Table of Contents
స్టార్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఈ మధ్య ఎక్కువగా కణత భాగంలో ఓ చిన్న పరికరం అతికించుకుని కనిపిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జనం ఆ పరికరం గురించి ఇంటర్నెట్లో సెర్చ్ చేయటం మొదలెట్టారు. గిల్, సింధు వాడుతున్న ఈ పరికరం పేరు టెంపుల్ డివైజ్. మెదడు రక్తప్రసరణను, మానసిక ఒత్తిడిని ట్రాక్ చేయడం కోసం దాన్ని ఉపయోగించారు.
కంపెనీ చెబుతున్న దాని ప్రకారం.. స్మార్ట్‌వాచ్‌లు లేదా ఫిట్నెస్ బ్యాండ్లు మణికట్టుపై ఉండి కేవలం హార్ట్ బీట్ రేటు, నడిచిన అడుగులు, నిద్ర వంటి శారీరక అంశాలు మాత్రమే కొలుస్తాయి. కానీ, ఈ టెంపుల్ డివైజ్ నేరుగా తలపై, నుదుటి పక్కభాగంలో ఉండటం వల్ల మెదడుకు సంబంధించిన మరింత లోతుగా ఉంటుంది. ఇందులో ఉండే ప్రత్యేక ఆప్టికల్ సెన్సార్లు రియల్ టైమ్‌లో మెదడు లోపల రక్తప్రసరణ, ఆక్సిజన్ స్థాయిలలో వచ్చే మార్పులను పర్యవేక్షిస్తాయి. శారీరక లేదా మానసిక ఒత్తిడిని, ఆందోళనను తట్టుకోవడానికి మన శరీరం, మెదడు ఎంత కష్టపడుతున్నాయనే తీవ్రతను ఇది 1 నుంచి 250 స్కెల్‌లో లెక్కిస్తుంది. దీని ద్వారా మన మానసిక అలసటను తెలుసుకోవచ్చు.
ఈ డివైజ్ సేఫేనా?
టెంపుల్ డివైజ్‌ను నుదుటి పక్కభాగంలో చిన్న స్టిక్కర్ల సహాయంతో చర్మానికి పైభాగంలో మాత్రమే అంటిస్తారు. ఇది శరీరం లోపలికి ఎలాంటి సూదులు లేదా రేడియేషన్‌ను పంపదు. కాబట్టి, శారీరకంగా దీనివల్ల ఎటువంటి తక్షణ హాని ఉండదు. ఈ పరికరం మెదడు లోపల ఏం జరుగుతోందో నేరుగా ట్రాక్ చేయదు. ఇది కేవలం నుదుటి భాగంలో ఉంటే రక్తనాళాల ద్వారా రక్తప్రసరణలో వచ్చే మార్పులను మాత్రమే అంచనా వేస్తుంది.
ఇదొక వెల్నెస్ గ్యాడ్జెట్ మాత్రమే. కాబట్టి దీనిని వైద్య పరీక్షలకు ప్రత్యామ్నాయంగా అస్సలు భావించకూడదు. దీన్ని పెట్టుకోవటం వల్ల ఆరోగ్యానికి నష్టమేమీ లేదు. అయితే, ఇది మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా మారుస్తుందని.. రోగాలను గుర్తిస్తుందని ఆశించి కొంటే మాత్రం నష్టపోతారు. దీని ధర కూడా దాదాపు 85,000 రూపాయల వరకు ఉంటుంది.

