కొంతమందికి రోజులో ఒక్కసారైనా పెరుగు తినటం అలవాటుగా ఉంటుంది. మరి కొంతమంది మధ్యాహ్నం భోజనంతో పాటు రాత్రి డిన్నర్లో కూడా పెరుగు తింటూ ఉంటారు. రాత్రిపూట పెరుగు తినడం సాధారణంగా ఆరోగ్యవంతులకు ఎలాంటి హాని చేయదు. కానీ, కొంతమందిలో జీర్ణక్రియ లేదా శ్వాసకోశ సమస్యలను పెంచే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆయుర్వేదం ప్రకారం పెరుగు కఫాన్ని పెంచుతుంది.
కాబట్టి సైనస్, ఆస్తమా పెరుగుతూ తరచుగా జలుబు లేదా గొంతు నొప్పితో బాధపడేవారు రాత్రిపూట తింటే కఫం పెరిగి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుంది. రాత్రి సమయంలో మన మెటబలిజం నెమ్మదిస్తుంది. అసిడిటీ, గ్యాస్ లేదా అజీర్తి సమస్యలు ఉన్నవారు రాత్రిపూట పెరుగు తింటే కడుపు ఉబ్బరం లేదా కడుపు బరువుగా అనిపించవచ్చు. ఆర్థరైటిస్ లేదా కీళ్ల నొప్పులతో బాధపడేవారిలో రాత్రిపూట పెరుగు తినడం వల్ల వాపు, నొప్పి కొద్దిగా పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ఈ జాగ్రత్తలు పాటించండి..
రాత్రిపూట గడ్డ పెరుగుకు బదులుగా పల్చటి మజ్జిగలో కొద్దిగా జీలకర్ర పొడి, ఇంగువ లేదా మిరియాల పొడి కలుపుకుని తాగడం వల్ల సులభంగా జీర్ణమవుతుంది. బాగా పులిసిన పెరుగును రాత్రిపూట అస్సలు తినకూడదు. ఇది అసిడిటీని పెంచుతుంది. ఫ్రిజ్లో పెట్టిన చల్లని పెరుగుకు బదులుగా సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఉన్న పెరుగును తినడం మంచిది.
