అండమాన్ నికోబార్ దీవుల సమూహంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రేట్ నికోబార్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా మేధోమథనానికి దారితీస్తోంది. ఇది కేవలం ఒక ద్వీపానికి సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పన మాత్రమే కాకుండా. పర్యావరణ పరిరక్షణ పేరుతో ప్రాజెక్టులను అడ్డుకోవాలా లేక దేశ వ్యూహాత్మక ప్రయోజనాల కోసం ముందడుగు వేయాలా అనే సందిగ్ధంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా అత్యున్నత న్యాయస్థానం ఈ విషయంలో పర్యావరణ కార్యకర్తల వైఖరిని ప్రశ్నించింది.
కేంద్ర ప్రభుత్వం దాదాపు 80 వేల కోట్ల రూపాయల భారీ వ్యయంతో ఈ ప్రాజెక్టును రూపొందించింది. ఇందులో భాగంగా అంతర్జాతీయ స్థాయి కంటెయిన్ ట్రాన్స్షిప్మెంట్ టెర్మినల్, ఒక గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు, భారీ పవర్ ప్లాంట్, అత్యాధునిక టౌన్‌షిప్‌ను నిర్మించనున్నారు. హిందూ మహాసముద్రంలో చైనా ప్రాబల్యాన్ని అడ్డుకోవడానికీ.. అలాగే అంతర్జాతీయ సముద్ర వాణిజ్యంలో భారత్ కీలక భాగస్వామిగా ఎదగడానికి ఈ ప్రాజెక్ట్ అత్యంత వ్యూహాత్మకమైనదని ప్రభుత్వం చెబుతోంది. అయితే.. ఈ అభివృద్ధి పనుల వల్ల 130 చదరపు కిలోమీటర్ల మేర భూమి దెబ్బ తింటుందనీ, ఇది అక్కడి జీవవైవిధ్యానికి ముప్పు అని పర్యావరణవేత్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈపై విచారణ సుప్రీంకోర్టు కొన్ని ప్రాథమికమైన ప్రశ్నలను లేవనెత్తింది. పర్యావరణ కార్యకర్తలు ఎప్పుడైనా, ఏదైనా అభివృద్ధి ప్రాజెక్టును స్వాగతించారా? అని ప్రశ్నించింది. పోర్టులు వంటి మౌలిక సదుపాయాలు విస్తరించకపోతే దేశం ఆర్థికంగా ఎలా ముందుకు వెళ్తుందని కూడా నిలదీసింది. ఈ వ్యాఖ్యలు ప్రజాప్రయోజన వ్యాజ్యాల సంస్కృతిపై జరుగుతున్న చర్చను మరింత తీవ్రం చేశాయి.
అభివృద్ధి పనులను నిరంతరం అడ్డుకోవడం వల్ల ప్రాజెక్టుల వ్యయం పెరగడమే కాకుండా.. విదేశీ పెట్టుబడిదారుల్లో నమ్మకం సడలుతుందనీ, అభివృద్ధి కోరుకునే వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, కలకత్తా హైకోర్టు ఈ అంశంపై భిన్నమైన, కీలకమైన కోణాన్ని ఆవిష్కరించింది. కేవలం జాతీయ ప్రాధాన్యత అనే కారణంతో ఏ ప్రాజెక్టు న్యాయ సమీక్షకు అతీతం కాదని స్పష్టం చేసింది. హక్కుల చట్టం ఉల్లంఘనలు, స్థానిక గిరిజన తెగలకు జరగబోయే నష్టంపై దాఖలైన పిటిషన్లను కొట్టివేయడానికి హైకోర్టు నిరాకరించింది. అభివృద్ధి అనేది చట్టబద్ధమైన, పర్యావరణ రక్షణలతో కూడి ఉండాలని న్యాయస్థానం కుండబద్దలు కొట్టింది. జాతీయ హరిత ట్రైబ్యునల్ ఎన్జీటీ ఇప్పటికే కొన్ని షరతులతో కూడిన అనుమతులు ఇచ్చినప్పటికీ, క్షేత్రస్థాయిలో ప్రాజెక్టు అమలుపై సందిగ్ధత ఇంకా కొనసాగుతోంది. పర్యావరణవేత్తల ప్రధాన ఆందోళన అంతా అక్కడి అరుదైన పగడపు దిబ్బలు(కోరల్ రీఫ్స్), ఆదివాసీల మనుగడను గురించే. ఒకసారి నాశనమైన పర్యావరణ వ్యవస్థను తిరిగి సృష్టించడం అసాధ్యమని వారు వాదిస్తున్నారు. పర్యావరణ అనుమతులు అనేవి కేవలం సాంకేతిక అడ్డంకులు కాదనీ, అవి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులలో భాగమని పర్యావరణ నిపుణులు అంటున్నారు. వ్యూహాత్మక ప్రాముఖ్యత పేరుతో నిబంధనలను పక్కన పెట్టడం వల్ల దీర్ఘకాలంలో తీవ్ర నష్టం వాటిల్లుతుందని చెబుతున్నారు.
ఈ మొత్తం వ్యవహారంలో ప్రజాప్రయోజన వ్యాజ్యాల పాత్ర కూడా చర్చనీయాంశమైంది. గతంలో వాయు కాలుష్యం, నాడుల ప్రక్షాళన వంటి విషయాల్లో న్యాయస్థానాలు ఈ పిటిషన్ల ద్వారా సామాన్యులకు న్యాయం చేశాయి. కానీ.. కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత అజెండాలతో ప్రాజెక్టులను నిలిపివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని న్యాయవ్యవస్థ కూడా గతంలో ఆందోళన వ్యక్తం చేసింది. గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు విషయంలో కూడా అటు అభివృద్ధి ప్రయోజనాలను, ఇటు పర్యావరణ మార్పును కాపాడాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఇటువంటి వివాదాలను సరిచేయడానికి శాస్త్రీయ డేటా ఆధారిత ప్రణాళికలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రాజెక్ట్ రూపకల్పన దశలోనే పర్యావరణ నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించే విధానాలను అనుసరించాలి. స్థానిక గిరిజన సమాజాల నుంచి కేవలం కాగితాల మీద సంతకాలు కాకుండా.. వారి నిజమైన భాగస్వామ్యాన్ని కోరడం ద్వారా వివాదాలను తగ్గించవచ్చు. ఇక పోతే.. అభివృద్ధి వర్సెస్ పర్యావరణం నిరంతరం సాగే వివాదం. గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ విషయంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు బాధ్యతాయుతమైన అభివృద్ధికి పునాది వేయవచ్చు. దేశ అభివృద్ధికి మౌలిక సదుపాయాలు ఎంత ముఖ్యమో.. భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించడం కూడా అంతే ముఖ్యం. ఈ నిష్పత్తి మధ్య సాధించినప్పుడే సస్టైనబుల్ డెవలప్మెంట్ లక్ష్యం నెరవేరుతుంది.
-సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చితే, దయచేసి https://www.teluguone.com పోర్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. భాగస్వామ్యం చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.
