తమిళనాడు రాజకీయ యవనికపై ప్రస్తుతం ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. రాష్ట్రంలోని ప్రధాన ద్రవిడ పార్టీలైన డీఎంకే, ఏఐఏడీఎంకేలు బయటకు ప్రత్యర్థులుగా కత్తులు దూసుకుపోతున్నప్పటికీ.. జాతీయ పార్టీ అయిన బీజేపీని అడ్డుకునే విషయంలో లోపాయికారీ ఒప్పందంతో ముందుకు వెళ్తున్నారా? గతంలో తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసిన అన్నామలై అప్పట్లో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం మళ్లీ తెరపైకి రావడం రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తోంది. ద్రవిడ అస్తిత్వం అనే ముసుగులో ఈ రెండు పార్టీలు బీజేపీ ఎదుగుదలను అడ్డుకునేందుకు సైలెంట్ అండర్ స్టాండింగ్ తో పని చేస్తున్నాయని ఆయన అప్పట్లోనే ప్రకటించారు.
బీజేపీ, అన్నాడీఎంకే పొత్తు విచ్ఛిన్నమైన 2023-24 కాలంలో అన్నామలై ఒక లోతైన విశ్లేషణ చేశారు. డీఎంకే , ఏఐఏడీఎంకేలు సిద్ధాంతపరంగా ఒకే మూలాల నుంచి వచ్చినవనీ.. అందుకే రాష్ట్రంలో మూడో శక్తికి లేకుండా చేయడంలో అవి ఏకమవుతాయని ఆయన అప్పట్లో చెప్పారు. ముఖ్యంగా అన్నాడీఎంకేకు చెందిన కొందరు నేతలు తనతో నేరుగా మాట్లాడుతూ.. మనం ద్ర విడ పార్టీలం, బీజేపీని లోపలికి రానివ్వకూడదు అని అన్నట్లు ఉన్నాయి. ప్రస్తుత పరిణామాలను గమనిస్తే అన్నామలై చేసిన రాజకీయ డయాగ్నోసిస్ సరైనదేనని అనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు.
తమిళనాడు రాజకీయాలు దశాబ్దాలుగా భాష, సంస్కృతి, ప్రాంతీయ అస్తిత్వం చుట్టూనే తిరుగుతున్నాయి. ద్రవిడ మోడల్ పేరుతో రాష్ట్రంలో పాతుకుపోయిన ఈ వ్యవస్థకు హిందుత్వ, జాతీయవాద రాజకీయాలు చేసే బీజేపీ ఒక పెద్ద సవాల్‌గా మారింది. అందుకే డీఎంకే, ఏఐఏడీఎంకేల మధ్య అధికార పోరు ఎంత తీవ్రంగా ఉన్నా.. సిస్టమ్‌కు ఎక్స్టర్నల్ ఛాలెంజ్‌గా మారిన బీజేపీని మాత్రం ఒక్క అవుట్‌సైడర్‌గా ఉంచాలని ప్రయత్నిస్తున్నాయి. ఈ ఇన్సైడ్ గేమ్‌లో భాగంగానే రెండు పార్టీలూ తమ అంతర్గత శత్రుత్వాన్ని పక్కన పెట్టి బీజేపీ ఓటు బ్యాంకు పెరగకుండా జాగ్రత్త పడుతున్నాయనే వాదన వినిపిస్తోంది.
అన్నామలై నాయకత్వంలో తమిళనాడు బీజేపీ తన శైలిని పూర్తిగా మార్చుకుంది. కేవలం పొత్తులపై ఆధారపడకుండా.. స్వతంత్రంగా ఎదిగేందుకు ఆయన యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. పాదయాత్రలు, సోషల్ మీడియా ద్వారా డీఎంకే ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తూనే.. ఏఐఏడీఎంకే తీరును కూడా తూర్పారబట్టారు. ఈ దూకుడు స్వభావం ద్రవిడ పార్టీల కంఫర్ట్ జోన్ ను ఇబ్బంది పెట్టింది. 2024 ఎన్నికల్లో సీట్ల పరంగా బీజేపీకి పెద్దగా లాభం చేకూరకపోయినా.. ఓట్ల శాతం పెరగడం రాష్ట్రంలో కమలం పార్టీకి ఓ సాఫ్ట్ బేస్ ఏర్పడిందనే సంకేతాలు వచ్చాయి.
అయితే.. ప్రస్తుతం బీజేపీ జాతీయ నాయకత్వం, అన్నామలై విజన్ మధ్య కొంత వ్యూహాత్మక భిన్నత్వం ఏర్పడింది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేను గద్దె దించడమే ప్రధాన లక్ష్యంగా ఢిల్లీ పెద్దలు, ఏఐఏడీఎంకేతో మళ్లీ పొత్తు పెట్టుకోనున్నారు. ఈ అన్నామలై వంటి దూకుడున్న నేతలను పక్కన పెట్టాలన్న ఏఐఏడీఎంకే డిమాండ్ కు తలొగ్గి.. అన్నామలైని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా బీజేపీ అధినాయకత్వం తొలగించింది.
ద్ర విడ పార్టీలు జాతీయ పార్టీలను ఎప్పుడూ కేవలం సహాయక శక్తులుగా మాత్రమే చూడాలని కోరుకుంటాయి. ముఖ్యమంత్రి పదవి లేదా నిర్ణయాత్మక శక్తి జాతీయ పార్టీల చేతుల్లోకి వెళ్లడం వారికి ఇష్టం ఉండదు. అధికారంలో ఉన్న బీజేపీతో సంబంధాలు పూర్తిగా తెంచుకోలేక.. అలాగని రాష్ట్రంలో స్పేస్ ఇవ్వలేక అవి కాంపిటీటివ్ కో-ఎగ్జిస్టెన్స్ మోడల్‌ను పరిశీలిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ విధంగా నే ప్రస్తుతం తమిళనాడులో విజయ్ ను గద్దెనెక్కనివ్వకుండా డీఎంకే ఏఐఏడీఎంకే కూటమిగా ఏర్పడి అధికారం చేజిక్కించుకునే వ్యూహంతో పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే అన్నాడీఎంకేతో అధికారం పంచుకునే ప్రశక్తే లేదని స్టాలిన్ కుండబద్దలు కొట్టేశారు. అయినా ద్రవిడ పార్టీలు రెండూ కలస్తాయన్న ఊహాగానాలకు మాత్రం తెరపడటం లేదు.
-సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చితే https://www.teluguone.com ను ఫాలో అవ్వండి. భాగస్వామ్యం చేయండి. మీ అభిప్రాయాలను తెలియజేయండి.
.webp)