్వాత ప్రతి చిన్నారికి చదువు దక్కాలి అని ఆలోచనతో మనం బయటికి వస్తాం. ఈ విషయంలో దర్శకుడికి నూటికి నూరు మార్కులు వేయవచ్చు.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird