సోషల్ మీడియా అనేది ఈ రోజుల్లో సెలబ్రిటీలకు, ముఖ్యంగా కథానాయికలకు ఒక పెద్ద శాపంగా మారుతోంది. తారలు పంచుకునే అందమైన ఫోటోలు, వీడియోలపై కొందరు ఆకతాయిలు అత్యంత దారుణమైన కామెంట్లు చేస్తూ పచ్చి బూటుతో వేధిస్తున్నారు. చాలా మంది నటీమణులు ఇలాంటి వాటిని చూసిచూడనట్లు వదిలేస్తుంటారు. దీనివల్ల మరింత రెచ్చిపోతున్న ట్రోలర్స్, తాము ఏం మాట్లాడినా అడిగేవారు లేరనే ధీమాతో రెచ్చిపోతున్నారు.
అయితే అందరిలా తాను మౌనంగా ఉండే రకం కాదని నిరూపించింది కన్నడ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటి, సింగర్ చైత్ర జే ఆచార్. తనపై దారుణమైన వ్యాఖ్యలు చేసిన ఒక నెటిజన్‌కు ఆమె ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. (చైత్ర జె ఆచార్)
‘సప్త సాగరదాచే ఎల్లో’ వంటి సూపర్ హిట్ సినిమాలతో టాలెంటెడ్ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న చైత్ర ఆచార్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని తాజాగా ఆమె షేర్ చేసిన ఒక ఫోటో కింద, ఒక నెటిజన్ తన హద్దులు దాటి ప్రవర్తించాడు. పోలీస్ యూనిఫామ్ ధరించిన ప్రొఫైల్ పిక్చర్‌తో ఉన్న వ్యక్తి, కన్నడ భాషలో అత్యంత అసభ్యకర పదజాలం వాడుతూ, “నువ్వు అసలు హీరోయిన్‌వా లేక సెక్స్ వర్కర్‌వా? పద్ధతిగా ప్రవర్తించడం నేర్చుకో” అంటూ ఒక దారుణమైన కామెంట్ పెట్టాడు.
ఈ కామెంట్ చూసిన ఎవరికైనా ఒళ్ళు మండిపోవడం ఖాయం. చైత్ర కూడా దీనికి అస్సలు భయపడకుండా, సమాజంలో మహిళలపై జరుగుతున్న ఇలాంటి ఆన్‌లైన్ వేధింపులకు పెట్టాలని గట్టిగా నిర్ణయించుకుంది.వెంటనే ఆమె ఆ అసభ్యకరమైన కామెంట్‌ను స్క్రీన్‌షాట్ తీసి, ఆ వ్యక్తి ప్రొఫైల్ వివరాలతో సహా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అంతటితో ఆగకుండా, బెంగళూరు సిటీ పోలీస్ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్‌ను ట్యాగ్ చేస్తూ పబ్లిక్‌గా ఫిర్యాదు చేసింది.
“గౌరవనీయులైన బెంగళూరు సిటీ పోలీస్.. మీ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఒక వ్యక్తి మహిళల పట్ల ఇంత నీచంగా ప్రవర్తిస్తున్నాడు. ఇలాంటి ప్రవర్తన వారు సమాజానికి ఎలాంటి రక్షణ ఇస్తారు?” అంటూ తీవ్ర స్థాయిలో నిలదీసింది. ఒక నటిగా, ఒక మహిళగా తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించిన ఆకతాయిని నడిరోడ్డుపై నిలబెట్టినంత పని చేసింది. చైత్ర తీసుకున్న ఈ లీగల్ అండ్ పబ్లిక్ యాక్షన్‌తో సదరు నెటిజన్‌కు ఒక్కసారిగా చెమటలు పట్టాయి. బెంగళూరు పోలీసులు రంగంలోకి దిగే అవకాశం ఉందని గ్రహించి, అతనిలో వణుకు మొదలైంది. వెంటనే తన తప్పు తెలుసుకుని, చైత్రకు పర్సనల్ మెసేజ్‌లలో క్షమాపణలు చెప్పడం ప్రారంభించాడు.
“నన్ను క్షమించండి, నేను కేవలం ఒక అభిమానిగా, మీపై ఉన్న ఆందోళనతోనే ఆ కామెంట్ చేశాను. దయచేసి సోషల్ మీడియా పోస్టును డిలీట్ చేయండి. ఈ వివాదం పెద్దదైతే నా ఉద్యోగానికి, నా కెరీర్‌కు ముప్పు వస్తుంది” అంటూ బ్రతిమిలాడాడు. కానీ, చైత్ర అంతటితో శాంతించలేదు. తప్పు చేస్తున్నప్పుడు భయం, ఇప్పుడు ఉద్యోగం పోతుందనేసరికి వచ్చిందా అంటూ ఆమె మరింత ఆగ్రహం వ్యక్తం చేసింది. సదరు వ్యక్తి పంపిన క్షమాపణల మెసేజ్‌లను కూడా స్క్రీన్‌షాట్ తీసి మళ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టింది.
“నువ్వు ఆ నీచమైన కామెంట్ పెట్టేటప్పుడు ఒక మహిళగా నా గౌరవం ఏమౌతుంది, నా వృత్తి ఏమౌతుంది అని ఆలోచించలేదా? ఇప్పుడు నీ ఉద్యోగం కోసం భయపడుతున్నావా?” అంటూ ఘాటుగా ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై బెంగళూరు సీనియర్ పోలీస్ అధికారులు, ఇలాంటి అసభ్యకరమైన కామెంట్లు పెట్టడం చట్టరీత్యా నేరమని, అయితే ఆ అకౌంట్ వాడుతున్న వ్యక్తి పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు చెందినవాడు కాదని, కేవలం పోలీస్ డ్రెస్‌లో ఉన్న ఫోటోను వాడుకున్నాడని స్పష్టం చేశారు. ప్రస్తుతం చైత్ర చూపించిన ఈ ధైర్యానికి, ఆమె ఇచ్చిన గట్టి కౌంటర్‌కు నెటిజన్లు సెల్యూట్ కొడుతున్నారు. ట్రోలర్స్‌కు బుద్ధి రావాలంటే ఇలాంటి గట్టి నిర్ణయాలు అవసరమని మద్దతుగా నిలుస్తున్నారు.

