టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌కు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. చెక్ బౌన్స్ కేసులో ఆయనకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ ఒంగోలు కోర్టు తీర్పు. అదనంగా రూ.95 లక్షల జరిమానా కూడా విధించింది. ఈ తీర్పు ప్రస్తుతం సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేసు వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా ముప్పాళ్ల గ్రామానికి చెందిన జెట్టి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి నుంచి బండ్ల గణేశ్ 2019లో రూ.95 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. ఈ మొత్తానికి సంబంధించి పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పేరుతో చెక్కు ఇచ్చారు. అయితే బ్యాంకులో నగదు లేకపోవడంతో ఆ చెక్కు బౌన్స్. దీంతో బాధితుడు ఒంగోలు కోర్టును ఆశ్రయించారు.
ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం ఇరువర్గాల వాదనలను పరిశీలించి బండ్ల గణనకు ఏడాది జైలు శిక్షతోపాటు భారీ జరిమానా విధించింది. అయితే తీర్పును సవాలు చేస్తూ పైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు నెల రోజుల గడువు ఇచ్చినట్లు సమాచారం. గతంలోనూ బండ్ల గణేష్ చెక్ బౌన్స్ వివాదాలతో వార్తల్లో నిలిచారు. 2017లో దర్శకుడు వక్కంతం వంశీకి సంబంధించిన చెక్ బౌన్స్ కేసులోనూ ఆయనకు జైలు శిక్ష, జరిమానా విధించినట్లు వార్తలు వచ్చాయి. పవన్ కల్యాణ్‌తో గబ్బర్ సింగ్, అల్లు అర్జున్‌తో ఇద్దరమ్మాయిలతో చిత్రాలను నిర్మించిన బండ్ల గణేశ్.. తనదైన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో తరచూ వార్తల్లో ఉంటారు. తాజాగా కోర్టు తీర్పుతో మరోసారి ఆయన పేరు చర్చకు వచ్చింది. ఈ వ్యవహారంలో బండ్ల గణేష్ తదుపరి ఎలాంటి న్యాయపరమైన చర్యలు తీసుకోవడం ఆసక్తికరంగా మారింది.
