అంతర్జాతీయ క్రికెట్లోకి రీ ఎంట్రీ ఇవ్వడంతో ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్. వెస్టిండీస్‌తో జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో భువీకి ప్లేయింగ్ 11లో చోటు దక్కింది. అయితే ఈ మ్యాచ్‌లో భువీ బౌలింగ్ చేయకపోయినా ఈ వెటరన్ పేసర్ జెర్సీ చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడూ 15వ నంబర్ జెర్సీతో కనిపించే భువీ.. ఈసారి 78వ నంబర్ జెర్సీ ధరించి దర్శనమిచ్చాడు. దీంతో అతడు తన జెర్సీ నంబర్‌ను ఎందుకు మార్చుకున్నాడనే చర్చ మొదలైంది. దీని వెనుక అసలు కథ ఏంటో ఇప్పుడు చూద్దాం.
భారత జట్టు జట్టు ఆడినప్పుడు భువనేశ్వర్ కుమార్ 15వ నంబర్ జెర్సీని ధరించేవాడు. ఆ నంబర్‌తోనే భువీ ఫ్యాన్స్‌కు సుపరిచితమయ్యాడు. అయితే, ప్రస్తుతం ఆ జెర్సీ నంబర్ యువ పేసర్ గుర్నూర్ బ్రార్‌కు కేటాయించడంతో భువీ మరో నంబర్‌ను ఎంచుకోవాల్సి వచ్చింది. దీంతో వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో ఈ అత్యుత్తమ పేసర్ 78వ నంబర్ జెర్సీతో మైదానంలోకి దిగాడు. భారత జట్టులోకి తిరిగి వచ్చిన సమయంలో భువీ జెర్సీ నంబర్ మారడం అభిమానులకు కొత్తగా అనిపించింది. తనకు అలవాటైన నంబర్ అందుబాటులో లేకపోవడంతోనే ఈ మార్పు చోటుచేసుకున్నట్టు కనిపిస్తోంది.
భువనేశ్వర్ కొత్త జెర్సీ నంబర్లో మరో ఆసక్తికరమైన విషయం ఉంది. 78లోని రెండు అంకెలను కలిపితే 15 వస్తుంది. అంటే 7+8 = 15. తనకు ఎంతోకాలంగా గుర్తింపుగా నిలిచిన 15వ నంబర్‌తో ఇలా పరోక్షంగా సంబంధం ఉండటం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇది యాదృచ్ఛికమే అయినప్పటికీ, భువీ పాత జెర్సీ నంబర్‌ను గుర్తుచేసే అంశంగా మారింది. ఇక భువనేశ్వర్ చివరిసారిగా 2022 నవంబర్‌లో న్యూజిలాండ్‌తో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు ఆడాడు. ఆ తర్వాత దాదాపు నాలుగేళ్ల విరామంతో అంతర్జాతీయ క్రికెట్లోకి తిరిగి రావడం విశేషం. జెర్సీ నంబర్ మారినా, భువనేశ్వర్‌పై అభిమానుల అంచనాలు మాత్రం తగ్గలేదు.

