హైదరాబాద్ శివారులోని గండిపేట ప్రాంతంలో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని నకిలీ పత్రాలతో కాజేసి విక్రయించేందుకు ప్రయత్నించిన భారీ భూ మోసాన్ని లింగంపల్లి పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న నిమ్మల కుటుంబ సభ్యులతో పాటు పలువురిపై కేసులు నమోదు చేసి, ముగ్గురిని అరెస్ట్ చేశారు.
మరోవైపు మాజీ ఎమ్మెల్యేతో సహా పలువురు నిందితులను పరారీలో పోలీసులు ఉంచారు.
షేర్ లింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ మీడియా సమావేశంలో వెల్లడించిన వివరాల ప్రకారం.. వెల్లి రాధాకృష్ణ అనే వ్యక్తి అడ్వకేట్ అయినప్పటికి తాను సవాల్‌లో ఉద్యోగిగా, అసిస్టెంట్ కలెక్టర్‌గా పనిచేస్తున్నట్లు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశాడు. తన పేరుకు చివరగా “డాక్టర్” అనే పదాన్ని కూడా జోడించి పలువురిని మోసం చేసినట్లు పేర్కొన్నారు.గండిపేట పరిధిలోని సర్వే నెంబర్ 18లో ఉన్న ప్రభుత్వ పోరంబోకు భూమిపై హక్కులు చూపిస్తూ నిమ్మల కుటుంబ సభ్యులు చాలా కాలంగా క్లెయిమ్ చేస్తున్నారు.
నకిలీ జీఓలు, ఫోర్జరీ పత్రాలు సృష్టించి భూమి తమ పేరుపై క్రమబద్ధీకరించబడిందని ప్రచారం చేశారు. ఐదు నకిలీ ప్రభుత్వ ప్రకటనలు (జీఓలు) తయారు చేసి వాటిని వాట్సాప్, సోషల్ మీడియా వేదికలు వైరల్ చేశారు. భూమి యాజమాన్య హక్కుల కోసం నిందితులు హైకోర్టును ఆశ్రయించినప్పటికీ, 2025 అక్టోబర్‌లో వారి పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. అయినప్పటికీ చట్టబద్ధమైన హక్కులు లేకుండానే ఎకరాకు రూ.3.5 కోట్ల చొప్పున భూమిని విక్రయించేందుకు కుట్ర పన్నినట్లు దర్యాప్తులో బయటపడింది.
ఈ అక్రమ భూ డీల్‌లో వినుకొండకు చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పేరు కూడా వెలుగులోకి వచ్చింది. నిందితులు బొల్లా బ్రహ్మనాయుడు, బొల్లా రమేష్‌లతో భూమి అమ్మకానికి ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు పోలీసులు గుర్తించారు. బ్రహ్మనాయుడు నుంచి నిమ్మల కుటుంబ సభ్యుల ఖాతాలకు రెండు విడతల్లో రూ.1 కోటి, రూ.25 లక్షలు బదిలీ అయినట్లు ఆధారాలు లభించాయి.
మొత్తంగా ఈ అక్రమ భూ వ్యవహారంలో రూ.1500 కోట్లకు పైగా చేతులు మారినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తహసీల్దార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టు అనుమతితో నిందితుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంక్ పాస్‌బుక్స్, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు సహా కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో నిమ్మల రాజేష్ గౌడ్, నిమ్మల వేణుగోపాల్, నిమ్మల సాయికిరణ్‌లను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బొల్లా రమేష్, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, సునీల్ ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ భూములను నకిలీ పత్రాలతో కాజేసే ప్రయత్నాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఈ కేసులో మరిన్ని వివరాల వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.
