అధికార కాంగ్రెస్ ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ ప్రయాణిస్తున్న కారు తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం తిరుపతి నుంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా, రంగారెడ్డి జిల్లా కొత్తూరు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సిటీ పోలీస్ కమిషనరేట్ స్థాయిని కొత్తూరు బైపాస్ వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు, కోళ్ల లోడ్‌తో ముందు వెళ్తున్న డీసీఎం వాహనాన్ని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది.
వెంకట్ దంపతులకు స్వల్ప గాయాలు
ప్రమాద సమయంలో కారులో బల్మూరి వెంకట్‌తో పాటు ఆయన భార్య ఇందుజా, సోదరుడు చాణక్య, డ్రైవర్ శ్రీకాంత్ ప్రయాణిస్తున్నారు. వాహనం ముందు భాగం ధ్వంసమైనప్పటికీ, నలుగురూ స్వల్ప గాయాలతో బయటపడటంతో పెద్ద ముప్పు తప్పినట్లయింది. వెంకట్ కారు ప్రమాదానికి గురైందన్న వార్త తెలియగానే ఆయన అనుచరులు, కాంగ్రెస్ శ్రేణుల్లో ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేశారు. అయితే అందరూ క్షేమంగా ఉన్నారని తెలియడంతో పార్టీ నేతలు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు.
కోళ్ల లోడ్‌తో వెళ్తున్న లారీని ఒక్కసారిగా ఎమ్మెల్సీ కారు నుంచి ఢీకొట్టినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. అయితే ఈ కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణమా, అతివేగమా లేక మరేదైనా సాంకేతిక కారణం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇటీవల తీన్మార్ మల్లన్న కారుకు ప్రమాదం
ఇదిలా ఉండగా, ఈ నెల 13న తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న కారు కూడా యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం అనాజిపురం వద్ద ప్రమాదానికి గురైంది. గౌరెల్లి–కొత్తగూడెం జాతీయ రహదారిపై మల్లన్న పాదయాత్ర కొనసాగుతుండగా, చౌటుప్పల్ నుంచి భద్రాచలం వెళ్తున్న ఇసుక లారీ డ్రైవర్ ఫోన్‌లో రోడ్డు పక్కన ఆగి ఉన్న మల్లన్న కారును డీకొట్టాడు.
ఆ కారు ముందుకు దూసుకెళ్లి హైదరాబాద్ వెళ్తున్న మరో కారును ఢీకొట్టింది. ఈకారులో సూర్యాపేట జిల్లా తిరుమలగిరికి చెందిన మేడబోయిన చందన, ఆమె భర్త సాయినాథ్ ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ చందన నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమె భర్త సాయినాథ్ విషమంగా ఉండగా, డ్రైవర్ సురేష్ తీవ్రంగా గాయపడ్డారు. ఇది తనపై జరిగిన హత్యాప్రయత్నమేనని అనుమానం వ్యక్తం చేస్తూ తీన్మార్ మల్లన్న డీజీపీ సీవీ ఆనంద్‌కు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
