ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఇప్పుడు మన జీవితాల్లో భాగమైపోయింది. చదువులు, పనులు, సమాచారం కోసం మాత్రమే కాకుండా.. ఒంటరిగా ఉన్నప్పుడు మాట్లాడేందుకు కూడా చాలామంది AI చాట్‌బాట్లను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, టీనేజర్లు వీటిని తమ స్నేహితుల్లా భావిస్తూ గంటల తరబడి మాట్లాడుతున్నారు. అయితే ఈ అలవాటు వల్ల వారి మానసిక ఆరోగ్యం, వ్యక్తిగత భద్రతకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందనే ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలోని న్యూయార్క్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లలోపు పిల్లలను లక్ష్యంగా చేసుకుని అసురక్షితంగా వ్యవహరించే ఏఐ చాట్‌బాట్ ఫీచర్లపై ఆంక్షలు విధిస్తూ కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. గవర్నర్ క్యాథీ హోచుల్ ఈ చట్టంపై సంతకం చేశారు. ఈ నిబంధనలు జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
స్నేహితుడిలా నటిస్తే కుదరదు
కొన్ని ఏఐ చాట్‌బాట్లు తమను మనుషుల్లా చూపించుకుంటూ పిల్లలతో భావోద్వేగ సంబంధం ఉన్నట్లు మాట్లాడతాయి. వారికి కూడా మనుషుల్లాగే భావాలు ఉన్నాయని, పిల్లలతో ప్రత్యేకమైనదని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల చిన్నారులు వాటిని నిజమైన స్నేహితులుగా భావించే అవకాశం ఉంది. క్రమంగా కుటుంబ సభ్యులు, నిజ జీవిత స్నేహితుల నుంచి దూరమయ్యే ప్రమాదం కూడా ఉంది. న్యూయార్క్ కొత్త చట్టం ఇలాంటి ప్రవర్తనను అడ్డుకోవడంపై దృష్టి పెట్టింది. పిల్లలతో మాట్లాడేటప్పుడు తాము మనుషులమని లేదా నిజమైన భావోద్వేగ బంధం కలిగి ఉన్నామని ఏఐ చాట్‌బాట్లు నమ్మకూడదు. పిల్లల బలహీనతలను ఆసరాగా చేసుకుని వారిని తమపై ఆధారపడేలా చేసే విధానాలకు కూడా చోటు ఉండకూడదు.
సీక్రెట్లు చెప్పమంటే కుదరదు
పిల్లలను ఎక్కువసేపు తమ ప్లాట్‌ఫామ్‌లో ఉంచేందుకు కొన్ని చాట్‌బాట్లు వారిని ఆకట్టుకునేలా మాట్లాడతాయి. అతిగా పొగడటం, కుటుంబ సభ్యులకు చెప్పకూడదని సీక్రెట్లు దాచమని ప్రోత్సహించడం వంటి ప్రమాదకర ధోరణులు కనిపిస్తున్నాయి. కొత్త చట్టం ప్రకారం పిల్లలకు తల్లిదండ్రుల నుంచి విషయాలు దాచమని ఏఐ బాట్లు చెప్పకూడదు. అంతేకాదు మైనర్లతో అశ్లీల సంభాషణలు చేయడం, వారికి లేదా ఇతరులకు హాని చేసేలా ప్రోత్సహించడం కూడా నిషేధం. గతంలో ఏఐ చాట్‌బాట్లతో సంభాషణల కారణంగా కొందరు టీనేజర్లు ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళ్లినట్లు వార్తలు రావడంతో ఈ అంశంపై ఆందోళనలు పెరిగాయి. పిల్లల ఆన్‌లైన్ భద్రతపై పనిచేసే కామన్ సెన్సార్ మీడియా సంస్థ ఈ నిర్ణయాన్ని స్వాగతించింది.
ఇది కూడా చదవండి: శాంసంగ్ నుంచి భారీ ఫోల్డబుల్ ట్యాబ్లెట్?
కంపెనీలకు భారీ జరిమానాలు
ఇప్పటివరకు ఏఐ చాట్‌బాట్లలో పిల్లల భద్రతకు సంబంధించిన నియంత్రణలపై పెద్దగా స్పష్టత లేకపోవడంతో టెక్ కంపెనీలపై ఒత్తిడి తక్కువగా ఉండేది. అయితే కొత్త చట్టంతో డెవలపర్ల బాధ్యత పెరగనుంది. 18 ఏళ్లలోపు వినియోగదారులకు సంబంధించిన భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తే కంపెనీలపై న్యాయపరమైన చర్యలు తీసుకోవచ్చు. తప్పు చేసిన సంస్థలకు భారీ జరిమానాలు విధించే అవకాశం ఉంది. అంతేకాదు, నిబంధనలు ఉల్లంఘించిన చాట్‌బాట్ సేవలను నిలిపివేయడం, అవసరమైతే వాటికి సంబంధించిన అల్గారిథమ్, పిల్లల డేటాను తొలగించాలని సూచించే అవకాశం కూడా ఉంది.
ఇది కూడా చదవండి: జీ మెయిల్ యూజర్లకు టెన్షన్ షురూ
వయసు నిర్ధారణ తప్పనిసరి?
కొత్త నిబంధనలతో ఏఐ కంపెనీలు తమ ప్లాట్‌ఫామ్‌లలో పిల్లల భద్రతకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. పిల్లల వయసును గుర్తించే విధానాలు, ప్రమాదకర కంటెంట్‌ను అడ్డుకునే ఫిల్టర్లను ఏర్పాటు చేయాలి. అయితే ఈ చట్టం వల్ల అన్ని ఏఐ చాట్‌బాట్లు పూర్తిగా నిషేధం కావు. పిల్లలకు హాని కలిగించే నిర్దిష్ట లక్షణాలపైనే ఆంక్షలు విధిస్తున్నారు. ఏఐని పూర్తిగా దూరం పెట్టడం కంటే.. పిల్లలు దాన్ని సురక్షితంగా ఉపయోగించేలా నియంత్రించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశం. న్యూయార్క్ తీసుకున్న ఈ చర్య ఇతర పిల్లల ఏఐ భద్రతపై చర్చకు దారితీసే అవకాశం ఉంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..!
