ఇటలీకి చెందిన ప్రముఖ బైక్ తయారీ సంస్థ డుకాటీ భారత మార్కెట్లో కొత్త లిమిటెడ్ ఎడిషన్ మోటార్ సైకిల్‌ను విడుదల చేసింది. డుకాటీ ఫార్ములా 73 పేరుతో వచ్చిన ఈ బైక్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.20 లక్షలు. ప్రపంచవ్యాప్తంగా కేవలం 873 యూనిట్లను మాత్రమే తయారు చేయడానికి కంపెనీ నిర్ణయించింది. భారత్‌కు కేటాయించిన తాజా బైకులన్నీ ఇప్పటికే బుక్ అయిపోయాయని నివేదికలు చెబుతున్నాయి. దీనితో ఈ మోడల్‌ను కొనాలనుకునే కొత్త కస్టమర్లకు ప్రస్తుతం బుకింగ్ అవకాశం లేదు.
1970ల నాటి బైక్ నుంచి స్ఫూర్తి
ఫార్ములా 73ను 1973లో వచ్చిన డుకాటీ 750 సూపర్ స్పోర్ట్ డెస్మో బైక్‌కు నివాళిగా రూపొందించారు. ఈ పాత మోడల్ డుకాటీ రేసింగ్ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించింది. కొత్త బైక్‌లో వెండి రంగుతో పాటు ఆక్వా గ్రీన్ షేడ్, ఇంధన ట్యాంక్‌పై బంగారు గీత ఆకట్టుకుంటాయి. క్లిప్-ఆన్ హ్యాండిల్‌బార్లు, బార్-ఎండ్ మిర్రర్లు, చిన్న ఫ్రంట్ ఫెయిరింగ్, గుండ్రటి ఎల్ఈడీ హెడ్‌లైట్ దీని రెట్రో లుక్‌ను మరింత ప్రత్యేకంగా చూపిస్తారు. బ్రేక్, క్లచ్ లీవర్లు వంటి కొన్ని భాగాలను బిల్లెట్ అల్యూమినియంతో తయారు చేశారు.
803 cc ఇంజిన్.. 73 hp పవర్
ఈ బైక్‌లో 803cc డెస్మోడ్యూ ఎల్-ట్విన్ ఇంజిన్ ఉంటుంది. ఇది 8,250 rpm వద్ద 73 hp పవర్, 7,000 rpm వద్ద 65.2 Nm టార్క్‌ను అందిస్తుంది. ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌కు ప్రత్యేకంగా రూపొందించిన టెర్మిగ్నోని ఎగ్జాస్ట్‌ను జత చేశారు. స్టీల్ ట్రెలిస్ ఫ్రేమ్‌పై నిర్మించిన ఈ మోటార్‌సైకిల్‌లో 41mm KYB అప్‌సైడ్-డౌన్ ఫ్రంట్ ఫోర్క్, వెనుక ప్రీలోడ్ సర్దుబాటు చేసుకునే మోనోషాక్ ఉన్నాయి. 17 ఇంచుల స్పోక్ వీల్స్‌కు పిరెల్లీ డయాబ్లో రోస్సో IV టైర్లను అమర్చారు. ఇంధనం మినహా బైక్ బరువు 183 కిలోలు.
ఆధునిక ఫీచర్లు కూడా
పాతకాలపు రూపంలో కనిపించినా ఫీచర్ల విషయంలో ఫార్ములా 73 ఆధునిక బైక్‌లకు తగ్గట్టుగా ఉంటుంది. ఇందులో కార్నరింగ్ ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్, రైడ్-బై-వైర్ థ్రాటిల్, డుకాటీ క్విక్ షిఫ్టర్ ఉన్నాయి. రైడర్ అవసరానికి అనుగుణంగా రోడ్, స్పోర్ట్ అనే రెండు రైడింగ్ మోడ్‌లను ఎంచుకోవచ్చు. 4.3 ఇంచుల కలర్ TFT డిస్ప్లే, ఫుల్ ఎల్ఈడీ లైటింగ్ కూడా అందించారు. ప్రతి బైక్‌కు ప్రత్యేక సీరియల్ నంబర్, అసలైన మోడల్ అని నిర్ధారించే సర్టిఫికెట్ ఇస్తారు.
కలెక్టర్ల కోసం ప్రత్యేక మోడల్
ఫార్ములా 73 సాధారణంగా ఎక్కువ సంఖ్యలో అమ్మే బైక్ కాదు. పరిమిత సంఖ్యలో తయారు చేయడం, డుకాటీ రేసింగ్ చరిత్రను గుర్తుచేసే డిజైన్, ప్రత్యేక రంగుల కలయిక దీన్ని కలెక్టర్లకు ఆకర్షణీయంగా మారుస్తాయి. భారత్‌లో ధర రూ.20 లక్షలు కావడంతో ఇది ప్రీమియం మోటార్‌సైకిల్ పరిధికి వస్తుంది. ఇప్పటికే దేశానికి కేటాయించిన మరిన్ని యూనిట్లు అమ్ముడవడంతో, బైకులను అందుబాటులోకి తీసుకొస్తారా అనే విషయంపై కంపెనీ నుంచి స్పష్టమైన ప్రకటన లేదు.
మరిన్ని వ్యాపార వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
The post ఈ బైక్ కొనాలంటే అదృష్టం ఉండాలి appeared first on iDreamPost.
