అమెరికాలో భారతీయ సంతతి వ్యక్తులు ఎదుగుదల దశాబ్దాలుగా ఒక విజయగాథగా వినుతికెక్కింది. అయితే.. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వలసల ప్రభావం కేవలం ఆర్థిక విజయాలకు పరిమితం కాకుండా.. అక్కడి రాజకీయ, సామాజిక, ఉపాధి రంగాల్లో తీవ్రమైన చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా టెక్సాస్ రాష్ట్రంలోని ఫ్రిస్కో వంటి నగరాల్లో మారుతున్న జనాభా తీరు తెన్నులు, స్థానిక అమెరికన్లలో కొత్త తరహా ఆందోళనలను రేకెత్తిస్తోంది. భారతీయ వలసదారులు అమెరికా అభివృద్ధిలో భాగస్వాములవుతున్నారా? లేదా స్థానికుల అవకాశాలను దెబ్బతీస్తున్నారా అనే అంశం ఇప్పుడు అమెరికన్ టౌన్‌హాల్ సమావేశాల్లో ప్రధాన అజెండాగా మారిపోయింది. ఒకప్పుడు సాధారణ వ్యవసాయ పట్టణంగా ఉన్న ఫ్రిస్కో నగరం, నేడు ఐటీ రంగ విస్తరణతో లిటిల్ ముంబైగా మారిపోయింది. గత రెండు దశాబ్దాలలో ఇక్కడ భారతీయ జనాభా పెరిగింది. మంచి పాఠశాలలు, అత్యాధునిక హౌసింగ్ ప్రాజెక్టులు, డల్లాస్-ఫోర్ట్ వర్త్ మెట్రో దగ్గరగా ఉండటం వల్ల తెలుగు రాష్ట్రాలతో పాటు భారత్ లోని వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చే వారికి ఇది ప్రధాన కేంద్రంగా మారింది. అయితే, ఈ వేగవంతమైన మార్పుపై స్థానికుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జనాభాలో భారతీయుల వాటా ఒక్కసారిగా పెరగడాన్ని కొందరు ఇండియన్ ఇన్వేషన్ అంటే భారతీయుల దండయాత్రగా అభివర్ణిస్తున్నారు. హెచ్-1బి వీసా వ్యవస్థపై వెల్లువెత్తుతున్న ఆరోపణలు ఈ వివాదానికి కేంద్రబిందువుగా ఉన్నాయి. అమెరికాలో స్థిరపడాలనుకునే భారతీయులు ఎఫ్-1 స్టూడెంట్ వీసా ద్వారా ప్రవేశించారు, ఆపై ఓపిటి, చివరికి హెచ్-1బి వీసా పొందే మార్గాన్ని గుర్తించారు.
అయితే, ఈ కొన్ని అక్రమాలు జరుగుతున్నాయని మాజీ కాన్సులర్ అధికారులు అంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, చెన్నై వంటి నగరాల్లో నకిలీ బ్యాంక్ స్టేట్మెంట్లు, తప్పుడు అకడమిక్ రికార్డులను సృష్టించే వీసా పరిశ్రమలు వెలిశాయని, దీనివల్ల అర్హత లేని వారు కూడా అమెరికాలో ప్రవేశిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని ప్రాంతాలలో వీసా రిజెక్షన్ రేటు 80 శాతం వరకు ఉండటం వలన ఈ వ్యవస్థాగత లోపాలకు నిదర్శనంగా మారింది. ఐటీ స్టాఫింగ్ కంపెనీల పనితీరు కూడా అమెరికన్ ప్రజల్లో అనుమానాలను రేకెత్తిస్తోంది. డల్లాస్ ప్రాంతంలో అనేక చిన్న కార్యాలయాలు పగటిపూట ఖాళీగా కనిపిస్తున్నప్పటికీ, వందలాది లేబర్ కండిషన్ అప్లికేషన్లు (ఎల్ సీఏ) ఆ అడ్రస్‌లపై నమోదవుతున్నాయి. వీటిని బాడీ షాప్స్ గా నిర్వహిస్తున్నారు, తక్కువ వేతనాలకే విదేశీ కార్మికులను సరఫరా చేస్తూ స్థానిక గ్రాడ్యుయేట్ల ఉపాధిని దెబ్బతీస్తున్నారనే వాదన గట్టిగా వినిపిస్తోంది. డిస్నీ, టి-మొబైల్ వంటి దిగ్గజ కంపెనీలు కూడా అమెరికన్ ఉద్యోగుల స్థానంలో హెచ్-1బి వర్కర్లను నియమించుకోవడం స్థానిక నిపుణుల్లో తీవ్ర అసంతృప్తికి కారణమౌతోంది. వానే తమ ఉద్యోగాలను H1B వీసా హోల్డర్లు లాగేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఇండియాలో హెచ్1బీ వీసాహోల్డర్లకు సెకండ్ హోం ఉంది. మాకు లేదు.. అన్న ఉద్వేగపూరిత వాదన కూడా గట్టిగా వినిపిస్తోంది. మొత్తానికి అమెరికన్లలో ఉద్యోగ భద్రత, సాంస్కృతిక పరిచయం కోల్పోతున్నామనే భయం మొదలైంది.
మరోవైపు, వలసదారుల కష్టాలు కూడా తక్కువేమీ కావు. అమెరికా వెళ్లేందుకు భారతీయ కుటుంబాలు ఆస్తులు అమ్మడం, భారీగా అప్పులు చేయడం కొనసాగుతోంది. అక్కడికి వెళ్ళిన కొత్తలో ఒకే గదిలో పదిమంది నివసిస్తూ, ఉద్యోగం పోతే 60 రోజుల్లో దేశం విడిచి వెళ్లాలంటే భయంతో తక్కువ వేతనాలకు, ఎక్కువ గంటలు పనిచేయాల్సి వస్తోంది. వీసా హోదా కోసం నకిలీ వివాహాలు చేసుకుని మోసపోతున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. కంపెనీల దోపిడీకి, అక్రమ చిక్కులకు మధ్య నలిగిపోతున్న పరిస్థితి. స్థానిక ప్రభుత్వాల స్థాయిలో భారతీయుల వాదన మరోలా ఉంది. తాము క్రమశిక్షణతో కూడిన పౌరులమని, అత్యధిక పన్నులు చెల్లిస్తున్నామని, ఐటీ, వైద్య రంగాల్లో కీలక సేవలు అందిస్తున్నామని భారతీయ సంఘాలు వాదిస్తున్నాయి. ఆలయాలు, స్వచ్ఛంద సేవా కార్యక్రమాల ద్వారా అమెరికన్ సామాజిక జీవనంలో తాము మమేకమయ్యామని వారు స్పష్టం చేస్తున్నారు.
అయితే, ఈ సానుకూలతలను మించి రిప్లేస్మెంట్ అంటే.. స్థానికుల స్థానంలో విదేశీయులు అనే భావన అమెరికన్ మధ్యతరగతిలో బలంగా నాటుకుపోతోంది. భవిష్యత్తులో ఈ పరిస్థితి అమెరికా వీసా విధానాలపై మరింత తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. హెచ్-1బి వీసా నిబంధనలను కఠినతరం చేయాలనీ.. స్థానిక కార్మికులకు ప్రాధాన్యత ఇచ్చేలా చట్టాల్లో మార్పులు తేవాలని ఒత్తిడి పెరుగుతోంది. రాజకీయంగా ఈ అంశం అత్యంత సున్నితమైనది.. అమెరికా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. కేవలం నైపుణ్యం ఉన్న వారికే ప్రాధాన్యత ఇచ్చేలా O-1 వంటి వీసా కేటగిరీలను ప్రోత్సహించే సూచనలు కూడా వస్తున్నాయి. మొత్తం మీద అమెరికాలో భారతీయుల ప్రస్థానం ఒక మలుపులో ఉంది. ఒకవైపు ఆర్థిక పురోగతి, మరోవైపు వ్యవస్థాగత లోపాలు, స్థానికుల ఆందోళనల మధ్య నలిగిపోతున్నది ఇండియన్ డయాస్పోరా. అమెరికన్ పాలసీ మేకర్లు, భారత ప్రభుత్వం కలిసి ఈ సమస్యలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలు పటిష్టంగా ఉండటమే కాకుండా, నిజమైన ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది.
-సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చింది, దయచేసి www.teluguone.com ను ఫాలో అవ్వండి. భాగస్వామ్యం చేయండి. మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి.
.webp)